Share News

Pawan Kalyan: వైసీపీ అనే చీడను ఏపీ ప్రజలు వదిలించుకోవాలి

ABN , First Publish Date - 2023-10-23T18:46:56+05:30 IST

ఏపీకి వైసీపీ అనే చీడ పట్టుకుందని.. ఈ చీడను వదిలించుకోవాలంటే టీడీపీ, జనసేన అనే వ్యాక్సిన్ మందుగా వాడాలని పవన్ స్పష్టం చేశారు.

Pawan Kalyan: వైసీపీ అనే చీడను ఏపీ ప్రజలు వదిలించుకోవాలి

రాజమండ్రిలోని హోటల్ మంజీరాలో టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. ఈ భేటీకి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అలాగే ఇరుపార్టీలకు చెందిన 12 మంది సమన్వయ కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల సందర్భంగా భవిష్యత్ కార్యాచరణ, ఉమ్మడిగా చేపట్టే కార్యక్రమాలపై కలిసి ముందుకు సాగే అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాలో మాట్లాడారు. ఏపీకి వైసీపీ అనే చీడ పట్టుకుందని.. దానికి టీడీపీ, జనసేన అనే వ్యాక్సిన్ మందు అని పవన్ స్పష్టం చేశారు. ఏపీకి అనుభవజ్ఞుడైన నేత కావాలనే 2014లో చంద్రబాబుకు మద్దతు ఇచ్చానని తెలిపారు. మరోసారి ఇప్పుడు ఏపీకి అనుభవం కలిగిన నేత కావాలన్నారు. ప్రస్తుతం ఏపీలో జగన్ పాలన భయంకరంగా ఉందని.. టీడీపీ అగ్రనేతలలో పాటు జనసేన నేతలను వేధించడమే జగన్ పనిగా పెట్టుకున్నారని పవన్ విమర్శించారు.

ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక జగన్ గాలికి వదిలేశారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఏపీ భవిష్యత్ కోసం చారిత్రాత్మక పొత్తుకు శ్రీకారం చుట్టామని వివరించారు. కక్షతో చంద్రబాబును వేధించి జైల్లో మగ్గేలా వైసీపీ ప్రభుత్వం చేస్తోందన్నారు. ఆయన్ను అక్రమంగా, అకారణంగా జైల్లో పెట్టారని.. సాంకేతిక అంశాల పేరుతో బెయిల్ రాకుండా చేస్తున్నారని పవన్ అన్నారు. ప్రజలకు భరోసా ఇచ్చేందుకు, చంద్రబాబుకు మద్దతు ఇచ్చేందుకే రాజమహేంద్రవరంలో టీడీపీ నేతలతో భేటీ అయ్యామన్నారు. వచ్చే ఎన్నికలకు ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉండాలనే అంశంపై చర్చించామని తెలిపారు. టీడీపీ, జనసేన కలిసి ఎలాంటి అంశాల్లో ముందుకెళ్లాలనే దానిపై సుదీర్ఘంగా చర్చి్ంచినట్లు పవన్ కళ్యాణ్ వివరించారు. టీడీపీ, జనసేన మధ్య ఎట్టి పరిస్థితుల్లో గొడవలు రావన్నారు. అభివృద్ధి, సంక్షేమం జోడెద్దులు అని.. అప్పులు చేసి కాకుండా రాష్ట్రాన్ని తాము అభివృద్ధి చేసి చూపిస్తామని పవన్ స్పష్టం చేశారు.

Updated Date - 2023-10-23T18:51:12+05:30 IST