TS Assembly Elections 2023 : సీఎం కేసీఆర్‌తో భేటీ ముగిసిన నిమిషాల్లోనే ఎమ్మెల్యే ఫోన్ స్విచాఫ్.. ఏం జరిగిందా అని ఆరాతీస్తే..!
ABN , First Publish Date - 2023-08-18T23:26:11+05:30 IST
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న కొద్ది చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయ్. అతి త్వరలోనే బీఆర్ఎస్ అభ్యర్థుల (BRS List) తొలి జాబితాను రిలీజ్ చేయాలని భావిస్తున్న గులాబీ బాస్, సీఎం కేసీఆర్ (CM KCR).. టికెట్లు ఎవరికైతే ఇవ్వట్లేదో వారిని ప్రగతిభవన్‌కు పిలిపించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు...
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న కొద్ది చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయ్. అతి త్వరలోనే బీఆర్ఎస్ అభ్యర్థుల (BRS List) తొలి జాబితాను రిలీజ్ చేయాలని భావిస్తున్న గులాబీ బాస్, సీఎం కేసీఆర్ (CM KCR).. టికెట్లు ఎవరికైతే ఇవ్వట్లేదో వారిని ప్రగతిభవన్‌కు పిలిపించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఒకట్రెండు జాబితాలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయ్. దీంతో కొన్ని కీలక నియోజకవర్గాల్లో ఆశావహులు వర్సెస్ సిట్టింగ్‌లుగా పరిస్థితులు మారిపోయాయ్. మరికొన్నిచోట్ల ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నారనే వార్తలతో ఇరువర్గీయులు కొట్టుకునేంత పరిస్థితి.. ఆ నేతలిద్దరూ సవాళ్లు చేసుకునే పరిస్థితి. సరిగ్గా ఈ పరిస్థితుల్లో టికెట్లు ఇవ్వని సిట్టింగులను పిలిపించి వారిని బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు కేసీఆర్. శుక్రవారం నాడు జరిగిన ఒక్క సన్నివేశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
అసలేం జరిగింది..?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు (Athram Sakku) శుక్రవారం సాయంత్రం ప్రగతి భవన్ నుంచి పిలుపొచ్చింది. సార్ నుంచి కబురు రాగానే కొంచెం హ్యాపీగానే ఫీలయినప్పటికీ.. బాస్ ఏం షాకిస్తారో ఏమో అని ఇంకొంచెం కంగారుతోనే వెళ్లారు. మరోవైపు.. రేపో మాపో టికెట్లు ప్రకటిస్తారనుకున్న టైమ్‌లో తమ అభిమాన ఎమ్మెల్యేకు పిలుపు ఎందుకొచ్చినట్లు అని అనుచరులు, కార్యకర్తలు టెన్షన్ పడుతూనే ఉన్నారు. అనుచరుల టెన్షన్ అక్షరాలా నిజమైంది. ప్రగతి భవన్‌కు వెళ్లిన సక్కుతో సుమారు 10 నుంచి 15 నిమిషాల పాటు కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ‘సారీ సక్కు ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వట్లేదు.. ఆసిఫాబాద్ టికెట్ కోవా లక్ష్మికి (Kova Lakshmi) ఇస్తున్నాను. పార్లమెంట్ ఎన్నికల్లో చూద్దాం’ అని గులాబీ బాస్ చెప్పారు. దీంతో సక్కు ఫీజులు ఎగిరిపోయాయట. అధినేత నిర్ణయంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు సక్కు. ప్రగతి భవన్ నుంచి అలా బయటికొచ్చారో లేదో నిమిషాల వ్యవధిలోనే ఫోన్ స్విచాఫ్ చేశారు. అటు రిప్లయ్ కోసం బీఆర్ఎస్ ముఖ్య నేతల నుంచి ఫోన్లు చేసినా.. ఇటు భేటీలో ఏం జరిగిందని తెలుసుకోవడానికి ప్రధాన అనుచరులు కాల్ చేసినా కలవట్లేదు. దీంతో ఏం జరిగిందా అని ఆరాతీస్తే సక్కుకు సార్ టికెట్ ఇవ్వట్లేదని తెలుసుకున్న అభిమానులు, అనుచరులు తాము అనుకున్నదే నిజమయ్యింది అని ఆందోళన చెందుతున్నారట.
ఎవరీ కోవా లక్ష్మి..?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది నియోజకవర్గాల్లో ఆసిఫాబాద్ నుంచి గెలిచిన (Asifabad Assembly Constituency) ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఈయన.. ఆ తర్వాత బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈయనపైనే పోటీచేసిన బీఆర్ఎస్ మహిళా నేతే కోవా లక్ష్మి. 2014 ఎన్నికల్లో ఇదే సక్కుపై 19,055 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. అయితే 2018 ఎన్నికల్లో సక్కుకు 65,788 ఓట్లు రాగా.. లక్ష్మికి 65,617 ఓట్లు వచ్చాయి. దీంతో కేవలం 171 ఓట్ల తేడాతో లక్ష్మి పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత కోవాకు కోమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ పదవి కట్టబెట్టారు కేసీఆర్. కొన్నిరోజులకే సక్కు కూడా కారెక్కడంతో ఇరు వర్గీయుల మధ్య అంతర్గతంగా ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. ఆ గొడవలు కాస్త టికెట్ నీకా.. నాకా..? అనే వరకు వచ్చాయి. సక్కు చేరికతో మొదలైన వివాదం.. శుక్రవారం సాయంత్రం పీఠముడి వీడింది. అంచనాలన్నీ తారుమారు చేస్తూ.. కోవాలక్ష్మికి టికెట్ ఇస్తున్న కేసీఆర్ ప్రకటించడం.. సక్కుకు మొండిచేయి ఇచ్చినట్లే. ఈ పరిస్థితుల్లో సక్కు ఎటువైపు అడుగులేస్తారు..? పార్లమెంట్‌లో ఛాన్స్ ఇస్తానన్న కేసీఆర్ మాటను నమ్మి కారు పార్టీలోనే ఉంటారా..? ఇక ఇవన్నీ ఎందుకనీ తిరిగి సొంతగూడైన కాంగ్రెస్‌లోకి చేరిపోతారా..? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.