KTR: రేవంత్రెడ్డి, బండి సంజయ్కు కేటీఆర్ లీగల్ నోటీసులు
ABN , First Publish Date - 2023-03-23T19:36:02+05:30 IST
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి (Revanth Reddy), తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay)కు కేటీఆర్ లీగల్ నోటీసులు (KTR legal notices) పంపించారు.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి (Revanth Reddy), తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay)కు కేటీఆర్ లీగల్ నోటీసులు (KTR legal notices) పంపించారు. ఉద్యోగాల జాతరకు పాతరేయాలన్న విపక్షాల కుట్రలు సాగనివ్వబోమని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ఒక్క దురదృష్టకర సంఘటనను బూచిగా చూపి మొత్తం నియామకాల ప్రక్రియను ఆపేయాలన్నదే బీజేపీ, కాంగ్రెస్ కుతంత్రమని మండిపడ్డారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేరు ప్రభుత్వం వేరు అన్న ఇంగిత జ్ఞానం లేని అజ్ఞానులు అంటూ రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌ను ఉద్దేశిస్తూ కేటీఆర్ విమర్శించారు. వెకిలి మకిలి ఆరోపణలతో బట్టగాల్చి మీదేసే చిల్లర ప్రయత్నాలను సహించేది లేదని, మతిలేని మాటలు మాట్లాడుతున్న పిచ్చి నేతల రాజకీయ ఉచ్చులో యువత చిక్కుకోవద్దని కేటీఆర్ సూచించారు. ఉద్యోగాల ప్రిపరేషన్‌ను కొనసాగించాలని యువతకు మంత్రి కేటిఆర్ విజ్ఞప్తి చేశారు.
టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీపై విచారణను సిట్ అధికారులు వేగవంతం చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (TPCC Chief Revanth Reddy) ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని సిట్ తెలిపింది. ఒకే మండలంలో వంద మందికి 100 మార్కులు వచ్చినట్లు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆయన ఆరోపణలపై రేవంత్ ఆధారాలు సమర్పించలేదని సిట్ అధికారులు పేర్కొన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు సంస్థ (SIT) సిద్ధపడుతోంది. న్యాయపరమైన సలహాలు తీసుకొని రేవంత్‌పై చర్యలు తీసుకుంటామని సిట్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
రేవంత్ రెడ్డిపై సిట్ విచారణ ముగిసింది. గంటపాటు రేవంత్ TPCC chief) ను సిట్ విచారించింది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ (TSPSC Leakage)కి సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలను సిట్ అధికారులకు అందజేసినట్లు ఆయన తెలిపారు. విచారణ ముగిసిన అనంతరం టీపీసీసీ చీఫ్ మీడియాతో మాట్లాడుతూ... ఆరు దశాబ్దాలు పోరాటం తరువాత తెలంగాణ సాధించుకున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది అమర వీరుల కుటుంబాలని తెలిపారు. 2009 మలి ఉద్యమం కూడా ఉద్యోగాల నియామాకాలపైనే జరిగిందని చెప్పారు. ప్రాణత్యాగాలు చేసి తెలంగాణను నిలబెట్టారని టీపీసీసీ చీఫ్ గుర్తుచేశారు.
తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక దేవాలయం, మసీదు, ప్రార్థనా మందిరం లాంటిదని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసం నమ్మకం కలిగించాల్సిన బాధ్యత టీఎస్‌పీఎస్సీకి ఉందన్నారు. టీఎస్‌పీఎస్సీ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాల్సిన అధికారులు వైఫల్యం చెందారని విమర్శించారు. టీఎస్‌పీఎస్సీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని ఆరోపించారు. పరీక్షల నిర్వహణలో అధికార పార్టీ నేతలు తల దూర్చారన్నారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నా పత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కేటీఆర్ బాధ్యత వహించాలని.. వెంటనే ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్‌పీఎస్సీలో చైర్మన్ అలాగే వెంకట లక్ష్మీని జైలుకి పంపాలన్నారు. టీఎస్‌పీఎస్సీ పరీక్షలు రాసిన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.