AP Bhavan Issue : ఏపీ భవన్ వివాదం ఇప్పట్లో కొలిక్కి రాదా.. కావాల్సిందే అంటున్న కేసీఆర్.. ఆలోచనలో పడిన వైఎస్ జగన్.. ఏకాభిప్రాయం కుదిరేనా..!
ABN , First Publish Date - 2023-04-27T23:24:37+05:30 IST
ఒకటా రెండా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) విభజన జరిగి తొమ్మిదేళ్లయ్యింది.. ఇంతవరకూ తెలుగు రాష్ట్రాల (Telugu States) మధ్య ఒక్కటంటే ఒక్కటీ పక్కాగా విభజన జరగనేలేదు...
ఒకటా రెండా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) విభజన జరిగి తొమ్మిదేళ్లయ్యింది.. ఇంతవరకూ తెలుగు రాష్ట్రాల (Telugu States) మధ్య ఒక్కటంటే ఒక్కటీ పక్కాగా విభజన జరగనేలేదు. ఇటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో (Hyderabad).. అటు దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) భవనాల విషయంలో ఇప్పటికీ అన్నీ పెండింగ్‌లోనే ఉండిపోయాయి. వైసీపీ (YSR Congress) అధికారంలోకి వచ్చాక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్-వైఎస్ జగన్ (KCR-YS Jagan) కూర్చొని కొన్ని విషయాల్లో ఏకాభిప్రాయాలు రావడంతో కొలిక్కి వచ్చాయి. ఇవన్నీ పక్కనెడితే.. ఢిల్లీలోని ఏపీ భవన్ (AP Bhavan) వ్యవహారం మాత్రం విభజన జరిగినప్పట్నుంచీ ఇప్పటి వరకూ కొలిక్కి రాలేదు..? అసలు తొమ్మిదేళ్లుగా ఎందుకు లెక్క తేలట్లేదు..? ఈ భవన్ విషయంలో ఏపీ ఏమంటోంది..? తెలంగాణ ఏమంటోంది..? ఇంతకీ కేంద్రం ఏమంటోంది..? అనే విషయాలపై ప్రత్యేక కథనం..
అసలేంటీ కథ..
ఢిల్లీలో తెలుగువారికి చిరునామాగా ఉండేది ఒకే ఒక్క ఏపీ భవన్ మాత్రమే. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజాప్రతినిధులు ఎప్పుడు హస్తిన వెళ్లినా ఇక్కడే విడిది చేస్తుంటారు. ఇక్కడ్నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు అధికారిక కార్యకలాపాలన్ని సాగిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత ఆస్తుల పంపకాల్లో కొలిక్కి రాని వాటిలో ఏపీ భవన్ కూడా ఒకటి. విభజన విషయమై పలుమార్లు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో కేంద్రం చర్చలు జరిగినప్పటికీ కొలిక్కి రాలేదు. విభజన కీలక దశకు చేరుకుందనే విషయాలన్నీ వార్తల్లో చూస్తున్నామే కానీ ఇన్నేళ్లుగా పంచాయితీ మాత్రం తెగలేదు. దాదాపు ఏడు వేల కోట్ల రుపాయల విలువ చేసే 20 ఎకరాల భూములు మాకు కావాలని ఏపీ.. కాదు కాదు మాకే కావాలని తెలంగాణ ప్రభుత్వాలు పట్టుబట్టుకుని కూర్చున్నాయి. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలు జరిపిన ప్రతిసారీ కొత్త ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. దీంతో విభజన మరింత ఆలస్యమవుతోంది. రాష్ట్ర విభజన సమయంలోనే ఉమ్మడి ఆస్తులను ఏపీ, తెలంగాణకు 52:48 నిష్పత్తిలో పంచారు. ఢిల్లీ అశోకా రోడ్డుతో పాటు మాధవరావు సింథియా మార్గ్‌లో కలిపి రెండు రాష్ట్రాలకు 19.733 ఎకరాల భూమి ఉంది. ఇందులో ఏపీ వాటా 4.3885 ఎకరాలుగా కేంద్రం నిర్ణయించింది. దీని విలువ రూ.1,703.6 కోట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక తెలంగాణ విషయానికొస్తే.. 4.3375 ఎకరాల వాటా ఉంది. దీని విలువ రూ.1,694.4 కోట్లుగా ఉంది. ఇలా 0.511 ఎకరాల రోడ్డులో రెండు రాష్ట్రాలకు చెరో 0.2555 ఎకరాల వాటా లభిస్తుంది. దీని విలువ రూ.160 కోట్లు ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి గోదావరి బ్లాక్ 4.082 ఎకరా భూమి దాని విలువ రూ.1,614.40 కోట్లు కాగా.. రూ.1,318 కోట్లు విలువ చేసే నర్సింగ్ హాస్టల్ 3.367 ఎకరాల భూమి ఉన్నాయి.
ఎవరేమంటున్నారు..!?
- వాస్తవానికి ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ఢిల్లీలో రెండు రాష్ట్రాల ఉమ్మడి స్థిరాస్తులను కేంద్రం దాదాపు పంచిపెట్టేసింది. అయితే ఏపీ భవన్ విషయం ఇరువురి ప్రతిపాదనలతోనే సమయం సరిపోతోంది. ఏపీ భవన్ ఎలాగైనా సరే దక్కించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం (TS Govt) చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. ఎందుకంటే.. ఈ భవన్‌తో తెలంగాణ ప్రజలకు భావోద్వేగ సంబంధాలున్నాయి. కాబట్టి వదులుకునేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేదు. ఇందుకోసం తమకు వదిలేస్తే.. దానికి బదులుగా పటౌడీ హౌస్‌లో తమకున్న ఏడెకరాలకు పైగా స్థలాన్ని తీసుకుని అక్కడ కొత్త భవనాన్ని నిర్మించుకోవాలని ఏపీ అధికారులను తెలంగాణ ప్రభుత్వం పదేపదే కోరుతోంది. నిజాం నిర్మించిన హైదరాబాద్ హౌస్‌కు అనుకొని ఉన్న స్థలంతో రాష్ట్ర ప్రజలకు భావోద్వేగ సంబంధాలున్నాయని తెలంగాణ సర్కార్ చెబుతోంది.
- అశోకా రోడ్డు కూడలిలో ఉన్న శబరి బ్లాక్‌లో ప్రస్తుతం ఏపీ భవన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో శబరి బ్లాక్ గవర్నర్ విడిది కేంద్రంగా ఉండేది. దీంతో పాటు సీనియర్ రాజకీయ నాయకులు ఇందులోనే బస చేసేవారు. శబరి, గోదావరి బ్లాక్‌ల మధ్య రోడ్డు ఉంది. శబరి బ్లాక్ సైతం తెలంగాణకే కావాలని అధికారులు కోరుతున్నారు. దీనికి ఏపీ అంగీకరిస్తే మాత్రం కీలకమైన కూడలిలో ఏపీ అస్తిత్వం,చరిత్ర కనుమరుగు అవుతుందనే వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఇప్పటికే హైదరాబాద్‌లో పంచుకోవాల్సిన వాటి విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం అప్పన్నంగా అన్నీ కట్టబెట్టేసిందనే ఆరోపణలు వచ్చాయి. అందుకే ఈసారి మళ్లీ నిందలు రాకుండా చూసుకునేందుకు ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. దీంతో పాటు పునర్విభజన చట్టంలోని షెడ్యూల్- 9లో పొందుపరిచిన 91 ఇన్‌స్టిట్యూషన్స్, షెడ్యూల్- 10 కింద చేర్చిన 142 ఇతర సంస్థల్లో అధిక భాగం హైదరాబాద్‌లోనే ఉన్నాయని, వాటిని కూడా విభజించాలంటూ ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది.
- ఇవన్నీ ఒక ఎత్తయితే.. 58:42 నిష్పత్తిలో ఏపీకి దక్కాల్సిన భూమికి మార్కెట్ ధర ప్రకారం ధర చెల్లించేందుకు సిద్ధంగా ఉందని తెలంగాణ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ప్రతిపాదనకు ఏపీ అధికారుల నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. సీఎం జగన్ మోహన్ రెడ్డితో (CM YS Jagan Mohan Reddy) చర్చించాక ఏ నిర్ణయమైనా తీసుకుంటామని ఇటీవల కేంద్ర హోంశాఖ (Ministry of Home Affairs ) జరిపిన చర్చల్లో ఏపీ అధికారులు తెలిపారు. దీంతో సమావేశం ప్రారంభమైన అరగంట వ్యవధిలోనే పూర్తయ్యింది. కీలకంగా చర్చించిన తర్వాత వచ్చేవారం మరోసారి సమావేశం కావాలని కేంద్రం హోం శాఖ ఆదేశించగా.. ఇరు రాష్ట్రాల అధికారులు అంగీకారం తెలిపారు. వచ్చేవారం ఏపీ భవన్ వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది.
మొత్తానికి చూస్తే.. ఏపీ భవన్ విషయంలో ఇరు ప్రభుత్వాలు మాకంటే మాకు కావాల్సిందేనని గట్టిగానే పట్టుబట్టాయి. తెలంగాణ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఏపీ భవన్‌ను దక్కించుకోవాల్సిందేనని విశ్వప్రయత్నాలే చేస్తుండగా.. జగన్ మాత్రం ఆలోచనలో పడ్డారట. మరి ఫైనల్‌గా జగన్ ఏం నిర్ణయం తీసుకుంటారనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తొమ్మిదేళ్లుగా నడుస్తూనే ఉన్న ఈ విభజన వ్యవహారం వచ్చేవారంతో అయినా కొలిక్కి వస్తుందో లేకుంటే.. మళ్లీ వాయిదాలకే పరిమితం అవుతుందో వేచి చూడాల్సిందే మరి.