ODI World Cup: ప్రపంచకప్‌లో డీఆర్ఎస్‌పై వివాదం.. అసంతృప్తి వ్యక్తం చేసిన ఆస్ట్రేలియా
ABN , First Publish Date - 2023-10-19T20:24:40+05:30 IST
ప్రస్తుత ప్రపంచకప్‌లో డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్) నిర్ణయాలపై ఆస్ట్రేలియా జట్టు అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. డీఆర్ఎస్‌తో తాము నష్టపోతున్నామని గగ్గోలు పెడుతోంది.
వన్డే ప్రపంచకప్‌కు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తుండటంతో సెమీస్ రేసు కూడా ఆసక్తికరంగా సాగుతోంది. అయితే ఆస్ట్రేలియా జట్టు మాత్రం అంచనాల మేరకు రాణించడం లేదు. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. శుక్రవారం పాకిస్థాన్‌తో ఆస్ట్రేలియా కీలక మ్యాచ్ ఆడనుంది. అయితే ప్రస్తుత ప్రపంచకప్‌లో డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్) నిర్ణయాలపై ఆస్ట్రేలియా జట్టు అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. డీఆర్ఎస్‌తో తాము నష్టపోతున్నామని గగ్గోలు పెడుతోంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా- దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్, స్టాయినీస్ వికెట్ల విషయంలో డీఆర్‌ఎస్ నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. అటు శ్రీలంకతో మ్యాచ్‌లో కూడా డీఆర్ఎస్ నిర్ణయంపై డేవిడ్ వార్నర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
ఇది కూడా చదవండి: Team India: ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంపై బీసీసీఐ అప్‌డేట్..!!
దక్షిణాఫ్రికాతో ఆడిన మ్యాచ్‌లో స్మిత్ వికెట్ విషయంలో మాత్రం డీఆర్ఎస్‌పై ఆస్ట్రేలియా జట్టు నిరాశ వ్యక్తం చేసింది. రబాడ వేసిన ఇన్నింగ్స్ పదో ఓవర్ ఐదో బంతి పిచ్ మధ్యలో పడి కుడి వైపుగా వెళ్లింది. బంతిని ఆడేందుకు స్మిత్ ప్రయత్నించగా.. అది కుడి ప్యాడ్‌కు తాకింది. అప్పీల్ చేయగా మైదానంలోని అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో సఫారీ జట్టు సమీక్ష కోరింది. మరో ఎండ్‌లో ఉన్న లబుషేన్ బంతి లెగ్‌సైడ్ వెళ్తుందనేలా సైగ చేశాడు. కానీ మూడో అంపైర్ బంతి లెగ్‌స్టంప్‌ను తాకుతుందని ఔట్‌గా ప్రకటించాడు. దీంతో షాక్‌కు గురైన స్మిత్ అసంతృప్తితో మైదానం వీడాడు. మరోవైపు ఇదే మ్యాచ్‌లో రబాడ వేసిన 18వ ఓవర్ తొలి బంతిని స్టాయినీస్ ఆడే ప్రయత్నం చేశాడు. లెగ్‌సైడ్ వెళ్లిన ఆ బాల్‌ను వికెట్ కీపర్ డికాక్ డైవ్ చేస్తూ పట్టుకున్నాడు. క్యాచ్ అవుట్‌గా దక్షిణాఫ్రికా అప్పీల్ చేస్తే అంపైర్ ఇవ్వలేదు. దీంతో సఫారీ సేన మరోసారి డీఆర్‌ఎస్‌ను ఆశ్రయించింది. రీప్లేలో బంతి స్టాయినీస్ గ్లవ్స్‌కు తాకినట్లు తేలింది. కానీ ఆ సమయంలో ఆ చేతితో అతను బ్యాట్ పట్టుకోలేదు. దీంతో నాటౌట్‌గానే ప్రకటిస్తారని అందరూ భావించారు. కానీ బంతి ఎడమ చేతి గ్లవ్స్‌ను తాకిన సమయంలో.. ఆ చేయి కుడి చేతిని తాకి ఉందనే కారణంతో టీవీ అంపైర్ ఔట్‌గా నిర్ణయించాడు. ఇది కూడా వివాదాస్పదంగా మారింది. డీఆర్ఎస్ నిర్ణయాల వల్లే తాము ఈ మ్యాచ్‌లో ఓటమి చెందామని ఆస్ట్రేలియా భావిస్తోంది. మరోవైపు శ్రీలంక మ్యాచ్‌లోనూ బౌలర్ మధుశంక వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ తొలి బంతి వార్నర్ ప్యాడ్లను తాకింది. దీంతో అంపైర్ వెంటనే ఔట్‌గా ప్రకటించాడు. కానీ లెగ్‌సైడ్ వెళ్తుందని భావించి వార్నర్ డీఆర్‌ఎస్ కోరాడు. ఇందులో బాల్ కొద్దిగా స్టంప్స్‌కు తాకుతుంది కాబటి నిర్ణయం అంపైర్ కాల్‌గా ప్రకటించడంతో వార్నర్ అసంతృప్తిగా పెవిలియన్ చేరాడు.