IPL 2023: ముంబై ఖాతాలో మరో విజయం.. వెంకటేశ్ సెంచరీ వృథా!
ABN , First Publish Date - 2023-04-16T19:45:41+05:30 IST
హోం గ్రౌండ్లో ముంబై ఇండియన్స్(MI) చెలరేగింది. కోల్‌కతా(KKR)పై 5 వికెట్ల తేడాతో విజయం
ముంబై: హోం గ్రౌండ్లో ముంబై ఇండియన్స్(MI) చెలరేగింది. కోల్‌కతా(KKR)పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి తన ఖాతాలో మరో గెలుపు వేసుకుంది. నాలుగు మ్యాచ్‌లు ఆడి రెండో విజయాన్ని నమోదు చేసిన ముంబై పాయింట్ల పట్టికలో ఓ స్థానాన్ని మెరుగు పరుచుకుని మూడో స్థానానికి ఎగబాకింది.
కోల్‌కతా నిర్దేశించిన 186 పరుగుల విజయ లక్ష్యాన్ని ముంబై 5 వికెట్లు కోల్పోయి 14 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. కడుపు నొప్పితో బాధపడిన రోహిత్ శర్మ ఫీల్డింగ్‌కు దూరం కాగా, బ్యాటింగ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు. రెండు సిక్సర్లు బాది మురిపించినప్పటికీ షరా మామూలుగానే క్రీజులో ఎక్కువ సేపు కుదురుకోలేపోయాడు. 20 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.
ఇషాన్ కిషన్ మాత్రం బ్యాట్‌తో చెలరేగాడు. 25 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 58 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఇక, చాలా రోజులుగా విఫలమవుతూ వస్తున్న సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చి జట్టును విజయం దిశగా నడిపాడు.. ఈ మ్యాచ్‌కు స్టాండిన్ కెప్టెన్‌గా వ్యవహరించిన సూర్య 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. 30 పరుగులు చేసిన తిలక్ వర్మ, నేహాల్ వధేరా (6) అవుటయ్యాక, కామెరాన్ గ్రీన్‌తో కలిసి టిమ్ డేవిడ్ (24) జట్టును విజయ తీరాలకు చేర్చాడు. కోల్‌కతా బౌలర్లలో సుయాశ్ శర్మ రెండు వికెట్లు తీసుకున్నాడు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 51 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో సెంచరీ (104) చేశాడు. ఈ సీజన్లో ఇది రెండో సెంచరీ. అయితే, జట్టులో మిగతా ఎవరూ బ్యాట్ ఝళిపించలేకపోయారు. దీంతో జట్టు స్కోరు 185 పరుగులకు పరిమితమైంది.