Wings of Glory: ఆశలకు ప్రతిరూపం
ABN , Publish Date - Mar 28 , 2025 | 01:44 AM
క్షీరసాగర మథనంలో ఉద్భవించిన ఉచ్చైశ్రవం స్వేచ్ఛ, పరాక్రమం, ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకంగా నిలిచింది. పురాణాల్లో ఉచ్చైశ్రవం దేవతలు, అసురులు, విష్ణు, లక్ష్మీ దేవి, చంద్రుడు, శివుడు, బలిచక్రవర్తి వంటి అనేక మహత్తర వ్యక్తులతో సంబంధం కలిగినట్టు ప్రస్తావించబడింది.

తెలుగు వారి కొత్త సంవత్సరం ‘విశ్వావసు’ మన ముంగిటకు వచ్చేస్తోంది. కొత్త సంవత్సరం కొత్త ఆశలకు తెర తీస్తోంది. ఇలాంటి ఆశలకు ప్రతి రూపమే మన పురాణాలలో అభివర్ణించిన రెక్కల గుర్రం- ఉచ్చైశ్రవం. భౌతిక పరిమితులను అధిగమించి.. పురోగతిని, ఆధ్యాత్మిక శక్తిని పొందాలనుకొనేవారికి ఇది మార్గదర్శి. స్వేచ్ఛ కోసం, అసాధారణ శక్తి సంపన్నత కోసం, ఆధ్యాత్మిక ప్రగతి కోసం తపన పడిన ‘మనీషి’గా మారిన మనుషి ఆలోచనల నుంచి ఉద్భవించిన లోతైన తాత్త్విక భావన ఇది. ప్రాచ్య, పాశ్చాత్య పురాణాలన్నింటిలోనూ ఈ ఉచ్చైశ్రవ ప్రస్తావన ఉంది.
క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఏడు తలలతో తెల్లని కాంతులీనే దివ్యాశ్వం ఉద్భవించింది. దేవ లోకాన్ని, మానవ లోకాన్ని కలిపే ఆశ్వమిది. ‘నరసింహ పురాణం’ ప్రకారం దేవతలు, అసురులు అమృతాన్ని పొందేందుకు క్షీరసాగరాన్ని మథించడం ప్రారంభించారు. దఫదఫాలుగా వేల సంవత్సరాలు సాగిన ఈ మథనంలో అనేక దివ్య వస్తువులు, జీవులు ఉద్భవించాయి. ఇలా రెండో మథనంలో బయటకు వచ్చినవి- ఐరావతం, ఉచ్చైశ్రవం. ఐరావతం ఐశ్వర్యానికి ప్రతీక. ఉచ్చైశ్రవం స్వేచ్చకు, పరాక్రమానికి, ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక. ‘దేవీ భాగవతం- 6వ అధ్యాయం’లో దీనికి సంబంధించిన ఒక కథ ఉంది. ఒక రోజు సూర్యపుత్రుడు రేవంతుడు ఉచ్చైశ్రవాన్ని ఎక్కి వైకుంఠానికి వస్తాడు.
ఆ అశ్వం అందానికి లక్ష్మీదేవి మంత్రముగ్దురాలై తనని తాను మర్చిపోయి చూస్తూ ఉండిపోతోంది. విష్ణువు ఆమెను అనేకసార్లు పిలుస్తాడు. ఆమె పలకదు. దీనితో విష్ణువుకు కోపం వచ్చి - ‘‘అశ్వాన్ని చూసి మైమరచిపోయావు కాబట్టి నువ్వు భూలోకంలో అశ్వరూపంలో జన్మించు’’ అని శపిస్తాడు. అప్పుడు శ్రీవిష్ణువును లక్ష్మీదేవి వేడుకుంటుంది. ‘‘భూలోకంలో నాతో సమానమైన కుమారుడిని పొందినప్పుడు మళ్ళీ నా సఖిగా చేరతావు...’’ అని లక్ష్మీదేవికి అనుగ్రహిస్తాడు. మనస్సు నిలకడగా లేకపోతే- అది ఎంత దివ్య సంబంధాన్నైనా దూరం చేస్తుందనేది ఈ కథ సారాంశం.
స్థల పురాణాలు కూడా...
సుప్రసిద్ధి చెందిన నాగేశ్వర తీర్థం ఏర్పడటానికి ఉచ్చైశ్రవం కారణమని అక్కడి స్థల పురాణాలు చెబుతాయి. వీటి ప్రకారం- కశ్యప మహర్షి భార్యలు- కద్రువ, వినతలకు ఉచ్చైశ్రవం రంగు విషయంలో వాదన జరుగుతుంది. కద్రువ ఆ అశ్వం నల్లదని, వినత అది తెల్లదని వాదించుకుంటారు. తన వాదనను నెగ్గించుకుందుకు కద్రువ- తన సర్ప కుమారులను వెళ్లి ఉచ్చైశ్రవాన్ని చుట్టుకొమ్మని ఆజ్ఞాపిస్తుంది. దీని ద్వారా అశ్వం నల్లదని వినతకు నిరూపించవచ్చనేది కద్రువ భావన. దానికి ఆమె కుమారులు అంగీకరించరు. దీనితో కద్రువకు కోపం వచ్చి తన కుమారులను శపిస్తుంది. ఈ శాపవిముక్తి కోసం వారందరూ నాగేశ్వర తీర్థం వద్దకు వచ్చి శివుణ్ణి ప్రార్థిస్తారు. వారికి శివుడు విముక్తి ప్రసాదిస్తాడు.
ఇలాంటి మరో స్థల పురాణం వటవటేవ్వర తీర్థం ఎలా ఉద్భవించిందనే విషయాన్ని చెబుతుంది. దీని ప్రకారం ఉచ్చైశ్రవానికి అశ్వపర్ణ, సుపర్ణ, మధుపర్ణ, మరుద్గతి అనే నలుగురు కుమారులు ఉంటారు. అశ్వపర్ణ- చంద్రుడి వాహనం. వటవటేశ్వర తీర్థంలో శంకరుడి కోసం చంద్రుడు తపస్సు చేయటం మొదలుపెడతాడు. ఆయనతో పాటు అశ్వపర్ణ కూడా తపస్సు ప్రారంభిస్తాడు. కానీ కొద్ది కాలానికి శక్తి క్షీణించి పడిపోతాడు. అప్పుడు శంకరుడు ప్రత్యక్షమై అశ్వపర్ణకు పరిపూర్ణమైన శరీరాన్ని ప్రసాదిస్తాడు. ఒక గుర్రం శివుడి దర్శనం పొందిన ఆ ప్రాంతాన్ని ‘వటవటేశ్వర తీర్థం’ అని పిలుస్తారు. ఈ ప్రాంతంలోనే ప్రవహించే నదికి ‘అశ్వపర్ణి’ అని పేరు.
భగవద్గీతలో కూడా...
భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో- ‘‘అశ్వాలలో ఉత్తమమైన ఉచ్చైశ్రవాన్ని నేనే. ఏనుగుల్లో రాజైన ఐరావతాన్ని నేనే! మనుషుల్లో సమ్రాట్టును నేనే’’ అని పేర్కొంటాడు. ‘బ్రహ్మవైవర్తపురాణం’లోని ‘బ్రహ్మఖండం’లో గోపుల రాజు ఉచ్చైశ్రవ వంశానికి చెందిన ఐదు లక్షల గుర్రాలను, వేల రథాలను, మూడు లక్షల ఎద్దుల బండ్లను దానం చేసినట్టు ఉంది. ‘స్కాందపురాణం’లోని ‘మాహేశ్వర ఖండం’ (కేదార ఖడం)లో సూర్యుడి వాహనంగా ఉచ్చైశ్రవాన్నిపేర్కొన్నారు. మరికొన్ని పురాణాలు బలిచక్రవర్తి వాహనంగా దీన్ని ప్రస్తావించాయి.
గ్రీకు పురాణాల ప్రకారం- మెడూసా అనే వీరుడి తలని పెర్సియస్ నరుకుతాడు. ఆ రక్తం నుంచి పెగాసస్ అనే రెక్కల గుర్రం జన్మించింది. బెల్లెరోఫోన్ అనే యోధుడు దీని సహాయంతో చిమేరా అనే భయంకర రాక్షసిని సంహరిస్తాడు. ఆ తర్వాత అతను అహంకారంతో దేవలోకానికి చేరాలనుకుంటాడు. అప్పుడు పెగాసెస్ అతణ్ణి పాతాళానికి తొక్కేస్తుంది. దురహంకారం మనిషిని అధఃపాతాళానికి చేరుస్తుందనటానికి ఉదాహరణగా ఈ కథను చెబుతారు.
మహమ్మద్ ప్రవక్త ‘బురాఖ్’ అనే రెక్కల గుర్రాన్ని అధిరోహించిన ప్రస్తావన ఇస్లాంలో ఉంది. ఈ గుర్రం కాళ్ళు భూమిపై ఆనవు. అది వాయు-మనోవేగాలతో ప్రయాణిస్తుంది.
మంగోలియన్ పురాణాల ప్రకారం తుల్లార్ అనే రెక్కల గుర్రం వీరులందరికీ సాయపడుతూ ఉంటుంది. మరణానంతరం వారికి ఉత్తమలోకాలకు తీసుకువెళ్తుంది.
చైనీయులు లాంగ్మా అనే రెక్కల గుర్రం పుణ్యఫలాలను తీసుకువస్తుందని నమ్ముతారు. వాస్తవానికి ఇది డ్రాగన్ - అశ్వాల మిశ్రమం.
- డాక్టర్ జి.వి.పూర్ణచంద్
ఈ వార్తలు కూడా చదవండి:
Top Secret: చనిపోయే ముందు శరీరంలో మొదట ఆగిపోయే అవయవం ఏదింటే..
Iftar Party: ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
KTR: అలా అయితే రాజకీయాలకు గుడ్ బై
Night Food: రాత్రుళ్లు ఈ ఆహారం తీసుకోండి.. షుగర్ రమ్మనా రాదు..
Curd Rice:పెరుగన్నం తింటే లాభమా నష్టమా.. ఎందుకు తినాలి
Milk: పాలు తాగిన వెంటనే ఇవి తీసుకోంటే.. డేంజర్
LRS : ఎల్ఎస్ఆర్ లీల.. రూ. 14 లక్షల భూమికి రూ. 28 కోట్ల ఎల్ఆర్ఎస్ ఛార్జెస్..
ఈ పువ్వుతో ఇన్ని లాభాలున్నాయా..?