Karnataka next CM: సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇళ్ల వెలుపల ఊహించని పోస్టర్లు.. మల్లికార్జున్ నివాసానికి సిద్దూ..

ABN , First Publish Date - 2023-05-14T12:19:11+05:30 IST

సీఎం పదవి విషయంలో కర్ణాటక కాంగ్రెస్‌లో అంతర్గత యుద్ధం మొదలైనట్టు కనిపిస్తోంది.

Karnataka next CM: సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇళ్ల వెలుపల ఊహించని పోస్టర్లు.. మల్లికార్జున్ నివాసానికి సిద్దూ..

కర్ణాటక ఎన్నికల్లో (Karnataka result) ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. బీజేపీని (BJP) తిరస్కరించి... ఏకంగా 136 సీట్లతో కాంగ్రెస్‌కు (Congress) అధికారాన్ని కట్టబెట్టారు. దీంతో బీజేపీపై కాంగ్రెస్ యుద్ధం ముగిసినా... సీఎం పదవి విషయంలో పార్టీలో అంతర్గత యుద్ధం మొదలైనట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. సీఎం ఎంపికకు అత్యంత కీలకమైన సీఎల్పీ భేటీ ఈ రోజు సాయంత్రమే జరగనుంది. అయితే అంతకంటే ముందు సీఎం రేసులో ఉన్న కాంగ్రెస్ కురువృద్ధుడు సిద్ధరామయ్య, ఐదేళ్లపాటు పార్టీని భుజస్కంధాలపై మోసిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తమతమ ప్రయత్నాలను మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది.

బెంగళూరులోని సిద్ధరామయ్య నివాసం వెలుపల ఆయన మద్ధతుదారులు రాత్రికి రాత్రే ఆసక్తికరమైన పోస్టర్లు పెట్టారు. ‘కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య’ అని పేర్కొంటూ కటౌట్లు పెట్టారు. డీకే శివకుమార్ మద్ధతుదారులు కూడా ఆయన ఇంటి ముందు ఇదే తరహా పోస్టర్లు పెట్టారు. డీకే శివకుమార్‌ను రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ పోస్టర్లు ఇప్పుడు కర్ణాటకలో కలకలం రేపుతున్నాయి. పార్టీ సీఎల్పీ భేటీకి ముందే ఇలాంటి బ్యానర్లు దర్శనమివ్వడంతో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పార్టీలో అంతర్గత యుద్ధం మొదలైనట్టుగా విశ్లేషిస్తున్నారు.

మల్లికార్జున్ ఖర్గే ఇంటికి సిద్ధరామయ్య...

సీఎం రేసులో ఉన్న సిద్ధరామయ్య ఆదివారం ఉదయం బెంగళూరులోని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసానికి వెళ్లారు. పుష్పగుచ్చంతో వెళ్లారు. అంతకుముందు తన నివాసానికి వచ్చిన పార్టీ శ్రేణులు, మద్ధతుదారులతో ఆయన ముచ్చటించారు. పార్టీ కేడర్‌ను పలకరించిన అనంతరం బయలుదేరి ఖర్గే నివాసానికి వెళ్లారు. మరోవైపు ఆదివారం ఉదయం డీకే శివకుమార్ అత్యంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎంపిక విషయంలో ఎలాంటి ఉత్కంఠ అవసరంలేదని కొట్టిపారేశారు. కష్టానికి ఫలితం దక్కుతుందని వ్యాఖ్యానించారు. ఐదేళ్లపాటు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా విశేష సేవలు అందించిన ఆయన సీఎం పదవిని ఆశిస్తున్నట్టు ఈ వ్యాఖ్యలను బట్టి మరింత స్పష్టమవుతోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఈ రోజు సాయంత్రమే కీలక భేటీ..

కాగా... ప్రతి ఒక్కరి మదినీ వేధిస్తున్న మిలియన్‌ డాలర్ల ప్రశ్న.. కర్ణాటక తదుపరి సీఎం ఎవరు!? ఐదేళ్లూ పార్టీని తన భుజస్కంధాలపై మోసి.. అనేక కష్టనష్టాలను అనుభవించిన డీకే శివకుమార్‌కు కాంగ్రెస్‌ అధిష్ఠానం ఓకే చెబుతుందా!? లేక, రాజకీయ కురువృద్ధుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు జైకొడుతుందా!? అనే అంశంపై సందిగ్ధం నెలకొంది. కాంగ్రెస్‌ ఘన విజయం నేపథ్యంలో రాహుల్‌ గాంధీ సూచన మేరకు పార్టీ సీనియర్‌ నేతలంతా బెంగళూరులో శనివారం రాత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎన్నికపై కసరత్తు జరిగింది. ఏకాభిప్రాయ సాధన ఆధారంగా సీఎంను ఎంపిక చేయాలా..? లేదా అధిష్ఠానం సూచన మేరకు ముందుకు సాగాలా..? అనే అంశంపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. సీఎల్పీ సమావేశం ఆదివారం సాయంత్రం జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో తదుపరి సీఎం అనే అంశంపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.

Updated Date - 2023-05-14T12:36:45+05:30 IST