IPL 2023: చెన్నైని చితక్కొట్టేసిన రాజస్థాన్ బ్యాటర్లు.. ధోనీ సేన లక్ష్యం ఎంతంటే?
ABN , First Publish Date - 2023-04-27T21:33:24+05:30 IST
తొలుత ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal), ఆ తర్వాత ధ్రువ్ జురెల్(Dhruv Jurel), దేవదత్
జైపూర్: తొలుత ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal), ఆ తర్వాత ధ్రువ్ జురెల్(Dhruv Jurel), దేవదత్ పడిక్కల్(Devdutt Padikkal) చెన్నై బౌలర్లను ఉతికి ఆరేయడంతో రాజస్థాన్ రాయల్స్ (RR) భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ నమ్మకాన్ని ఓపెనర్లు వమ్ము చేయలేదు. జైస్వాల్, జోస్ బట్లర్ కలిసి తొలి వికెట్‌కు 86 పరుగులు జోడించి మంచి ఆరంభాన్ని ఇచ్చారు. క్రీజులో బట్లర్ తడబడినప్పటికీ జైస్వాల్ మాత్రం చెలరేగిపోయాడు. బౌలర్ ఎవరైనా సరే ఉతకడమే పనిగా పెట్టుకున్నాడు. అతడు క్రీజులో ఉన్నంత సేపు స్కోరు బోర్డు అలుపెరగకుండా పరుగులు తీసింది.
27 పరుగులు మాత్రమే చేసిన బట్లర్ తొలి వికెట్‌గా వెనుదిరిగిన తర్వాత వచ్చిన సంజు శాంసన్ (17) కూడా అవుట్ కావడంతో పరుగుల వేగం కొంత మందగించింది. మరోవైపు, సెంచరీ దిశగా పరుగులు తీస్తున్న జైస్వాల్ కూడా అవుట్ కావడంతో చెన్నై బౌలర్లు పట్టుబిగించినట్టు కనిపించారు. 43 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు.
రఫ్పాడిస్తాడనుకున్న షిమ్రన్ హెట్మెయిర్ (8) మరోమారు నిరాశపరిచాడు. అయితే, ధ్రువ్ జురెల్, పడిక్కల్ జంట చెన్నై బౌలర్లను మళ్లీ ఆడేసుకుంది. పరుగులు పిండుకుంటూ స్కోరు బోర్డును మళ్లీ ఉరకలెత్తించింది. వారిద్దరినీ ఆపడం బౌలర్ల తరం కాలేదు. అయితే, లేని పరుగు కోసం యత్నించిన జురెల్ చివరికి రనౌట్‌గా వెనుదిరిగాడు.
15 బంతులు ఆడిన జురెల్ 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 పరుగులు చేయగా, పడిక్కల్ 13 బంతుల్లో 4 ఫోర్లతో 23 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చెన్నై బౌలర్లలో ఆకాశ్ సింగ్ రెండు ఓవర్లలో 32 పరుగులు సమర్పించుకోగా, మతీశా పతిరణ 4 ఓవర్లు వేసి 48 పరుగులు ఇచ్చుకున్నాడు. తుషార్ దేశ్‌పాండేకు రెండు వికెట్లు దక్కాయి.