Share News

IND vs NZ: ఆ ఇద్దరితో హార్దిక్ పాండ్యా స్థానం భర్తీ.. కివీస్‌తో మ్యాచ్‌కు టీమిండియా తుది జట్టు ఇదే!

ABN , First Publish Date - 2023-10-21T12:29:29+05:30 IST

వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న భారత జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో కివీస్‌తో టీమిండియా తలపడనుంది. టేబుల్ టాపర్లుగా ఉన్న రెండు జట్ల మధ్య పోటీ కావడంతో మ్యాచ్‌పై అత్యంత ఆసక్తి నెలకొంది.

IND vs NZ: ఆ ఇద్దరితో హార్దిక్ పాండ్యా స్థానం భర్తీ.. కివీస్‌తో మ్యాచ్‌కు టీమిండియా తుది జట్టు ఇదే!

ధర్మశాల: వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న భారత జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో కివీస్‌తో టీమిండియా తలపడనుంది. టేబుల్ టాపర్లుగా ఉన్న రెండు జట్ల మధ్య పోటీ కావడంతో మ్యాచ్‌పై అత్యంత ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు ఈ టోర్నీలో భారత్, న్యూజిలాండ్ ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. దీంతో రెండు జట్లు ఎనిమిదేసి పాయింట్ల చొప్పున సాధించి టేబుల్ టాపర్లుగా ఉన్నాయి. అయితే మెరుగైన రన్ రేటు కారణంగా కివీస్ మొదటి స్థానంలో ఉండగా.. భారత్ రెండో స్థానంలో ఉంది. ఆదివారం ధర్మశాల వేదికగా భారత్, కివీస్ మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టే పాయింట్స్ టేబుల్‌లో మొదటి స్థానానికి చేరుకోనుంది. దీంతో రెండు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. కొంతకాలంగా ప్రపంచకప్ టోర్నీల్లో న్యూజిలాండ్ చేతిలో వరుసగా ఓడిపోతున్న భారత జట్టు ఈ సారి బదులు తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. పైగా గత ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లోనూ న్యూజిలాండ్ చేతిలోనే టీమిండియా ఓడిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో గాయపడిన హార్దిక్ పాండ్యా న్యూజిలాండ్‌తో పోరుకు అందుబాటులో ఉండడం లేదని ఇప్పటికే బీసీసీఐ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. పేసర్లకు సహకరించే ధర్మశాల పిచ్‌పై పేస్ ఆల్ రౌండరైన హార్దిక్ పాండ్యా దూరమవడం భారత్‌కు మైనసే అని విశ్లేషకులు చెబుతున్నారు.


హార్దిక్ పాండ్యా దూరమవడంతో తుది జట్టు ఎంపిక కూడా మేనేజ్‌మెంట్‌కు పెద్ద సమస్యగా మారింది. జట్టులో మరో పేస్ ఆల్ రౌండర్ లేకపోవడంతో ప్రస్తుతం హార్దిక్ స్థానానికి సరైన ప్రత్యామ్నాయం లేకుండాపోయింది. శార్దూల్ ఠాకూర్ ఉన్న అతను హార్దిక్ స్థాయి ఆల్ రౌండర్ కాదు. దీంతో జట్టు సమతూకం దెబ్బతింటోంది. అందుకే హార్దిక్ స్థానంలో ఎవరిని ఆడించాలనేది కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు పెద్ద సవాల్‌గా మారింది. దీంతో హార్దిక్ పాండ్యా స్థానాన్ని ఇద్దరు ఆటగాళ్లతో భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. ఒక బ్యాటర్, ఒక బౌలర్‌ను తుది జట్టులో ఆడించే అవకాశాలున్నాయి. హార్దిక్ లేకపోవడంతో శార్దూల్ ఠాకూర్ 10 ఓవర్ల పూర్తి కోటా బౌలింగ్ వేయాల్సి ఉంటుంది. కానీ ఈ టోర్నీలో అతను ఇప్పటివరకు పూర్తి కోటా బౌలింగ్ చేయలేదు. పైగా మ్యాచ్ జరగబోయే ధర్మశాల పిచ్ పేసర్లకు అనుకూలించనుంది. దీంతో ఈ మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్‌ను పక్కన పెట్టి ప్రధాన పేసర్ మహ్మద్ షమీని తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పైగా షమీ 10 ఓవర్ల పూర్తి కోటా బౌలింగ్‌ను వేయగలడు. అలాగే మంచి ఫామ్‌లో కూడా ఉన్నాడు. ఇప్పటికే షమీని తుది జట్టులోకి తీసుకోకపోవడంపై విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక గాయపడిన హార్దిక్ పాండ్యా స్థానంలో మిస్టర్ 360 డిగ్రీస్ సూర్యకుమార్ యాదవ్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి. అప్పుడు హార్దిక్ స్థానం భర్తీ అవుతుంది. సూర్య బ్యాటింగ్, షమీ బౌలింగ్ చేయనున్నారు. కాకపోతే గత మ్యాచ్‌ల్లో మాదిరిగా ఈ సారి రోహిత్‌కు ఆరుగురు బౌలర్లను ఉపయోగించుకునే అవకాశం ఉండదు. ఐదుగురు బౌలర్లతో పూర్తి కోటా వేయించాల్సి ఉంటుంది. అయితే అవసరమైతే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఒకటి రెండు ఓవర్లు వేయడానికి సిద్ధంగా ఉండడంతో ఇది పెద్ద సమస్య కాదని విశ్లేషకులు చెబుతున్నారు. దీనిని బట్టి ఈ మ్యాచ్‌లో భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశాలున్నాయి. మిగతా జట్టు యథావిధిగా కొనసాగనుంది.

ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగనున్నారు. వన్ డౌన్‌లో విరాట్ కోహ్లీ.. మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేయనున్నారు. ప్రధాన స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ కొనసాగున్నాడు. పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ ఆడే అవకాశాలున్నాయి.

తుది జట్టు (అంచనా)

రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

Updated Date - 2023-10-21T12:29:29+05:30 IST