Viral Video: పాపం ఈ కుక్క.. తన యజమాని ఇక రాదని తెలియక రాత్రంతా ఆమె చెప్పుల దగ్గరే..

ABN , First Publish Date - 2023-07-18T17:29:26+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని యానాం-యెదురులంక మధ్యనున్న జీఎంసీ బాలయోగి వంతెనపై ఓ పెంపుడు శునకం యజమాని కోసం తల్లడిల్లిపోయింది. రాత్రంతా అక్కడే ఉండి యజమాని కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసింది. 8వ నంబర్ పిల్లర్ వద్ద నదిలోకి దూకిన యజమాని తిరిగి అక్కడికే వస్తుందని ఆమె చెప్పుల దగ్గరే అరుస్తూ ఉండిపోయింది.

Viral Video: పాపం ఈ కుక్క.. తన యజమాని ఇక రాదని తెలియక రాత్రంతా ఆమె చెప్పుల దగ్గరే..

శునకాల విశ్వాసం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక పెంపుడు శునకాలైతే తమ యజమానుల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాయి. అనుక్షణం తమ యజమానుల వెంటే ఉంటాయి. ఒక్క క్షణం తమ యజమాని కనిపించపోయినా సరే పెంపుడు శునకాలు తల్లడిల్లిపోతాయి. తాజాగా అచ్చం అలాంటి ఘటనే మన తెలుగు రాష్ట్రాల్లోనూ చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని యానాం-యెదురులంక మధ్యనున్న జీఎంసీ బాలయోగి వంతెనపై ఓ పెంపుడు శునకం యజమాని కోసం తల్లడిల్లిపోయింది. రాత్రంతా అక్కడే ఉండి యజమాని కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసింది. 8వ నంబర్ పిల్లర్ వద్ద నదిలోకి దూకిన యజమాని తిరిగి అక్కడికే వస్తుందని ఆమె చెప్పుల దగ్గరే అరుస్తూ ఉండిపోయింది. ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యానాం ఫెర్రీ రోడ్డులో మందంగి కాంచన అనే 22 ఏళ్ల యువతి నివాసం ఉంటుంది. ఆమె తల్లి హోటల్ నడుపుతోంది. ఆదివారం సాయంత్రం కాంచన తన పెంపుడు శునకాన్ని తీసుకుని యానాం-యెదురులంక మధ్యనున్న జీఎంసీ బాలయోగి వంతెనపైకి వాకింగ్‌కు వెళ్లింది. అక్కడ రోజు మాదిరిగానే వాకింగ్ చేసింది. అయితే ఇంతలోనే ఏమైందో ఏమో తెలియదు కానీ, తన పాదరక్షలను అక్కడే వదిలి నదిలోకి దూకేసింది. అక్కడ వాకింగ్‌కు వచ్చిన ఇతరులు సదరు అమ్మాయి నదిలోకి దూకడం గమనించారు. దీంతో అందరూ వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆ నదిలో పడవల సాయంతో చేపలు పడుతున్న మత్స్యకారులు యువతిని రక్షించే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోయింది. నీటి ప్రవాహంలో సదరు యువతి కొట్టుకుపోయింది.

విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానీ యువతి కానీ, ఆమె మృత దేహం కానీ ఇప్పటివరకు లభించలేదు. ఇక పెంపుడు శునకం మాత్రం నదిలోకి దూకిన తన యజమాని అక్కడికే తిరిగి వస్తుందనే ఆశతో అరుస్తూ అక్కడే ఉండిపోయింది. రాత్రంతా అక్కడే తిరుగుతూ యజమాని పాదరక్షల వద్ద పడుకుంది. సోమవారం కూడా అక్కడే ఉండిపోయింది. ఆ శునకం ఆవేదనను చూసిన స్థానికుల గుండెలు తరుక్కుపోయాయి. అయితే సోమవారం యువతి తల్లి అక్కడికి రావడంతో పెంపుడు శునకం ఆమె వెంట వెళ్లిపోయింది. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలుసుకోవడానికి విచారణ జరుపుతున్నామని యానాం పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-07-18T17:29:26+05:30 IST