TS New Secretariat : కొత్త సెక్రటేరియట్ గుమ్మటాలను కూల్చేస్తామన్న బండికి అసెంబ్లీ వేదికగా BRS స్ట్రాంగ్ కౌంటర్.. నెట్టింట్లో పేలుతున్న మీమ్స్..
ABN , First Publish Date - 2023-02-12T12:20:08+05:30 IST
తెలంగాణలో బీజేపీ (TS BJP) అధికారంలోకి రాగానే నూతన సచివాలయ (New Secretariat) గుమ్మటాలను కూల్చేస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే..
తెలంగాణలో బీజేపీ (TS BJP) అధికారంలోకి రాగానే నూతన సచివాలయ (New Secretariat) గుమ్మటాలను కూల్చేస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. నిజాం వారసత్వ బానిస మరకలను సమూలంగా తుడిచివేస్తామని.. భారతీయ, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సచివాలయంలో మార్పులు చేస్తామని చెప్పారు. దీంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే (Telugu States) కాదు.. దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ కామెంట్స్‌పై బీఆర్ఎస్ ఒక్కరంటే ఒక్కరూ రియాక్ట్ అవ్వలేదు. కొన్నిరోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా.. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ అక్కడే ఉన్నారు. బయట కౌంటర్ ఇవ్వడం వీలుకాదేమో అనీ.. సభావేదికగానే మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) కౌంటర్లు ఇవ్వడం షురూ చేశారు.
మంత్రి కామెంట్స్ ఇవీ..
‘తెలంగాణ బీజేపీకి చెందిన నాయకులు (BJP Leaders) రైతాంగ (Farmers) అంశాల మీద మాట్లాడండి అంటే ఒక్కరికీ చేతకాదు. సెక్రటేరియట్ డోమ్ బాలోదు. దాన్ని కూలగొడదాం అని ఒకరు అంటున్నారు. మరొకరేమో ప్రగతి భవన్ (Pragathi Bhavan) అద్దాలు పేల్చేద్దాం.. అని అనడమే తప్ప రైతాంగ అంశాల మీద మాట్లాడటం చేతకాదు. ప్రజలకు ఏం చేద్దాం అనే ఆరాటం వీళ్ల మాటల్లో ఏ రోజైనా కనిపిస్తోందా. ఒక నిర్మాణాత్మకమైన ధోరణి, ఇదిగో ఇలా చేయండి అనే చర్చే ఉండదు. తూలనాడటం, అసభ్యంగా మాట్లాడటం, అనాగరికంగా మాట్లాడటం, అవహేళన చేసి మాట్లాడటం, వయసు తారతమ్యం కూడా లేకుండా మాట్లాడటం, ఏకవచన సంబోధన చేయడం ఇదంతా వాళ్ల అపరిపక్వతను అజ్ఞానాన్ని, మూర్ఖత్వాన్ని తెలియజేస్తోంది. కానీ సమాజం, ప్రజలు ఇవన్నీ గమనిస్తూనే ఉంటారు. విజ్ఞులే మిగతా సమాజాన్ని, సమూహాన్ని నడిపిస్తారు. ఆలోచనాపరులు ఇవన్నీ పూర్తిగా గమనిస్తుంటారు. ఇవన్నీ ఒట్టిగా పోవు. విమర్శకులను వారి మానాన వారిని వదిలిపెట్టి ప్రేక్షకపాత్ర వహించడానికి ఎవరూ సిద్ధంగా లేరు. తప్పకుండా రాష్ట్రంలోని రైతులనే కాదు.. దేశ వ్యాప్తంగా ఉండే రైతులకు ఒక బాట, లక్ష్యం చూపించడానికే ఇవాళ బీఆర్ఎస్ అవతరించింది’ అని మంత్రి సింగిరెడ్డి కౌంటరిచ్చారు.
నెట్టింట్లో పేలుతున్న మీమ్స్..
గుమ్మాలను కూలుస్తామన్న బండిపై సోషల్ మీడియాలో (Social Media) నెటిజన్లు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున మీమ్స్ (Memes), కామెంట్ల (Comments) వర్షం కురిపిస్తున్నారు. సుప్రీంకోర్టు (Supreme Court), మైసూరు ప్యాలెస్ (Mysore Palace), కర్ణాటక అసెంబ్లీ (Karnataka Assembly), న్యూఢిల్లీ సెక్రటేరియట్ (Delhi Secretariat) ఆఖరికి గుజరాత్ అసెంబ్లీ (Gujarat Assembly) వీటన్నింటికీ గుమ్మటాలు ఉన్నాయి.. వీటిని ఏం చేయాలని అనుకుంటున్నారు..? ఎప్పుడు కూలగొడతారు..? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 200 కరెన్సీ నోటు వెనుక భారతదేశంలోని పురాతన నిర్మాణం అయిన సాంచిస్థూపంలో సాంస్కృతిక వారసత్వ ప్రాముఖ్యతను సూచించడానికి డోమ్ చిత్రం ఉంటుంది. ఇది తెచ్చింది మోదీ ప్రభుత్వమే.. మరి దీన్ని కూడా కూల్చేస్తారా..? బండిగారు అంటూ నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ (BRS) అఫిషియల్ సోషల్ మీడియా కూడా రంగంలోకి దిగి బండిపై విమర్శనాస్త్రాలు సంధించింది. మరోవైపు.. అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin owaisi) కళ్లల్లో ఆనందం కోసమే తాజ్‌మహల్ (Tajmahal) లాంటి సమాధిని కట్టారన్న కామెంట్స్‌పై ఎంఐఎం (AIMIM) నుంచి కూడా కౌంటర్లు పేలుతున్నాయ్.
మొత్తానికి చూస్తే.. బండి చేసిన ఈ కామెంట్స్ మరోసారి తెలంగాణతో పాటు దేశ రాజకీయాల్లోనూ చర్చనీయాంశం అయ్యాయి. అయితే బండి మాటలను బీజేపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుని ప్రత్యేకంగా క్లాస్ తీసుకున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా డోమ్‌ల కామెంట్స్‌పై సీఎం కేసీఆర్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో అని బీఆర్ఎస్ శ్రేణులు ఎంతగానో వేచి చూస్తున్నాయి. కౌంటర్ ఉంటుందో లేకుంటే లైట్ తీసుకుంటారో వేచి చూడాల్సిందే మరి.