August: ఆగస్టు... అదరగొడతారా?

ABN , First Publish Date - 2023-07-30T02:43:36+05:30 IST

టాలీవుడ్‌(Tollywood)లో సరికొత్త వినోదానికి ఆగస్టు(August.) వేదిక కానుంది. సీనియర్‌ హీరోలు, జూనియర్‌ హీరోలు పోటాపోటీగా వెండితెరపై సందడికి సిద్ధమయ్యారు.

August: ఆగస్టు...  అదరగొడతారా?

టాలీవుడ్‌(Tollywood)లో సరికొత్త వినోదానికి ఆగస్టు(August.) వేదిక కానుంది. సీనియర్‌ హీరోలు, జూనియర్‌ హీరోలు పోటాపోటీగా వెండితెరపై సందడికి సిద్ధమయ్యారు. ఆగస్టు నెలలో మొత్తం 15కు పైగా చిత్రాలు విడుదలవుతున్నాయి. స్ట్రెయిట్‌, డబ్బింగ్‌ చిత్రాలతో పాటు మంచి హైప్‌తో వస్తున్న పలు హిందీ సినిమాలు ప్రేక్షకులకు ఏ మేరకు వినోదం పంచుతాయో చూడాలి.

తొలివారంలో రెండు తమిళ డబ్బింగ్‌ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆగస్టు 4న విడుదలవుతున్న ఏకైక తెలుగు స్ట్రెయిట్‌ చిత్రం ‘రాజుగారి కోడి పులావ్‌’. అనుష్క నటించిన ‘మిస్‌శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ విడుదల వాయిదా పడింది. అదే రోజు రెండు తమిళ డబ్బింగ్‌ చిత్రాలు విడుదలవుతున్నాయి. కిచ్చా సుదీప్‌ హీరోగా నటించిన ‘హెబ్బులి’ క్రికెటర్‌ ధోనీ నిర్మించిన ‘ఎల్‌జీఎం’ ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి.

హిందీలో సీక్వెల్స్‌ వార్‌

5.jpg

హిందీ చిత్రాల సీక్వెల్స్‌ ఆగస్టులో విడుదలవుతున్నాయి. అక్షయ్‌కుమార్‌ ప్రధాన పాత్ర పోషించిన ‘ఓ మైగాడ్‌ 2’ చిత్రం 11న ప్రేక్షకుల ముందుకొస్తోంది. మరో సీనియర్‌ హీరో సన్నీడియోల్‌ హీరోగా నటించిన ‘గదర్‌ 2’ కూడా అదే రోజు విడుదలవుతోంది. ఇవి రెండూ సీక్వెల్స్‌ కావడం విశేషం. మొదటి భాగాలు హిట్‌ అవడంతో ఇప్పుడు రెండో పార్ట్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. ‘ఓ మై గాడ్‌’2తో హీరోగా తిరిగి తన మునుపటి ఫామ్‌ను అందుకోగలననే నమ్మకంతో అక్షయ్‌ ఉన్నారు. ఇందులో ఆయన పరమశివుడి పాత్రలో కనిపించనున్నారు. అక్షయ్‌కుమార్‌, పరేశ్‌ రావెల్‌ ముఖ్యపాత్రలు పోషించిన ‘ఓ మై గాడ్‌’ 2012లో విడుదలై ఘన విజయాన్ని అందుకొంది. ఆ సినిమాని తెలుగులో పవన్‌కల్యాణ్‌, వెంకటేశ్‌ ‘గోపాల గోపాల’ పేరుతో రీమేక్‌ చేశారు. సీక్వెల్‌లో యామీ గౌతమ్‌, పంకజ్‌ త్రిపాఠి కీలకపాత్ర పోషించారు. అయితే పౌరాణిక కథాంశంతో తెరకెక్కిన చిత్రం కావడంతో సెన్సార్‌బోర్డ్‌ జాగ్రత్తలు తీసుకుంటోంది. వివాదం రేకెత్తే అవకాశం ఉండడంతో 20 కట్స్‌ చెప్పినట్లు సమాచారం. సెన్సార్‌బోర్డ్‌ నియమించిన రివిజన్‌ కమిటీ ఏ సర్టిఫికెట్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో చిత్రయూనిట్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా సెన్సార్‌ కంప్లీట్‌ కాకపోవడంతో సినిమా విడుదల రెండు వారాలు వాయిదాపడే అవకాశం ఉంది.

‘గదర్‌ 2’ లాంటి భారీ పీరియాడిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌తో సత్తా చాటాలనుకుంటున్నారు సన్నీడియోల్‌. 22 ఏళ్ల క్రితం వచ్చిన ‘గదర్‌’ చిత్రానికి ఇది సీక్వెల్‌. అప్పట్లో వివాదాలతో పాటు సంచలన వసూళ్లను సాధించింది. సన్నీడియోల్‌, అమీషా పటేల్‌ ఇమేజ్‌ పెంచింది. 1971లో జరిగిన ఇండియా-పాకిస్థాన్‌ యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అనిల్‌ శర్మ స్వీయదర్శకత్వంలో నిర్మించారు.

ఆగస్టు చివరి వారంలో మరో హిందీ సీక్వెల్‌ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. 25న ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా నటించిన ‘డ్రీమ్‌గర్ల్‌ 2’ విడుదలవుతోంది. ఆయన ప్రధాన పాత్ర పోషించిన ‘డ్రీమ్‌గర్ల్‌’ చిత్రానికి ఇది సీక్వెల్‌. కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కరమ్‌వీర్‌సింగ్‌, పూజ అనే రెండు పాత్రల్లో ఆయుష్మాన్‌ వినోదం పంచనున్నారు. రాజ్‌ శాండిల్య దర్శకత్వంలో ఏక్తాకపూర్‌ నిర్మించారు. అనన్యాపాండే కథానాయిక.

డబ్బింగ్‌ చిత్రాలు

6.jpg

ఈ సారి టాలీవుడ్‌లో ఆసక్తికర పోరు జరగబోతోంది. టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవితో కోలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ డీ కొట్టబోతున్నారు. ‘భోళాశంకర్‌’ విడుదలకు ఒక రోజు ముందు, ఆగస్టు 10న రజనీకాంత్‌ ‘జైలర్‌’ చిత్రంతో థియేటర్లలో సందడి చేయనున్నారు. కొన్నాళ్లుగా ఫామ్‌లో లేని రజనీ, ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్‌బస్టర్‌తో మాంచి ఊపు మీదున్న చిరూతో బాక్సాఫీసు దగ్గర తలపడడాన్ని ఇండస్ట్రీ ఆసక్తిగా గమనిస్తోంది.


7.jpg

మెగా సందడి

జూలైలో మామా అల్లుళ్లు పవన్‌ కల్యాణ్‌, సాయితేజ్‌ ‘బ్రో’తో వినోదం పంచారు. ఆగస్టు నెల్లో కూడా మెగా ఫ్యామిలీ సందడి చేయనుంది. రెండో వారంలో చిరంజీవి ‘భోళాశంకర్‌’తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. మూడో వారంలో వైష్ణవ్‌తేజ్‌ ‘ఆదికేశవ’గా వస్తున్నాడు. నాలుగో వారంలో వరుణ్‌తేజ్‌ ‘గాంఢీవధారి అర్జున’ చిత్రంతో యాక్షన్‌ పంచేందుకు సిద్ధమవుతున్నారు.

ఒకే రోజు నాలుగు చిత్రాలు

మూడో వారంలో పెద్ద సినిమాలేవీ థియేటర్లలోకి రావడం లేదు. ఆగస్టు 18న నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. పంజా వైష్ణవ్‌తేజ్‌ హీరోగా రూపొందిన ‘ఆదికేశవ’, శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించిన ‘పెదకాపు 1’ చిత్రాలపై అంచనాలు ఉన్నాయి. సొహైల్‌ హీరోగా నటించిన ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’, ‘నచ్చినవాడు’ అనే చిన్న చిత్రం విడుదలవుతున్నాయి.

8.jpg

విజేతలెవరో?

ఆగస్టులో తుదిపోరులో వరుణ్‌తేజ్‌, కార్తికేయ బరిలో నిలుస్తున్నారు. వరుణ్‌తేజ్‌ నటించిన ‘గాంఢీవధారి అర్జున’, కార్తికేయ నటించిన ‘బెదురులంక 2012’ చిత్రాలు ఆగస్టు 25న విడుదలవుతున్నాయి. ‘గాంఢీవధారి అర్జున’ పూర్తి స్థాయి యాక్షన్‌ ఎంటర్టైనర్‌గా రూపొందింది. సాక్షి వైద్య వరుణ్‌కు జోడీగా నటించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రానికి ప్రవీణ్‌ సత్తారు దర్శకుడు. శత్రువుల బారి నుంచి దేశాన్ని కాపాడే సీరియస్‌ మిషన్‌ కోసం వరుణ్‌ చేసిన సాహసాలు ఈ చిత్రానికి హైలెట్‌. కార్తికేయ హీరోగా నటించిన పీరియాడిక్‌ చిత్రం ‘బెదురులంక 2012’. నేహాశెట్టి కథానాయిక. క్లాక్స్‌ తెరకెక్కించారు. ఇప్పటివరకూ గోదావరి నేపథ్యంలో వచ్చిన రూరల్‌ డ్రామాలకు ఈ చిత్రం భిన్నంగా ఉంటుంది, ప్రేక్షకుల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళుతుందని దర్శకుడు అంటున్నారు.

హాలీవుడ్‌ మూవీతో అలియా

గాల్‌ గాడోట్‌, అలియాభట్‌ ప్రధానపాత్రల్లో నటించిన హాలీవుడ్‌ చిత్రం ‘హార్ట్‌ ఆఫ్‌ ది స్టోన్‌’. ఈ స్పై యాక్షన్‌ చిత్రం తెలుగుతో సహా పలు భారతీయ భాషల్లో ఆగస్టు 11న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవనుంది.

దుల్కర్‌ తొలి వెబ్‌సిరీస్‌ ‘ది ఫ్యామిలీమాన్‌’, ‘ఫర్జీ’ లాంటి వెబ్‌సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది రాజ్‌ అండ్‌ డీకే ద్వయం. ఈ దర్శకుల నుంచి వస్తున్న మరో ఆసక్తికర క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ ‘గన్స్‌ అండ్‌ గులాబ్స్‌’. మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌, బాలీవుడ్‌ హీరో రాజ్‌కుమార్‌ రావు ప్రధాన పాత్రలు పోషించారు. ఆగస్టు 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవనుంది. దుల్కర్‌కు ఇది తొలి వెబ్‌సిరీస్‌. ఇందులో ఆయన స్టైలిష్‌ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. 90వ దశకంలో గులాబ్‌గంజ్‌ అనే ప్రాంతంలో పోలీసులు, గ్యాంగ్‌స్టర్స్‌కు మధ్య జరిగిన పోరాటం ఆధారంగా ఈ సిరీస్‌ తెరకెక్కింది.

Updated Date - 2023-07-30T02:43:36+05:30 IST