బంగారాన్ని దోచేందుకు సొరంగాన్నే తవ్వేశారు.. చివరకు క్షమించండంటూ గోడపై రాసి ఎస్కేప్.. బంగారాన్ని అందుకే తీసుకెళ్లలేదట..!
ABN , First Publish Date - 2023-03-05T10:24:41+05:30 IST
ఎప్పట్లా ఉదయాన్నేవెళ్ళి బంగారు దుకాణం ఓపెన్ చేసి దుకాణంలో కనిపించిన దృశ్యం చూసి యజమాని షాకయ్యాడు..
నేరుగా ఇంటి గుమ్మం గుండా లోనికెళ్ళి దొంగతనం చేసే అలవాటు దొంగలకెప్పుడూ లేదు. 'మా దారి రహదారి కాదు దొడ్డిదారే..' అని చెప్పేరకం వీళ్ళు. ఆ దొడ్డిదారిలో కన్నాలు వేసి స్వాహా చేస్తారు. ఓ ఇద్దరు దొంగలు బంగారు దుకాణాన్ని దోచుకోవడానికి ఇలాంటి పథకమే వేశారు.అందుకోసం ఏకంగా 15అడుగుల సొరంగాన్ని తవ్వారు. అంత చేసీ దుకాణంలోకెళ్ళి.. ఒక్క ముక్క బంగారం కూడా వెంట తీసుకోకుండా వెనక్కు వెళ్ళిపోయారు. వెళుతున్నవాళ్ళు తిన్నగా వెళ్ళకుండా ఆ దుకాణం యజమాని కోసం సారీ బోర్డ్ ఒకటి తగిలించారు. డ్రామాటిక్ గా సాగిన ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే..
ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం మీరట్(Meerut) లో దీపక్ కుమార్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతనికి బంగారు దుకాణం(Gold Shop) ఉంది. ఇతను ఎప్పట్లా ఉదయాన్నేవెళ్ళి బంగారు దుకాణం ఓపెన్ చేసి దుకాణంలో కనిపించిన దృశ్యం చూసి షాకయ్యాడు. షాప్ లోపల మనిషి పట్టగలిగేంత రంధ్రం(Hole) కనిపించింది. కంగారుగా దగ్గరకెళ్ళి చూడగా ఎవరో షాప్ లోకి వచ్చి వెళ్ళినట్టు అర్థమైంది. వెంటనే షాప్ మొత్తం పరికించి చూశాడు. ఒకచోట మమ్మల్ని క్షమించండి అనే సారీ బోర్డ్ కనిపించింది. అసలేమయ్యిందో అర్థం కాని గందరగోళంలో అతను బంగారు నగలు(Gold Jwellery) భద్రపరిచిన లాకర్(Locker) చెక్ చేశాడు. తను ముందురోజు ఎలా వేశాడో అలాగే ఉంది లాకర్. దొంగతనం(Theft) అయితే జరగలేదు కానీ తన షాప్ లోకి దొంగలు జొరబడినట్టు అర్థమైంది అతనికి. అతను వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
దీపక్ కుమార్ షాప్ వద్దకు చేరుకున్న పోలీసులు రంధ్రాన్ని పరిశీలించారు. దొంగలు షాపుకు ఆనుకుని ఉన్న డ్రైనేజి వ్యవస్థ(Drainage System) నుండి 15అడుగుల సొరంగాన్ని తవ్వినట్టు గుర్తించారు. గ్యాస్ కట్టర్(Gas Cutter) ఉపయోగించి షాప్ లోనికి ప్రవేశించారు కానీ ఆ గ్యాస్ కట్టర్ ఉపయోగించి దీపక్ కుమార్ బంగారు నగలు భద్రపరిచిన లాకర్ (Safety Locker)ను తెరవలేకపోయారు. ఈ దొంగలు చేసిన మరొక పనేంటంటే వారు లాకర్ తెరవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ షాప్ లో ఉన్న శీకృష్ణుడి విగ్రహాన్ని(Lord Srikrishna Statue) వెనక్కు తిప్పారు. 'దేవుడిని చూసి భయపడి వాళ్ళు అలా చేశారేమో..' అని సదరు దుకాణం యజమాని చెప్పుకొచ్చాడు. ఎంత ప్రయత్నించినా లాకర్ తెరుచుకోకపోయేసరికి సదరు దొంగలిద్దరూ మమ్మల్ని క్షమించండి అని ఒక సారీ బోర్డ్ తగిలించి వెళ్ళారు. కాగా ఈ దొంగలు షాపులో సీసీటీవి కెమెరాలు(CCTV Cameras) గమనించి వీడియో రికార్డింగ్ భద్రపరిచిన హార్డ్ డిస్క్(Hard Disk) ను ఎత్తుకెళ్ళారట. అయితే వీరు సొరంగం తవ్వి చాలా రోజులు అయినట్టు పోలీసులు తెలిపారు. ఆ సీసీటీవీ పుటేజ్ ఉన్న ప్రాంతంలో వ్యక్తుల కదలికలను ట్రాక్ చేయడం ద్వారా దొంగలను పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది.