YCP Chief Jagan: ఒకవైపు అవినాష్‌తో అల్లాడుతుంటే జగన్‌కు ఇదెక్కడి తలనొప్పి..!

ABN , First Publish Date - 2023-04-26T14:59:38+05:30 IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రెడ్డికి సొంత వారి నుంచే సమస్యలు చుట్టుముడుతున్నాయి. జగన్ చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసులో తమ్ముడైన..

YCP Chief Jagan: ఒకవైపు అవినాష్‌తో అల్లాడుతుంటే జగన్‌కు ఇదెక్కడి తలనొప్పి..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రెడ్డికి (YCP Chief Jagan Reddy) సొంత వారి నుంచే సమస్యలు చుట్టుముడుతున్నాయి. జగన్ చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసులో (YS Viveka Murder Case) తమ్ముడైన అవినాశ్ రెడ్డి (YCP MP Avinash Reddy) రేపోమాపో అరెస్ట్ అయ్యే పరిస్థితులు ఉండటం, అవినాశ్ తండ్రి భాస్కర రెడ్డి (Avinash Father Bhaskar Reddy) ఇప్పటికే అరెస్ట్ కావడంతో వైసీపీ అధినేత కుటుంబం కొన్ని రోజులుగా మానసిక వేదనతో సతమతమవుతోంది. రాజకీయంగా, పాలనాపరంగా జగన్ సందిగ్ధావస్థలో ఉన్నట్లు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వివేకా హత్య జరిగిన రోజు కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి వైఎస్ భారతి‌తో ఫోన్ కాల్ మాట్లాడినట్లు వార్తలు గుప్పుమనడంతో వైసీపీ అధినేత జగన్‌లో మరింత కలవరపాటు మొదలైంది. అవినాశ్ రెడ్డి ఈ కేసు విచారణ ఎదుర్కొంటున్న సమయంలోనే జగన్ హుటాహుటిన ఢిల్లీకి వెళ్లడం, ప్రధాని మోదీని జగన్ కలిసే లోపు ఢిల్లీలోని వైసీపీ అధినేత ఇంట్లో అవినాశ్, జగన్ భేటీ కావడం వంటి పరిణామాలు వైసీపీలో వివేకా హత్య కేసు కలవరపాటును కళ్లకు కట్టాయి. ఇన్ని టెన్షన్లతో జగన్ సతమతమవుతుంటే ఇవి చాలవన్నట్టు రాజకీయంగా అయినవాళ్లే వైసీపీ అధినేతకు కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతుండటం కొసమెరుపు.

balineni-srinivasreddy.jpg

ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రూపంలో జగన్‌కు పెద్ద చిక్కు వచ్చి పడింది. బాలినేని మరెవరో కాదు జగన్‌కు దగ్గర బంధువు. మంత్రివర్గం నుంచి తనను తప్పించినప్పటి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్‌పై ఏదో ఒక రూపంలో తన అసంతృప్తిని బయటపెడుతూనే ఉన్నారు. ఇటీవల.. ప్రకాశం జిల్లాలో జగన్ పర్యటించిన సమయంలో బాలినేని బాహాటంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కారు. అలిగి వెళ్లిపోయిన బాలినేనిని జగన్ స్వయంగా సభకు రప్పించి బటన్ నొక్కించిన పరిస్థితి. జగన్‌తో కలిసి వేదిక పంచుకున్నప్పటికీ బాలినేని ముభావంగానే కనిపించారు. తాజాగా.. జిల్లా మంత్రులకు ఝలక్ ఇచ్చి వైసీపీ అధినేత జగన్‌కు పంటి కింద రాయిలా మారారు. బాలినేని శ్రీనివాసరెడ్డిపై కన్నెర్ర చేసే పరిస్థితి జగన్‌కు లేదు. బాలినేనికంటూ జిల్లాలో ఓ వర్గం ఉంది. జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలకు ఈ మాజీ మంత్రి ఎంత చెబితే అంత. అలాంటి బాలినేనిని బుజ్జగించుకుని దారికి తెచ్చుకోవడమే తప్ప జగన్‌కు మరో మార్గం లేదు.

balineni.jpg

ప్రకాశం జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశానికి వచ్చిన ఇద్దరు మంత్రులు సమావేశం నిర్వహణ కన్నా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఆ సమావేశానికి బాలినేని హాజరుకాకుండా ఇతర కార్యక్రమాలు పెట్టుకొని మంత్రులకు సాయంత్రం వరకూ అందుబాటులోకి రాకపోవడం చర్చనీయాంశమైంది. ఇద్దరు రాష్ట్ర మంత్రులు మాజీ మంత్రి కోసం వేచి చూడటం, ఒంగోలులో ఉండి కూడా బాలినేని డీఆర్సీ సమావేశానికి వెళ్లకపోవడం ఎంత వరకు సమంజసమని స్థానికంగా చర్చ జరిగింది. రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో బాలినేనిని తప్పించి ఆదిమూలపు సురేష్‌ను కొనసాగించిన విషయం విదితమే. అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్న బాలినేని పార్టీలో ప్రాధాన్యం ఇస్తూనే ప్రకాశం జిల్లాను తన పరిధి నుంచి తప్పించడంతో మరింత అసహనానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లాకు సంబంధించిన పార్టీ, పాలన వ్యవహారాలకు ఆయన దూరంగానే ఉంటూ నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఈ సమయంలో మార్కాపురంలో సీఎం పర్యటన సందర్భంగా ఎదురైన ప్రొటోకాల్‌ సమస్యతో బాలినేని మరింత అసంతృప్తికి గురైనట్లు తెలిసింది.

Balineni-Srinivas.jpg

ఈ నేపథ్యంలో మంగళవారం ఒంగోలులో నిర్వహించిన డీఆర్సీ సమావేశానికి ఇన్‌చార్జి మంత్రి మేరుగ నాగార్జునతో పాటు, జిల్లాకు చెందిన మంత్రి సురేష్‌, ఇతర ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఒంగోలులోనే ఉన్నప్పటికీ ఎమ్మెల్యే బాలినేని గైర్హాజరయ్యారు. ఉదయం నగరంలో గడపగడపకు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మధ్యాహ్నం నుంచి కొండపి నియోజకవర్గంలోని కారుమంచిలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. డీఆర్సీ సమావేశానికి హాజరు కాకుండా తన అసంతృప్తిని బాలినేని పరోక్షంగా తెలియజేసినట్లు స్థానికంగా భావిస్తున్నారు. అయితే డీఆర్సీ అనంతరం అతిథి గృహానికి వెళ్లి మధ్యాహ్నం భోజనం చేసి వెళ్లిపోవాల్సిన మంత్రులు ఆగిపోయారు. కారుమంచి నుంచి బాలినేని వచ్చే వరకూ వేచి ఉండి ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. మంత్రులు నాగార్జున, సురేష్‌తో పాటు ఎమ్మెల్యేలు నాగార్జున రెడ్డి, వేణుగోపాల్‌ కూడా వారి వెంట ఉన్నారు.

273422362_4987036127983481_6693820651891360031_n.jpg

కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్‌ అయితే ముందుగానే గోపాల్‌నగర్‌లో ఉన్న బాలినేనిని కలిసి అనంతరం డీఆర్సీకి వెళ్లారు. కాగా ఇద్దరు దళిత మంత్రులు నిరీక్షించి మరీ బాలినేనిని కలిసి వెళ్లడం ఎంతవరకు సబబు? వైసీపీలో అసలేం జరుగుతుంది? అన్న చర్చ మొదలైంది. ఇలా అవకాశం దొరికినప్పుడల్లా మాజీ మంత్రి బాలినేని వైసీపీకి రాజకీయంగా నష్టం కలిగించేలా వ్యవహరిస్తుండటంతో బాలినేనిని డీల్ చేయడం జగన్‌కు సవాల్‌గా మారింది. అసలే వివేకా హత్య కేసులో అయినవాళ్లు జైలుకెళుతున్నారన్న టెన్షన్‌లో జగన్ ఉంటే బాలినేని కొత్త టెన్షన్‌‌ను క్రియేట్ చేస్తుండటంతో వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ భవితవ్యం ఏంటోననే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది.

Updated Date - 2023-04-26T14:59:44+05:30 IST