పాటల్లేవ్.. ఫైటుల్లేవ్..!
ABN , First Publish Date - 2023-01-28T23:44:24+05:30 IST
పవన్ కల్యాణ్ సినిమా అంటే అభిమానులకు పండగే. పాటలు, ఫైట్లు, పంచ్ డైలాగులు, సున్నితమైన కామెడీ.. ఇలా అన్ని రకాల దినుసులూ ఉంటాయి. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా..

పవన్ కల్యాణ్ సినిమా అంటే అభిమానులకు పండగే. పాటలు, ఫైట్లు, పంచ్ డైలాగులు, సున్నితమైన కామెడీ.. ఇలా అన్ని రకాల దినుసులూ ఉంటాయి. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా.. ఏదో వెలితిగానే ఉంటుంది. అయితే పవన్ కొత్త సినిమాలో పాటలు, ఫైట్లూ ఉండవన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ - సుజిత్ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. సోమవారం ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఇదో గ్యాంగ్ స్టర్‌కి సంబంధించిన కథ. పవన్ కల్యాణ్‌ని సుజిత్ ఓ గ్యాంగ్‌స్టర్‌గా చూపించబోతున్నాడు. ఇది వరకు ఈ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. వాటికి భిన్నంగా ఈ సినిమాలో పవన్ క్యారెక్టర్ ఉంటుందని టాక్. లవ్, రొమాన్స్, పాటలూ ఇవేం తెరపై కనిపించవట. పవన్ స్ర్కీన్ టైమ్ మొత్తం కలిపి గంటలోపే అని తెలుస్తోంది. ఫైట్లు ఉండవు కానీ.. స్టైలీష్ యాక్షన్ తెరపై కనిపిస్తుందట. గన్నులతో ఆడుకోవడం అంటే పవన్‌కి భలే సరదా. ఈ సినిమాలో వెరైటీ గన్నులు వాడబోతున్నారని, వాటితోనే యాక్షన్ అంతా ఉంటుందని తెలుస్తోంది. పాటలు లేకుండా పవర్ స్టార్ సినిమా అంటే సాహసమే. కాకపోతే.. కథపై నమ్మకంతో, ఈ క్యారెక్టర్ బాగా నచ్చడంతో పవన్ ‘ఓకే’ అనేశారట. మరి పవన్‌ని సుజిత్ ఎలా చూపిస్తాడా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.