Renuka Bodla: ఆ మూలాలు మనలోనూ ఉన్నాయి

ABN , First Publish Date - 2023-07-24T03:08:57+05:30 IST

‘ఒక వ్యాపారం పెట్టగానే సరిపోదు. దాని ద్వారా మనం ఇవ్వబోయే ఉత్పత్తి మార్కెట్‌లో చెల్లుబాటు అవుతుందా లేదా అన్నది కూడా ఒక అంచనా ఉండాలి’ అంటారు రేణుక బొడ్ల. ఐటీ కొలువుతో మొదలుపెట్టి... పారిశ్రామివేత్తగా ఎదిగిన ఆమె ప్రయాణంలో ఎన్నో సవాళ్లు. ‘సిల్వర్‌ నీడిల్‌ వెంచర్‌’ ద్వారా అంకుర సంస్థల్లో పెట్టుబడులు పెట్టి... ఔత్సాహికులను పారిశ్రామిక రంగం వైపు ఆకర్షిస్తున్న రేణుక... తన అనుభవాలను ‘నవ్య’తో పంచుకున్నారు.

Renuka Bodla: ఆ మూలాలు మనలోనూ ఉన్నాయి

‘ఒక వ్యాపారం పెట్టగానే సరిపోదు. దాని ద్వారా మనం ఇవ్వబోయే ఉత్పత్తి మార్కెట్‌లో చెల్లుబాటు అవుతుందా లేదా అన్నది కూడా ఒక అంచనా ఉండాలి’ అంటారు రేణుక బొడ్ల. ఐటీ కొలువుతో మొదలుపెట్టి... పారిశ్రామివేత్తగా ఎదిగిన ఆమె ప్రయాణంలో ఎన్నో సవాళ్లు. ‘సిల్వర్‌ నీడిల్‌ వెంచర్‌’ ద్వారా అంకుర సంస్థల్లో పెట్టుబడులు పెట్టి... ఔత్సాహికులను పారిశ్రామిక రంగం వైపు ఆకర్షిస్తున్న రేణుక... తన అనుభవాలను ‘నవ్య’తో పంచుకున్నారు.

‘‘మొదటి నుంచి నాకొక కోరిక... వ్యాపార రంగంలోకి రావాలనుకొనే యువతకు ప్రేరణ ఇవ్వాలని. ఆ అవకాశం నాకు ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌లో లభించింది. ప్రస్తుతం నేను అక్కడి ‘సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఎంట్రప్రెన్యూర్‌షి్‌ప’లో ‘మెంటార్‌ ఇన్‌ రెసెడెన్స్‌’గా ఉన్నాను. స్టార్ట్‌ప్సకు సంబంధించి విద్యార్థులకు మార్గదర్శనం చేసి, అవగాహన కల్పిస్తుంటాను. వారి ఆలోచన నచ్చితే ఆర్థిక సహకారం కూడా అందిస్తుంటాను. దాని కోసం ‘ట్రిపుల్‌ ఐటీ టెక్‌ ఫండ్‌’ ఒకటి పెట్టాను. అంటే విద్యార్థి దశలో ఫండింగ్‌ చేయడం. అక్కడ మంచి ఫలితాలు వచ్చాయి. ఆ ఉత్సాహంతో గత ఏడాది మేం కొంతమంది కలిసి ‘సిల్వర్‌ నీడిల్‌ వెంచర్‌’ (ఎస్‌ఎన్‌వీ) ప్రారంభించాం. ఇది స్టార్టప్‌ ఫండింగ్‌ కంపెనీ. అంకుర సంస్థల్లో వంద కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో దీన్ని నెలకొల్పం. అయితే కొంచెం అడ్వాన్స్‌డ్‌ స్టేజీలో ఉన్న స్టార్ట్‌ప్సకు ఫండింగ్‌ చేస్తున్నాం.

అంటే బీ2బీ సాస్‌, డీప్‌టెక్‌, స్పేస్‌టెక్‌, ఏఐ, ఇ-కామర్స్‌, కన్జూమర్‌ ఇంటర్నెట్‌ తదితర టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నాం. ఏదైనా బిజినెస్‌ వినూత్నంగా, ఒక పదింతలు, వంద శాతం అభివృద్ధి కనిపించేలాంటి సృజనాత్మక ఆలోచనలతో వచ్చినవారిని ప్రోత్సహిస్తాం. ఫండింగే ఒక్కటే కాదు... మెంటార్‌షిప్‌ కూడా అందిస్తున్నాం. ఎందుకంటే మా ‘సిల్వర్‌నీడిల్‌ వెంచర్‌’లో ఉన్నవారంతా ఐటీ రంగం నుంచి వచ్చినవారే. వేరే ఫండ్స్‌లో కూడా కలిసి పని చేశాం. మాది సెబీ అప్రూవ్‌డ్‌ ఫండ్‌. పారదర్శకంగా ఉంటుంది. ఇందులో రిస్క్‌ ఉంటుంది. అలాగే రివార్డూ ఉంటుంది. మా ద్వారా ఇన్వెస్టర్లకు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఒక వేదిక కల్పిస్తున్నాం. మాది వంద కోట్ల ఫండ్‌. స్టార్ట్‌ప్సకే ఎందుకు సహకారం అందిస్తున్నామంటే... దానివల్ల యువ పారిశ్రామికవేత్తలు పుట్టుకువస్తారు. వాళ్లు అభివృద్ధి చెందుతారు. స్వశక్తితో ఎదగగలుగుతారు. మరో పది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ఇక మెంటార్‌షిప్‌ అనేది స్వచ్ఛందంగా చేస్తున్నా. సమాజానికి ఎంతో కొంత తిరిగివ్వాలి కదా. అందుకు నా చిరు ప్రయత్నం ఇది.

సిలికాన్‌ వ్యాలీలో మొదలై...

నేను ఆరేడేళ్ల నుంచి ఫండింగ్‌లో ఉన్నాను. అంతకుముందు ఐటీ కంపెనీల్లో పలు హోదాల్లో పని చేశాను. అమెరికా సిలికాన్‌ వ్యాలీలో నా ప్రయాణం మొదలైంది. మాది వరంగల్‌. స్కూలు, కాలేజీ అక్కడే. ఫార్మసీ చదివాను. ఫస్ట్‌ ఇయర్‌లో మాకు కంప్యూటర్‌ కోర్సు ఉండేది. అది బాగా నచ్చి, అదే సమయంలో కంప్యూటర్స్‌ అప్లికేషన్స్‌లో డిప్లమో చేశాను. 1996లో నా డిగ్రీ, డిప్లమో రెండూ ఒకేసారి పూర్తయ్యాయి. ఆ వెంటనే నాకు పెళ్లయింది. ఆయన పేరు ప్రకాష్‌. మావారితో అమెరికా వెళ్లాను. నాకు సాఫ్ట్‌వేర్‌ రంగంపై ఆసక్తి. అందుకే అక్కడకు వెళ్లాక ఉద్యోగానికి కావాల్సిన కోర్సులు చేశాను. సిలికాన్‌ వ్యాలీలో వెబ్‌ డిజైనర్‌, వెబ్‌ డెవలపర్‌గా ఆరంభమైంది నా ఉద్యోగ జీవితం. అది కూడా ఒక స్టార్ట్‌పలోనే. ఇక్కడ చదివిన కంప్యూటర్స్‌ కోర్సు అక్కడ నాకు బాగా ఉపయోగపడింది. పని చేస్తూనే యూనివర్సిటీ ఆఫ్‌ ఫీనిక్స్‌లో కంప్యూటర్స్‌ ఇన్‌ఫర్మేషన్స్‌లో పార్ట్‌ టైమ్‌ చదివి, మాస్టర్ట్‌ పూర్తి చేశాను. తరువాత ఎంబీయే కూడా పూర్తయింది. మావారి మార్గదర్శనం, మద్దతు లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదు. ఆయన ప్రస్తుతం ఇక్కడి ‘కెరీర్‌ కార్పొరేషన్‌’కు ఆర్‌ అండ్‌ డీ హెడ్‌.

భారత్‌కు తిరిగి వచ్చాక...

2015కు ముందు నేను మొత్తం ఐటీ కంపెనీల్లోనే పని చేసేదాన్ని. విద్యార్హతలతో పాటు క్రమంగా వృత్తి నైపుణ్యం కూడా పెంచుకొంటూ వెళ్లాను. ఒరకిల్‌, సిస్కో సిస్టమ్స్‌, జీఈ తదితర ఎంఎన్‌సీల్లో పలు హోదాల్లో, ఇతర దేశాల్లో పని చేశాను. పదేళ్ల తరువాత నేను, మావారు భారత్‌కు తిరిగి వచ్చేశాం. ఇక్కడకు వచ్చాక నేను జనరల్‌ ఎలక్ట్రికల్స్‌లో ఎనిమిదేళ్లు చేశాను. ఏడాది కిందటి వరకు ‘నోవార్టిస్‌ బయోమ్‌ ఇండియా’కు ఇన్నోవేషన్‌ హెడ్‌గా ఉన్నాను. అది ఫార్మా కంపెనీ. అలా నా ఫార్మా నేపథ్యం కూడా కలిసొచ్చింది. అమెరికా నుంచి తిరిగి రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి... మా తల్లితండ్రులకు దగ్గరలో ఉండాలని. రెండోది భారత్‌లో చాలా అవకాశాలు ఉన్నాయి.

ఉన్నత హోదా వదులుకుని...

నేను ఎంబీయే చదువుతున్న సమయంలోనే ప్రధాని మోదీ ‘స్టార్టప్‌ ఇండియా’ ఆవిష్కరించారు. అదే సమయంలో హైదరాబాద్‌లో ‘టీ-హబ్‌’ కూడా మొదలైంది. అప్పుడు నాకు అనిపించింది... ‘ఉద్యోగం అయితే చేస్తున్నాను... బానే ఉంది. కానీ స్టార్ట్‌ప్సలో అయితే నచ్చిన రంగంలో పని చేయడానికి ఆస్కారం ఎక్కువ. ఉద్యోగ కల్పన జరుగుతుంది కదా’ అనే ఆలోచన. ఉన్నత హోదా, మంచి జీతం వదిలేసి కొత్తగా ప్రయత్నించాలంటే రిస్కే. కానీ అప్పుడు కాకపోతే ఇక ముందు చేయలేం అనిపించింది. అదీకాక నాకు ఇద్దరు పిల్లలు. స్టార్టప్‌ అయితే వాళ్లను చూసుకొనే సమయం కూడా దొరుకుతుంది కదా అని. ధైర్యం చేసి అడుగు ముందుకు వేశాను. ఉద్యోగం వదిలేసి బిజినె్‌సలోకి దిగాను.

మహిళలు నిలదొక్కుకోవాలంటే...

పారిశ్రామిక రంగంలో మహిళలు నిలదొక్కుకోవాలంటే ప్రధానంగా కావల్సింది ఆసక్తి, స్వయం ప్రేరణ. ఇంకో విషయం ఏంటంటే... మనం సాధికారత అంటుంటాం. నా దృష్టిలో అది ఎవరో మనకు ఇచ్చేది కాదు. ఆ ఎంపవర్‌మెంట్‌ రిమోట్‌ ఎవరి వద్దనో కాదు... మన దగ్గరే ఉండాలి. వెనకటికి మన అమ్మమ్మలు, నానమ్మలను చూస్తే వాళ్లు ఇంట్లో ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వర్తించేవారు. ఆ మూలాలు కచ్చితంగా మనలోనూ ఉంటాయి. ఆ స్ఫూర్తితో ‘మనం కూడా చేయగలం’ అనే ఆత్మవిశ్వాసం కావాలి. అలాగే ఒకేసారి పెద్దఎత్తున కాకుండా చిన్న చిన్నగా మొదలుపెట్టాలి. దాన్ని ఎలా అభివృద్ధిపరచాలన్నది ఆలోచించాలి. కొద్దిపాటి... అంటే ఒకవేళ నష్టం వచ్చినా నెట్టుకురాగల స్తోమత మేరకు రిస్క్‌ తీసుకోవాలి. అప్పుడే మనపై మనకు నమ్మకం కలుగుతుంది. తరువాత వ్యాపారంలో నిలదొక్కుకోవాలంటే ‘లెర్నింగ్‌’ చాలా ముఖ్యం. ప్రతి రోజూ... ప్రతిచోటా ఒడుదొడుకులు ఉంటాయి. వచ్చిన అవకాశాలు వినియోగించుకొంటూ... సవాళ్లను ఎదుర్కొంటూ... వాటి నుంచి పాఠాలు నేర్చుకొంటూ ముందుకు వెళ్లాలి. అలాగే మనకు ఒక సహకరించే వ్యవస్థ (సపోర్టింగ్‌ సిస్టమ్‌) ఉండాలి. లేకపోతే దాన్ని మనమే నిర్మించుకోగలగాలి. ఆ విషయంలో నేను అదృష్టవంతురాలిని. నాకు మావారి మద్దతు, మంచి మెంటార్స్‌ ప్రభావం ఎంతో ఉంది. రోజూ భగవద్గీత, భాగవతం వింటుంటాను. వాటిల్లో జీవితానికి ఉపయోగపడే అద్భుతమైన విషయ జ్ఞానం ఉంది. మంచి గురువులు దొరికారు. ఇవన్నీ నేను భావోద్వేగపరంగా, మానసికంగా దృఢంగా ఉండడానికి ఉపయోగపడతాయి.

నచ్చింది... మార్కెట్‌ ఉన్నది...

ఏదైనా వ్యాపారం మొదలుపెడదామని అనుకున్నప్పుడు ఏది పడితే అది ఎంచుకోకూడదు. మనం ఇవ్వబోయే ఉత్పత్తిని కొనేవాళ్లు కూడా కావాలి కదా. లేకపోతే మన ప్రయత్నం వృథా అవుతుంది. అంటే మనకు నచ్చినవాటిల్లో దేనికైతే మార్కెట్‌లో కొనుగోలు శక్తి ఉంటుందో ముందుగానే అంచనా వేసుకొని అందులో పెట్టుబడి పెట్టాలి. అప్పుడే ఏ వ్యాపారమైనా నిలబడుతుంది. ఏదైనా ఒక్క రోజులో అవ్వదు. నాకైతే కాస్త సమయం పట్టింది. ఎందుకంటే నాకు ఇద్దరు పిల్లలు. వాళ్ల ఆలనా పాలన కోసం రెండుసార్లు బ్రేక్‌ తీసుకున్నా. భవిష్యత్తులో మరింత భారీ ఫండింగ్‌తో అడ్వాన్స్‌డ్‌ స్టార్ట్‌ప్సను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నా.

‘నేను సూపర్‌ ఉమన్‌’...

ప్రస్తుతం నేను ‘ఆహా’ ఓటీటీ వారి ‘నేను సూపర్‌ ఉమన్‌’ షోలో ‘ఏంజిల్‌’గా వ్యవహరిస్తున్నా. ఈ షోకు యువతులే కాకుండా నడి వయస్కులు కూడా విభిన్న ఆలోచనలతో వస్తున్నారు. ఇది నాకు ఎంతో సంతోషం కలిగిస్తోంది. వారిని చూశాక నాలో కొత్త ఉత్సాహం కలిగింది. వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే. బిజినెస్‌ చేయాలనుకొనే మహిళలకు మెంటార్‌షిప్‌, అవసరమైతే ఆర్థిక మద్దతు ఇచ్చి ప్రోత్సహించాలనేది ఈ షో ప్రధాన ఉద్దేశం. అది నచ్చే ఇందులో పాల్గొనడానికి ఒప్పుకున్నాను. ఆసక్తి ఉంటే ‘ఏంజిల్స్‌’ పెట్టుబడి పెడతారు. మెంటార్‌షిప్‌ చేస్తారు. ఇదే కాకుండా నేను బిట్స్‌ హైదరాబాద్‌, ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ టెక్నాలజీ తదితర చాలా కాలేజీలకు జ్యూరీగా, మెంటార్‌గా వెళుతుంటాను. పలు ఐఐటీల్లో కూడా కొవిడ్‌ సమయంలో మెంటార్‌షిప్‌ చేశాను. కాలేజీ క్యాంప్‌సల్లో జరిగే స్టార్టప్‌ ఈవెంట్స్‌కు తప్పకుండా వెళతా. మద్దతునిస్తా.’’

సవాళ్లు సాధారణం...

జీవితంలోనే కాదు... వ్యాపారంలోనూ సవాళ్లు, సమస్యలనేవి సాధారణం. ఉద్యోగంలో ఇలా చేయాలని చెబుతారు... చేస్తాం. కానీ బిజినె్‌సలో అలా కాదు. మనం చేయబోయేది విజయవంతం అవుతుందా లేదా అన్నది ముందే తెలుసుకోవాలి. దాని కోసం పరిశోధన చేయాలి. మనం బలమేంటో మనం తెలుసుకోగలగాలి. నేను నేర్చుక్ను పెద్ద పాఠం ఏంటంటే... మొదట్లో నాకు నచ్చిందని ఒక బిజినెస్‌ ప్రారంభించాను. దానికి వినియోగదారులు ఉన్నారా లేదా అని ఆలోచించలేదు. తీరా మొదలెట్టాక దానికి మార్కెట్టే లేదు. విఫలమయ్యాను. ఆ తప్పు ఎవరూ చేయకూడదని మెంటార్‌షిప్‌ ఇస్తున్నాను. అలాగే మంచి నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. వాటివల్ల మనకు సంబంధిత సమాచారం ఎప్పటికప్పుడు అందుతుంటుంది. నిపుణులు, మార్గదర్శకులను కలుస్తుంటాం. ఇవన్నీ మనకు ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి దోహదపడతాయి.

-హనుమా

Updated Date - 2023-07-24T03:08:57+05:30 IST