Jena Chung: కొరియాలో రామమందిర నిర్మాణమే లక్ష్యం
ABN , First Publish Date - 2023-05-15T03:31:03+05:30 IST
ప్రపంచంలోని విజయవంతమైన మహిళా వ్యాపారవేత్తల్లో ఒకరుగా ఆమెను అమెరికాకు చెందిన ‘గ్లోబల్ ట్రేడ్ ఛాంబర్’ గుర్తించింది. అంతర్జాతీయ దౌత్యవేత్తల సంఘానికి ఆమె సీఈఓగా ఉన్నారు.

జినా చుంగ్... దక్షిణ కొరియాకు చెందిన పారిశ్రామికవేత్త.
ప్రపంచంలోని విజయవంతమైన మహిళా వ్యాపారవేత్తల్లో ఒకరుగా ఆమెను అమెరికాకు చెందిన ‘గ్లోబల్ ట్రేడ్ ఛాంబర్’ గుర్తించింది. అంతర్జాతీయ దౌత్యవేత్తల సంఘానికి ఆమె సీఈఓగా ఉన్నారు. అవకాశం దొరికినప్పుడల్లా ఆమె భారత దేశంలో పర్యటించి, వివిధ ఆధ్యాత్మిక స్థలాలను సందర్శిస్తూ ఉంటారు. ఢిల్లీలో ‘ఆంధ్రజ్యోతి ప్రతినిధి’తో ఆమె సంభాషించారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
భారత దేశం పట్ల మీకున్న ఆసక్తి ఏమిటి?
భారత దేశానికి, కొరియాకు ప్రాచీన కాలం నుంచి సంబంధాలు ఉన్నాయి. క్రీస్తుశకం 48లో అయోధ్య రాణి సురిరత్న కొరియా వెళ్ళారు. కొరియాకు దక్షిణాన ఉన్న గెంగ్వాన్ గయ రాజు సురోను వివాహం చేసుకున్నారు. తన పేరును ‘హియో వాంగ్ ఓకె’గా మార్చుకున్నారు. దక్షిణ కొరియాలోని గింగ్హాయిలో ఆమె సమాధి, మందిరాల నిర్మాణం జరిగింది. 2001లో అయోధ్యలో ఆమె స్మారక చిహ్నంగా ఉద్యానవనాన్ని, శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. ఆమె స్మృతి చిహ్నంగా భారత ప్రభుత్వం తపాలా బిళ్లను కూడా విడుదల చేసింది. ఈ విధంగా భారత దేశంలో దక్షిణ కొరియా స్మృతి శాశ్వతంగా ఉంది. దక్షిణా కొరియాలోనూ భారత స్మృతిని శాశ్వతం చేసేందుకు... అదే గింగ్హాయిలో భవ్యమైన రామమందిరాన్ని నిర్మించాలని నేను కంకణం కట్టుకున్నాను. కొరియాకు, భారత దేశానికి మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను వివరిస్తూ... రాజ్యసభ టీవీ కోసం ఏడు ఎపిసోడ్ల డాక్యుమెంటరీని రూపొందించాను.
కొరియాలో రామమందిరం నిర్మించాలన్న మీ ప్రతిపాదన సాకారమవుతుందా?
- నేను కొరియా అధ్యక్షుడితోనే కాదు, మా విదేశాంగ మంత్రిత్వ శాఖనూ సంప్రతించాను. గింగ్హాయి మేయర్‌తో చర్చించాను. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లేఖ రాశాను. ఇప్పటివరకూ మంచి ప్రతిస్పందనే లభించింది. త్వరలో నా కలనెరవేరుతుందనే నమ్మకం నాకుంది. అయోధ్య, గింగ్హాయి నగరాలను సోదర నగరాలుగా ప్రకటించాలని 38 మంది సభ్యుల కొరియన్ ప్రతినిధి వర్గం చేసిన అభ్యర్థనను మోదీ ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పుడు భారత్-కొరియా మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి యాభై సంవత్సరాలైన సందర్భంగా... వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. అలాగే జీ-20 సమావేశాలకు భారత దేశం అధ్యక్షత వహిస్తోంది. ఈ నేపథ్యంలో రామమందిర నిర్మాణానికి ఇరు దేశాలూ అంగీకరించే అవకాశాలున్నాయి.
భారత దేశం పట్ల మీకున్న అభిప్రాయమేమిటి?
భారత్ ఆధ్యాత్మికంగా బలోపేతమైన దేశం. ఇది ఒక దేశం మాత్రమే కాదు, 28 వేర్వేరు రాష్ట్రాలు ఉన్న దేశం. అయినప్పటికీ చెక్కుచెదరకుండా, సమైక్యంగా ఉన్న ఈ దేశం గురించి ప్రపంచంలో అందరూ తెలుసుకోవాలన్నది నా అభిప్రాయం. విశాలమైన భారత దేశం అత్యంత వైవిధ్య భరితం. ఇక్కడ ఎవరూ ఊహించలేనంత పెద్ద మార్కెట్ ఉంది. ప్రపంచానికి ఇంకా ఆవిషయం పూర్తిగా తెలీదు. నేను ఢిల్లీకి పలుసార్లు రావడం వల్ల ఇప్పుడు హిందీ మాట్లాడగలుగుతున్నాను. కాని రాష్ట్రాలకు వెళ్లినపుఁడు వారు వేర్వేరు భాషలు మాట్లాడడం చూసి దిగ్భ్రమ చెందాను. భారత్ ఎంత వైవిధ్యంతో కూడుకున్న దేశమో, భాషా సంస్కృతులు ఇక్కడి ప్రజల జీవితంలో ఎంతగా పెనవేసుకున్నాయో నాకు అర్థమయింది.
మీరు దక్షిణాదికి కూడా వెళ్లారా?
ఉత్తరాది కంటే దక్షిణాది ఎంతో భిన్నమైనదని నాకు ఢిల్లీ మిత్రులు చెప్పారు. అందుకే ఇటీవల హైదరాబాద్‌లో పర్యటించాను. హైదరాబాద్ ఎంతో ఆధునికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన నగరంగా అనిపించింది. ఉత్తర అమెరికాలో, ఫ్లోరిడాలో ఉన్న అనుభూతి కలిగింది. బెంగళూరు విమానాశ్రయం చూస్తే నాకు శాన్‌జో్‌సలో ఉన్నానేమో అనిపించింది.
హైదరాబాద్‌లో ఏం చూశారు?
హైదరాబాద్‌లో కొరియన్ రిపబ్లిక్ కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని సందర్శించడంతో పాటు శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో ఉన్న చిన జీయర్ స్వామి మఠానికి వెళ్లాను, అక్కడ మందిరాలను, అత్యంత భారీగా నిర్మించిన రామానుజుడి విగ్రహాన్ని తిలకించి ముగ్ధురాలినయ్యాను. రామానుజుడి తాత్త్విక బోధల గురించి తెలుసుకున్నప్పుడు.. ఆ కాలంలో ఆయన ఎంత దార్శనికతతో ఆలోచించారో అర్థమై.. విస్మయం కలిగింది.
బౌద్ధ మతం భారత్ నుంచే కొరియాకు ప్రయాణించింది. భారత్-కొరియాల మధ్య వ్యాపార సంబంధాలు మాత్రమే కాదు, సాంస్కృతిక సంబంధాలు కూడా మెరుగుపడాలి. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం లాంటి మందిరాన్ని కొరియాలో కూడా నిర్మిస్తే.. ఇరు దేశాలప్రజల మధ్య సంబంధాలు మరింత పటిష్టం అవుతాయి. దాని కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నాను.
-ఎ. కృష్ణారావు