Veerasimha Reddy Film Review: నరుకుడు, చంపుడు, కొట్టుడు... ఇది బాలకృష్ణ ఫ్యాక్షన్ సినిమా
ABN , First Publish Date - 2023-01-12T14:13:18+05:30 IST
సంక్రాంతి (Sankranthi) పండగ అంటే తెలుగు ప్రజలకి సినిమా కూడా ఆ పండగలో ఒక భాగం. ఈసారి సంక్రాంతి పండగలో రెండు పెద్ద సినిమాలు బరిలో నిలిచాయి, అందులో బాలకృష్ణ నటించిన
సినిమా: ‘వీరసింహా రెడ్డి’
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్, హానీ రోజ్, దునియా విజయ్, లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు
ఛాయాగ్రహణం: రిషి పంజాబి
సంగీతం: ఎస్. తమన్
నిర్మాత: నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని
విడుదల తేదీ: 12-01-2023
--- సురేష్ కవిరాయని
సంక్రాంతి (Sankranthi) పండగ అంటే తెలుగు ప్రజలకి సినిమా కూడా ఆ పండగలో ఒక భాగం. ఈసారి సంక్రాంతి పండగలో రెండు పెద్ద సినిమాలు బరిలో నిలిచాయి, అందులో బాలకృష్ణ నటించిన ‘వీరసింహా రెడ్డి’ (Veera Simha Reddy) ఒకటి. ఫ్యాక్షన్ సినిమా అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది బాలకృష్ణనే, ఎందుకంటే అతను అలాంటి సినిమాలు తీసి గొప్ప విజయాలు సాధించాడు. ఇప్పుడు ఈ ‘వీరసింహా రెడ్డి’ కూడా ఒక ఫ్యాక్షన్ సినిమా నేపథ్యంలో వచ్చినదే అని అందరికి తెలుసు. దీనికి గోపిచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకుడు కాగా, మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మాతలు. ఈసారి సంక్రాంతి బరిలో వున్న రెండు సినిమాలకి వీళ్ళే నిర్మాతలు. శృతి హాసన్ (Shruti Haasan) కథానాయిక కాగా, వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarath Kumar) ఒక ప్రధాన పాత్రలో కనిపిస్తుంది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ (Veerasimha Reddy Story):
ప్రతి ఫ్యాక్షన్ కథ సీమలో జరిగినట్టే ఇది కూడా రాయలసీమలో జరిగే ఒక ఫ్యాక్షన్ కథే. జై (నందమూరి బాలకృష్ణ) అతని తల్లి మీనాక్షి (హనీ రోజ్) తో ఇస్తాంబుల్‌లో హోటల్ బిజినెస్ చేస్తూ వుంటారు. ఒక సంఘటనలో అతనికి ఈషా (శృతి హాసన్) అనే అమ్మాయి పరిచయం అయి, ఆ తర్వాత ఆ పరిచయం పెళ్ళికి కూడా దారితీస్తుంది. ఈషా తండ్రి (మురళి శర్మ) ఈ పెళ్ళికి ఒప్పుకుంటాడు, జై తల్లిదండ్రులతో మాట్లాడుతా అని చెప్తాడు. జై తనకి తండ్రి లేడు అనుకుంటాడు, కానీ అప్పుడు తల్లి మీనాక్షి అతనికి తండ్రి వున్నాడు, అతను మరెవరో కాదు రాయలసీమలో అందరూ దేవుడుగా భావిస్తున్న వీరసింహ రెడ్డి (బాలకృష్ణ) అని చెప్తుంది. మీనాక్షి కబురు చెయ్యగానే సీమ నుండి వీరసింహ రెడ్డి ఇస్తాంబుల్ వస్తాడు. వీరసింహ రెడ్డిని వెతుక్కుంటూ ప్రత్యర్థి ప్రతాప్ రెడ్డి (దునియా విజయ్), అతని భార్య భానుమతి (వరలక్ష్మి శరత్ కుమార్) ఇస్తాంబుల్ వచ్చి వీరసింహా రెడ్డిని ఎటాక్ చేస్తారు. ఎటాక్ చేసే సమయంలో భానుమతి ఎవరో కాదు, వీరసింహ రెడ్డి చెల్లెలు అని తెలుస్తుంది. ఎందుకు చెల్లెలు అన్న అయిన వీరసింహారెడ్డిని చంపాలని అనుకుంటుంది? మీనాక్షి, వీరసింహ రెడ్డి ఎందుకు విడిపోయారు, మీనాక్షి ఇస్తాంబుల్‌లో ఎందుకుంది? ప్రతాప్ రెడ్డికి ఎందుకు అంత పగ? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ (Veerasimha Reddy Movie Analysis):
దర్శకుడు గోపీచంద్ మలినేని ఇంతకు ముందు ఒక అరడజను సినిమాలు చేశాడు, అందులో యాక్షన్ సినిమాలు వున్నాయి, కానీ మొదటి సారిగా బాలకృష్ణ లాంటి ఒక పెద్ద స్టార్‌తో ఫ్యాక్షన్ నేపధ్యంలో ఈ సినిమా చేశాడు. అయితే గోపీచంద్ కొత్త కథను ఏమీ తయారుచేసుకుండా బాలకృష్ణ పాత సినిమాల కథలు కొన్నిటిని మిక్స్ చేసి ఈ ‘వీరసింహా రెడ్డి’ కథని తయారుచేశాడు. అభిమానులను అలరించడానికి కొన్ని మాస్ ఎలెమెంట్స్ అయిన యాక్షన్, పాటలు, డైలాగ్స్ పెట్టాడు. అంతే కానీ సినిమాలో దమ్ము లేదు. బాలకృష్ణ ఇంతకు ముందు కొన్ని ఫ్యాక్షన్ సినిమాలలో కనిపించినట్టుగా ఇందులో కూడా తండ్రీ కొడుకులుగా దర్శకుడు చూపించాడు. అందుకని అందులో పెద్దగా తేడా ఏమి కనిపించలేదు. అయితే తండ్రి గెటప్ ‘లెజెండ్’ సినిమాలో బాలకృష్ణ ఎలా వున్నాడో అలాగే ఇక్కడ కూడా చూపించాడు. ఇంచుమించు ఆ సినిమాలో కథ లాగే ఇక్కడ కూడా ఉంటుంది. అలాగే అభిమానుల పేరు చెప్పి దర్శకుడు ఎక్కువ హింస పెట్టడం కొన్ని సన్నివేశాలు అయితే చూడటానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. మితిమీరి వుంది ఆ యాక్షన్, ఏదైనా మితి మీరితే మంచిది కాదు.
అలాగే సినిమాలో కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. జగన్ ప్రభుత్వం మీద పరోక్షంగానే డైలాగ్స్ రూపంలో బాణాలు సంధించాడు. పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ నుండి ఎందుకు వెళ్లిపోతున్నాయి అన్న దాని మీద మాటల తూటాలు పేల్చారు. ‘30 ఏళ్ల నుండి ఇక్కడ పరిశ్రమ పెట్టాం, ఉద్యోగాలు ఇచ్చాం, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇబ్బందులు పెడుతోంది, కరెంటు తీసేసారు, నీళ్లు ఇవ్వటం లేదు, ప్రభుత్వంలో పెద్దలకి వాటాలు అడుగుతున్నారు’ అని ఒక బిజినెస్ మాన్‌తో చెప్పించాడు. ఇంకో దగ్గర ‘ప్రజలు ఎన్నుకున్న వెధవలు వాళ్ళు.. అయినా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు కదా అందుకని వాళ్ళని కలవాలి’ అని బాలకృష్ణ అనటం లాంటి డైలాగ్స్ డైరెక్ట్‌గా జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి రాసినవే. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు తప్పితే సినిమా అంతా నరుకుడు, కొట్టుడు, చంపుడే. చివరలో చిన్న సిస్టర్ సెంటిమెంట్ పెట్టాడు కానీ అది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో తెలీదు. చాలా తెలుగు సినిమాల్లో లానే ఈ సినిమాలో కూడా కథానాయిక అయిన శృతి హాసన్‌కి రెండు సన్నివేశాలు, ఒక పాట తప్ప ఇంకేమి ప్రాముఖ్యం ఇవ్వలేదు. (Veerasimha Reddy Movie Review)
రాయలసీమ ఫ్యాక్షన్ అనగానే హీరో ఒక్కడే అందంగా బాగుంటాడు, విలన్స్ అందరూ కూడా అదే హీరో పుట్టిన రాయలసీమ అయినా.. వాళ్ళందరూ పురాణాల్లో రాక్షసులను వర్ణించినట్టుగా కనిపిస్తారు. ఎందుకో మరి. బాలకృష్ణ ఫ్యాక్షన్ సినిమా అనగానే చాలా కామెడీ యాక్షన్ సీన్స్ ఇంతకు ముందు సినిమాల్లో చూశాం. తొడ కొడితే ట్రైన్ ఆగటం, వందమందిని ఏమీ కాకుండా ఒక్క చేత్తో కొట్టడం లాంటివి ఈ సినిమాలో కూడా ఉంటాయి. ఈ సినిమాలో ఒక ఎద్దుల బండిని అవలీలగా ఎత్తి విలన్స్ అందరినీ చెల్లా చెదురు చేసేస్తాడు మన ఫ్యాక్షన్ వీరుడు బాలకృష్ణ. అలాగే ప్రతి సన్నివేశంలోనూ రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. అదీ కాకుండా తలలు కూడా ఎగిరి పడుతూ ఉంటాయి. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ వెబ్ సిరీస్‌లో కూడా అంత హింస ఉండదేమో, కానీ ఇందులో మాత్రం అంతకన్నా ఎక్కువ వుంది. మరి ఈ సినిమాలో ఆ సన్నివేశాలని సెన్సార్ వాళ్ళు ఎలా వొదిలేసారో అర్థం కాలేదు. అదీ కాకుండా ఆ సన్నివేశాలు కొంచెం బ్లర్ కూడా చెయ్యలేదు. సెన్సార్ వాళ్ళు మాత్రం దీనికి ఆన్సర్ చెప్పాల్సి వుంది. దీనికి వాళ్ళు U/A సర్టిఫికెట్ ఇచ్చారు. ఇది పూర్తి విరుద్ధం. దీనికి ‘A’ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేదో మరి, దర్శక నిర్మాతలు మేనేజ్ చేశారా, లేక సెన్సార్ అధికారులు వదిలేశారా? ఆ పైవాడికే తెలియాలి. మొత్తానికి బాలకృష్ణ అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా గోపీచంద్ తీశాడని మాత్రం చెప్పొచ్చు. ఫ్యాన్స్ తప్పితే.. మిగతా వాళ్ళకి ఇది అంతగా రుచించక పోవచ్చు. (Veerasimha Reddy Telugu Movie)
ఇంకా నటీనటుల విషయానికి వస్తే, బాలకృష్ణ రెండు పాత్రల్లో ఒకేలా వున్నాడు. పెద్దయ్య పాత్రలో బాలకృష్ణ ఒదిగిపోయాడు, దానికితోడు అతనికి ఈ ఫ్యాక్షన్ పాత్రలు ఏమి కొత్తకావు. కొత్తగా కనిపించడు కూడా. ఇంకా యువకుడిలా వున్న బాలకృష్ణ కూడా కొంచెం వయసు అయిపోయిన వాడిలా కనిపిస్తాడు. డైలాగ్స్ అన్నీ మామూలే అతనికి కొట్టిన పిండి.. అందుకని అందులో కొత్తదనం ఏమి ఉండదు. వరలక్ష్మి శరత్ కుమార్ మరో వైవిధ్యం వున్న పాత్రలో కనపడుతుంది. ఆమెకి ఇదొక మంచి పాత్ర బాగా చేసింది కూడా. శృతి హాసన్‌కి ఏమి అంత ప్రాతిధ్యం వున్న రోల్ కాదు, ఏదో ఒక పాట, రెండు సీన్స్ అంతే. నిర్మాతలు ఆమెని రెండు సినిమాలకి కలిపి మాట్లాడినట్టున్నారు, ఎందుకంటే రేపు విడుదల అవుతున్న సినిమాలో కూడా ఆమె కథానాయిక. హానీ రోజ్‌కి కొంచెం పెద్ద పాత్ర వచ్చింది, ఆమె బాలకృష్ణకి తల్లిగా.. అలాగే ఫ్లాష్ బ్యాక్‌లో మరో బాలకృష్ణ మరదలుగా కొంచెం అందాలు ఒలకబోసే సన్నివేశాల్లో కూడా కనిపిస్తుంది. దునియా విజయ్ విలన్ తగ్గట్టుగా ఎప్పుడూ ఒక కత్తి పట్టుకొని అరుస్తూ కనపడుతూ ఉంటాడు. లాల్.. బాలకృష్ణ అనుచరుడిగా బావున్నాడు. ఇంకా చాలామంది వున్నారు, వాళ్ళందరూ కథానాయకుడిని, విలన్ ని పొగుడుతూ కనిపించే పాత్రలే. చంద్రిక రవి ఆస్ట్రేలియా నుండి వచ్చి ఐటెం సాంగ్ లో తన అందాలను చూపెడుతుంది. (Veera Simha Reddy)
సాయి మాధవ్ బుర్రా మాటలు పదునుగా రాశాడు, తూటాలుగా పేలాయి. అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. చాలా సన్నివేశాలు డ్రోన్ కెమెరాలు పెట్టి బాగా తీశాడు. ఇంకా యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది కానీ, మితిమీరి వుంది. అలాగే ఈ సినిమాకి సంగీత దర్శకుడు థమన్ చాలా హెల్ప్ అయ్యాడు. అతని బ్యాక్ గ్రౌండ్ సంగీతం, పాటలు మాస్‌కి బాగా అట్రాక్ట్ అయ్యేట్టు చేస్తాయి. థమన్ ఈ సినిమాకి ఒక ఆయువుపట్టు అని చెప్పొచ్చు.
చివరగా, బాలకృష్ణ నటించిన ‘వీరసింహా రెడ్డి’ ఒక మామూలు ఫ్యాక్షన్ సినిమా. బాలకృష్ణ నటించిన రెండు మూడు సినిమాలు మిక్స్ చేసి గోపీచంద్ ఈ కథని తయారు చేశాడు. కొత్తదనం ఏమీ ఉండదు, కనిపించదు. బోయపాటిని మించిపోయిన యాక్షన్ సన్నివేశాలు వున్నాయి. గమనిక ఏంటి అంటే పిల్లల్ని మాత్రం ఈ సినిమాకి తీసుకొని వెళ్లొద్దు.. ఎందుకంటే అంత హింసని తట్టుకోలేరు వాళ్ళు. ఈ సినిమా కేవలం హార్డ్ కోర్ బాలకృష్ణ అభిమానులకు మాత్రం నచ్చే అవకాశాలు వున్నాయి. నరకుడు, చంపుడు, కొట్టుడు... ఇదే సినిమా అంతా. దీన్ని బట్టి మీరే డిసైడ్ చేసుకోండి. (Veera Simha Reddy Review)