Share News

Incomplete Bridges: ఆ 43 బ్రిడ్జిలకు మోక్షం!

ABN , Publish Date - Mar 30 , 2025 | 01:30 AM

గత ప్రభుత్వం పలు నియోజకవర్గాల్లో గడిచిన పదేళ్లలో 43 బ్రిడ్జిల నిర్మాణాలు మొదలు పెట్టినా.. వాటిని పూర్తి చేయకపోవడంతో నిరుపయోగంగా మారాయి. వాటికి అప్రోచ్‌ రోడ్లు సహా మరికొన్ని ఇతర పనులనూ చేయకపోవడంతో అవీ వినియోగానికి అనువుగా లేవు.

Incomplete Bridges: ఆ 43 బ్రిడ్జిలకు మోక్షం!

  • గడిచిన పదేళ్లుగా అసంపూర్తిగానే

  • పూర్తి చేయాలని ఆర్‌ అండ్‌ బీ నిర్ణయం

  • 138 కోట్లు ఖర్చవుతుందని అంచనా

హైదరాబాద్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వం పలు నియోజకవర్గాల్లో గడిచిన పదేళ్లలో 43 బ్రిడ్జిల నిర్మాణాలు మొదలు పెట్టినా.. వాటిని పూర్తి చేయకపోవడంతో నిరుపయోగంగా మారాయి. వాటికి అప్రోచ్‌ రోడ్లు సహా మరికొన్ని ఇతర పనులనూ చేయకపోవడంతో అవీ వినియోగానికి అనువుగా లేవు. ఇలా అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిలన్నింటినీ పూర్తి చేయడంతో పాటు, అప్రోచ్‌ రోడ్లను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని తాజాగా రోడ్లు, భవనాల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఇదే అంశంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో 43 బ్రిడ్జిల నిర్మాణాల కోసం రూ.197.94 కోట్లను పలు దఫాలుగా కేటాయించారు. ఆ నిధులనూ పూర్తి స్థాయిలో మంజూరు చేయలేదని తెలిసింది. అయితే ఏళ్ల తరబడి అసంపూర్తిగా ఉండడంతో నిర్మించిన బ్రిడ్జిలను పూర్తి చేయడంతో పాటు కొంతమేర మరమ్మతులు చేయాల్సి ఉందని శాఖ అధికారుల పరిశీలనలో తేలింది.


అదే సమయంలో బ్రిడ్జిలపై రాకపోకలు సాగించేందుకు అనువుగా వేయాల్సిన అప్రోచ్‌ రోడ్ల కోసం కొన్ని చోట్ల భూ సేకరణ చేపట్టాల్సి ఉందని గుర్తించారు. మరమ్మతులు, అప్రోచ్‌రోడ్ల నిర్మాణాలకు అవసరమయ్యే భూముల సేకరణకు చెల్లించే పరిహారం నిధులు కలిపి మరో రూ.138కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. ప్రభుత్వం కూడా దీనిపై సానుకూలంగా స్పందించడంతో, బ్రిడ్జిల పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్టు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. ఈ పనులన్నింటినీ త్వరితగతిన పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఏయే ప్రాంతంలోని బ్రిడ్జిల దగ్గర ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలి, అప్రోచ్‌ రోడ్ల కోసం ఎంత మేర భూములను సేకరించాలనే వివరాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.


అప్రోచ్‌రోడ్డు వేయాల్సిన 43 బ్రిడ్జిల్లో కొన్ని

  • ఖమ్మం జిల్లాలోని మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల పరిధిలో ఇల్లూరు- ఖమ్మంపాడు, దెందుకూరు-చిలుకూరు మధ్యలో నిర్మించదల్చిన బ్రిడ్జి పనుల పూర్తికి రూ.21కోట్లు అవసరమని అంచనా వేశారు.

  • మెదక్‌, ఎల్లారెడ్డి నియోజకవర్గాల పరిధిలోని మంజీరా నదిపై ధర్మారెడ్డి-ముద్దపూర్‌ హై లెవల్‌ బ్రిడ్జి పనులకు రూ.33.5 కోట్లు కావాల్సి ఉంటుందని అంచనా.

  • చేవెళ్ల పరిధిలో వెలమాలతండా టూ తంగేడ్‌పల్లి క్రాస్‌రోడ్స్‌ వరకు హై లెవల్‌ బ్రిడ్జి పనులు ఆగిపోయాయి. పనుల నిర్వహణకు రూ.36కోట్లు కావాలని, భూసేకరణకు రూ.33కోట్లు కావాలని అంచనా.

  • దేవరకొండ నియోజకవర్గం పరిఽధిలో బొల్లారం- అక్కారం గ్రామాలను కలిపేందుకు ఒక హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణం కూడా ఆగిపోయింది. ఇందుకు అదనంగా మరో రూ.2.6కోట్లు అవసరమని అంచనా.


ఈ వార్తలు కూడా చదవండి

Hyderabad Metro : అదిరిపోయే శుభవార్త చెప్పిన HYD మెట్రో.. రైళ్ల ప్రయాణ వేళలు పొడిగింపు..

GPO Posts: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

Sunny Yadav Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. ఒక్కొక్కరికీ చుక్కలు చూపిస్తున్న పోలీసులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 30 , 2025 | 01:30 AM