Rashi Khanna : విధిని నమ్ముతా

ABN , First Publish Date - 2023-02-19T03:08:45+05:30 IST

అల్లరి అమ్మాయిగా.. తన వృత్తిని ప్రేమించే ప్రభుత్వ ఉద్యోగిగా.. లేదా పూర్తి కమర్షియల్‌ హీరోయిన్‌గా.. తనకు ఇచ్చిన ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే కొద్ది మంది నటీమణుల్లో రాశీ ఖన్నా ఒకరు. ప్రముఖ హిందీ నటుడు షాహీద్‌ కపూర్‌ జోడిగా నటించిన ‘ఫర్జి’ ఇటీవలే ఆమెజాన్‌ ప్రైమ్‌లో ..

Rashi Khanna : విధిని నమ్ముతా

అల్లరి అమ్మాయిగా.. తన వృత్తిని ప్రేమించే ప్రభుత్వ ఉద్యోగిగా.. లేదా పూర్తి కమర్షియల్‌ హీరోయిన్‌గా.. తనకు ఇచ్చిన ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే కొద్ది మంది నటీమణుల్లో రాశీ ఖన్నా ఒకరు. ప్రముఖ హిందీ నటుడు

షాహీద్‌ కపూర్‌ జోడిగా నటించిన ‘ఫర్జి’ ఇటీవలే ఆమెజాన్‌ ప్రైమ్‌లో

విడుదలయి విజయవంతమయింది. ఈ నేపథ్యంలో రాశీ ఖన్నాను

‘నవ్య’ పలకరించింది. అప్పుడు ఆమె చెప్పిన కబుర్లువి...

  • ఓటీటీలలో సిరీ్‌సలు చేశాను కాబట్టి.. ప్రస్తుతం సినిమాలపైనే దృష్టి పెడుతున్నా. మంచి మంచి పాత్రలు వస్తున్నాయి. వచ్చే నెలలో తెలుగు సినిమా అనౌన్స్‌మెంట్‌లు ఉంటాయి.

  • నా కెరీర్‌ పట్ల సంతృప్తిగానే ఉన్నా. సాధారణంగా నేను గతంలో లేదా భవిష్యత్తులో జీవించను. వర్తమానంలో వాస్తవికంగా బతుకుతాను. అందువల్ల నాకు అసంతృప్తి ఉండదు. ఎప్పుడూ ఆనందంగానే ఉంటా!

  • అందరూ ‘‘పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు?’’ అని అడుగుతున్నారు. ప్రస్తుతం నా ఫోకస్‌ అంతా నా కెరీర్‌ మీదే ఉంది. ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవాలనుకోవటం లేదు. పెళ్లి విషయంలో నాకు ఇంకా స్పష్టత రాలేదు. వచ్చినప్పుడు చేసుకుంటా!

  • ఇక్కడ ఒక విషయాన్ని కూడా చెప్పాలి. ఒకప్పుడు పెళ్లి అయితే హీరోయిన్‌ కెరీర్‌కి ఫుల్‌స్టాప్‌ పడిందనుకొనేవారు. కానీ ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత కూడా నటిస్తున్నారు. ఆలియా, దీపికలకే పెద్ద ఉదాహరణలు.

  • ఇప్పటి దాకా నాకు నచ్చిన పాత్ర- ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’లోని యామిని. ఈ పాత్ర నటించటం చాలా కష్టం. ఈ పాత్రలో నేను ఒదిగిపోయాను. షూటింగ్‌ పూర్తయిన తర్వాత చాలా కాలం ఈ పాత్ర నన్ను డిస్ట్రర్బ్‌ చేసింది.

సండే సెలబ్రిటీ

‘‘ఫర్జీలో నాది ఆర్‌బీఐలో పనిచేసే ఒక మధ్యతరగతి ఉద్యోగి పాత్ర. పేరు మేఘ. బాగా చదువుకుంటుంది. దొంగ నోట్లను కనిపెట్టే ఒక మిషన్‌ను రూపొందిస్తుంది. కొన్ని పరిస్థితుల్లో ఆమె విజయ్‌ సేతుపతి దగ్గర దొంగనోట్ల సిండికేట్‌ను పట్టుకొనే టీంలో పనిచేయాల్సి వస్తుంది. ఈ పాత్రకు ప్రేక్షకుల నుంచి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. దీనిని తెలుగు, తమిళంలో కూడా విడుదల చేశారు. దీనితో ఆ భాషల్లో ఉన్న నా అభిమానులు మెసేజ్‌లు పెడుతున్నారు.

చాలా మంది ఫర్జీలో మేఘ, నిజ జీవితంలో రాశీ ఒకేలా ఉంటారా? అని అడుగుతున్నారు. కొంత వరకు మా మధ్య సారూప్యత ఉంది. ఉదాహరణకు మేఘకు తన వృత్తి పట్ల విపరీతమైన ప్రేమ ఉంటుంది. రాత్రి, పగలు అని లేకుండా కష్టపడుతుంది. చిక్కుల్లో చిక్కుకుంటుంది కూడా.. నేను కూడా అంతే!

ఓటీటీలలో...

నా ఉద్దేశంలో ఓటీటీలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత మహిళ పాత్రలకు ప్రాధాన్యత బాగా పెరిగింది. వెబ్‌ సిరీ్‌సలలో బాగా డెప్త్‌ ఉన్న మహిళ పాత్రలు వస్తున్నాయి. సాధారణంగా సినిమాల్లో హీరోయిన్‌ పాత్రలకు ప్రాధాన్యత తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు నేను చాలా కమర్షియల్‌ సినిమాలు చేశా. వీటిలో హీరోయిన్‌కు ప్రాధాన్యత తక్కువే ఉంటుంది. అయితే ఓటీటీలలో అలా కాదు. మంచి పాత్రలు లభిస్తాయి. నేను ఇప్పటి దాకా రుద్ర, ఫర్జీ- రెండు సిరీ్‌సలు చేశా. రెండింటిలలో నాకు నటించటానికి అవకాశమున్న పాత్రలే లభించాయి. చాలా మంది ఫర్జీలో మేఘ, నిజ జీవితంలో రాశీ ఒకేలా ఉంటారా? అని అడుగుతున్నారు. కొంత వరకు మా మధ్య సారూప్యత ఉంది. ఉదాహరణకు మేఘకు తన వృత్తి పట్ల విపరీతమైన ప్రేమ ఉంటుంది. రాత్రి, పగలు అని లేకుండా కష్టపడుతుంది. చిక్కుల్లో చిక్కుకుంటుంది కూడా.. నేను కూడా అంతే! నాకు నటన తప్ప వేరే వ్యాపకమే ఉండదు. అయితే మేఘ తను అనుకున్న పనిని ఏదో ఒక విధంగా పూర్తి చేస్తుంది. చట్టపరంగా చేస్తున్నామా? లేదా అనే విషయాన్ని కూడా పట్టించుకోదు. కానీ నేను విధిని నమ్ముతా. జరిగేది జరగక మానదు.. అంతా ముందే రాసిపెట్టి ఉంటుందనేది నా నమ్మకం. ఇక్కడ ఇంకో కోణం కూడా చెప్పాలి. మేఘ ప్రతి విషయంలో రిస్క్‌ తీసుకుంటుంది. నేను కూడా అంతే! అసలు నటనంటేనే రిస్క్‌. ఒక కాంట్రాక్టు మీద సంతకం చేస్తున్నప్పుడు ఆ సినిమా ఆడుతుందో లేదో తెలియదు. కథ విని రిస్క్‌ చేస్తాం. ఈ కోణంలో చూస్తే నేనూ రిస్క్‌ తీసుకుంటా!

rasi-khana.jpg

సర్దుకుపోవాలి...

ప్రతి వృత్తిలోనూ మహిళల పట్ల కొంత చిన్న చూపు ఉంటుంది. మహిళలను ఉన్నత స్థానాల్లో వెంటనే అంగీకరించరు. వారు పోరాడాల్సి వస్తుంది. సినిమాలు.. మీడియా.. ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇలా ఏ రంగాన్నైనా తీసుకోండి. ఇది తప్పదు. ఉదాహరణకు ఒక స్త్రీ, ఒక పురుషుడు ఒకేసారి ఉద్యోగంలో చేరారనుకుందాం. పురుషుడికి వెంటనే తన వృత్తి నైపుణ్యాలు నిరూపించుకోవాల్సిన అవసరం ఉండదు. అందరూ వారికి నైపుణ్యం ఉందని నమ్ముతారు. కానీ మహిళలు మాత్రం తమ నైపుణ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అంతదాకా ఎందుకు.. సినిమాలనే తీసుకుందాం. కమర్షియల్‌ సినిమాల్లో నటించే హీరోయిన్లంటే ప్రేక్షకుల్లో కొంత చులకన భావం ఉంటుంది. వారి మేధో సంపత్తిపై అనేక అనుమానాలుంటాయి. హీరోల విషయంలో అలాంటి అనుమానాలేమి ఉండవు. ‘‘తొలి ప్రేమ’’ సినిమా దాకా నన్ను చాలా మంది ప్రేక్షకులు సీరియస్‌గా తీసుకోలేదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా సర్దుకుపోయి మన ప్రత్యేకతను చాటుకోవాలి. ఎందుకంటే మనుషుల్లో పేరుకుపోయిన భావాలు అంత త్వరగా పోవు. సమానత్వమనేది అంత సులభంగా రాదు. ఇక నా విషయానికి వస్తే మొదటి నుంచి నేను ఇటు కంటెంట్‌ ఉన్న సినిమాల్లోనూ.. అటు కమర్షియల్‌ సినిమాల్లోనూ నటించాను. ఈ విధంగా నేను చాలా అదృష్టవంతురాలిని.

సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌

Updated Date - 2023-02-19T03:09:17+05:30 IST