Viral News: కత్రినాకు హార్డ్‌కోర్ ఫ్యాన్స్ ఈ హర్యానా దంపతులు.. ఎంతలా అంటే..
ABN , First Publish Date - 2023-07-21T12:48:59+05:30 IST
సినిమా యాక్టర్లకు అభిమానులు ఉండడం కామన్.
Viral News: సినిమా యాక్టర్లకు అభిమానులు ఉండడం కామన్. తమ అభిమాన హీరో సినిమా వస్తుందంటే చాలు.. ఓ రేంజ్‌లో హడావుడి చేస్తుంటారు. పెద్దపెద్ద కటౌట్లు కట్టడాలు, పూలమాలలు, కొబ్బరి కాయలు, పాలాభిషేకం ఇలా చెప్పుకుంటేపోతే చాలానే ఉంటాయి. కానీ, కొంతమంది మాత్రం అంతకుమించి అనేలా ఉంటారు. ఇదే కోవకు చెందినవారు హర్యానాకు చెందిన ఈ దంపతులు. బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ (Katrina Kaif) అంటే వారికి ఎనలేని అభిమానం. ఇంకా చెప్పాలంటే ఆ భార్యాభర్తలకు ఆమె ఓ దేవత. రోజూ పూజలు కూడా చేస్తుంటారు. ఈ నెల 16న కత్రినా 40వ యేటాలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తాజాగా ఈ దంపతులు వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యారు.
హర్యానా రాష్ట్రం ధని ఫోగట్ పరిధిలోని మారుమూల గ్రామం చర్ఖి దాద్రి. ఈ గ్రామానికి చెందిన దంపతులు బంతు, సంతోష్. వీరికి కత్రినా కైఫ్ అంటే వీరాభిమానం. ఎంతలా అంటే ఆమెను ఓ దేవతలా పూజిస్తుంటారు. ఆమె ఫొటోలకు ముందు అగర్‌బత్తిలు ముట్టించి, కొబ్బరి కాయలు కొట్టి మొక్కుతుంటారు కూడా. గడిచిన పదేళ్లుగా ఇదే తంతు. ఇక ఆమె బర్త్‌డే వచ్చిందంటే చాలు.. ఓ పండుగలా సెలబ్రేట్ చేస్తుంటారు. కేక్ కటింగ్, చుట్టుపక్కల వారికి భోజనాలు ఇలా ఓ రేంజ్‌లో కత్రినా పుట్టినరోజును ఈ హర్యానా దంపతులు (Haryana Couple) జరుపుతుంటారు. ఇలా కత్రినాపై ఈ ప్రత్యేక భక్తితోనే వారు స్థానికంగా బాగా పాపులర్ అయ్యారు. దాంతో సోషల్ మీడియా (Social Media) కు ఎక్కడం, వైరల్ కావడం జరిగిపోయాయి. అయితే, బంతు దంపతులకు ఒక కోరిక ఉందట. అదేంటంటే.. జీవితంలో ఒక్కసారైనా కత్రినాను కలవాలనేది. ఇక సామాజిక మాధ్యమాల్లో ఇంతలా వైరల్‌గా మారిన వీరు.. కత్రినా దృష్టికి వెళ్తే మాత్రం వారి కోరిక త్వరగానే నెరవేరే అవకాశం లేకపోలేదు.