YSRCP : వైసీపీలో ఆగని అసంతృప్తి జ్వాలలు.. అధిష్టానంపై ఆగ్రహంతో రాజీనామా..
ABN , First Publish Date - 2023-02-05T16:12:32+05:30 IST
వైసీపీ (YSR Congress) అధిష్టానంపై అసంతృప్తి జ్వాలలు ఇప్పట్లో చల్లారేలా లేవు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగానే పరిస్థితులు ఇలా ఉంటే..
అమరావతి/గుంటూరు : వైసీపీ (YSR Congress) అధిష్టానంపై అసంతృప్తి జ్వాలలు ఇప్పట్లో చల్లారేలా లేవు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగానే పరిస్థితులు ఇలా ఉంటే.. ఇక దగ్గరపడితే సీన్ ఎలా ఉంటుందో సొంత పార్టీ నేతలకే ఊహకందట్లేదు. నెల్లూరు జిల్లాలో (Nellore) ఎమ్మెల్యేలు ఆనం (Anam Ramnarayana Reddy), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) తో మొదలైన అసంతృప్తి, కర్నూలు (Kurnool) వరకూ పాకగా.. ఇప్పుడు గుంటూరు (Guntur) జిల్లాలో కూడా మొదలైంది. ఓ వైపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. మరోవైపు ద్వితియశ్రేణి నేతలు.. ఇక సర్పంచ్‌లు (Sarpanch), ఎంపీటీసీలు (MPTC) మీడియా ముందుకొచ్చి అసంతృప్తిని వెల్లగక్కుతుంటే వైసీపీలో (YSRCP) ఏం జరుగుతోందో అధిష్టానానికి కూడా అంతుచిక్కట్లేదు.
కారణమిదే..
అధికార పార్టీలో ఉన్నా.. ఒక్క పనీ చేయలేకపోతున్నా.. చేసిన పనులకు బిల్లులు రావట్లేదని తీవ్ర అసంతృప్తికి లోనై తెనాలి (Tenali) నియోజకవర్గానికి చెందిన ఎంపీటీసీ కాలిశెట్టి ఫణి కుమార్ (Kalishetty Phani Kumar) రాజీనామా చేశారు. అంతకుముందు తెనాలి మండల సర్వసభ్య సమావేశంలో అభివృద్ధిపనులు జరగట్లేదని అధికారులు, నేతలకు మొరపెట్టుకున్నారు. అయినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు లోనై ఎంపీటీసీ రాజీనామా చేశారు. తన సొంత డబ్బులతో చేసిన పనులకు కూడా బిల్లులు (Pending Bills) రావడం లేదని ఎంపీటీసీ చెబుతున్నారు. తన రాజీనామా లేఖను ఎంపీపీకి అందజేశారు ఫణి.
రాజీనామా లేఖలో ఏముంది..?
‘కొలకలూరు ఎంపీటీసీ-2వ సభ్యునిగా గెలిచి ప్రస్తుతం ఎంపీటీసీగా తెనాలి మండల ప్రజా పరిషత్ సభ్యునిగా కొనసాగుతున్నాను. మా గ్రామానికి సంబంధించి మండల పరిషత్ తీర్మానాలు అమలు చేయడంలో అధికారుల అలసత్వా్నికి, పనులు చేయించుకోలేని దుస్థితి. ఎంపీటీసీ సభ్యునిగా నేను కారణం కాకూడదని భావిస్తూ.. ఆఖరి అవకాశంగా మార్చి-01 తేదీలోపు పనులు ప్రారంభించకపోతే దీనినే నా పదవికి రాజీనామాగా భావించి.. ఆమోదించవలసిందిగా కోరుతున్నాను. రాజీనామా ఫార్మాట్‌లో మార్చి-01న మరోసారి రాజీనామా పత్రాన్ని సమర్పిస్తాను’ అని ఫణి తన లేఖలో పేర్కొన్నారు.