Rashid Khan: రషీద్ ఖాన్ మంచి మనసు.. ఏం చేశాడో తెలిస్తే మెచ్చుకుంటారు
ABN , First Publish Date - 2023-10-09T21:57:00+05:30 IST
ప్రస్తుతం వన్డే ప్రపంచకప్‌లో ఆడుతున్న స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ మంచి మనసు చాటుకున్నాడు. తన ప్రపంచకప్ ఫీజు మొత్తాన్ని భూకంప బాధితులకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన బౌలింగ్‌తో ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించాడు. అయితే ప్రస్తుతం వన్డే ప్రపంచకప్‌లో ఆడుతున్న అతడు మంచి ప్రదర్శన చేస్తున్నాడు. బ్యాటర్లకు కొరకరాని కొయ్యగా మారిన రషీద్ తాజాగా తన ఔదార్యంతో కోట్లాది మంది మనసులు గెలుచుకున్నాడు. తన ప్రపంచకప్ ఫీజు మొత్తాన్ని భూకంప బాధితులకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అక్టోబరు 7న ఆఫ్ఘనిస్తాన్‌లోని పశ్చిమ ప్రావిన్సుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.3గా నమోదైంది. ఈ భూకంపం ధాటికి సుమారు 2వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 10వేల మంది గాయపడినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Viral Video: పెద్దోడిగా విరాట్ కోహ్లీ.. చిన్నోడిగా కేఎల్ రాహుల్.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వీడియో అదిరిపోయింది
ఈ క్రమంలో భూకంప బాధితులకు ప్రపంచకప్ ఫీజు మొత్తాన్ని విరాళంగా అందజేస్తానని రషీద్ ఖాన్ ఎక్స్ ఖాతా (ట్విట్టర్) ద్వారా తెలియజేశాడు. ఆఫ్ఘనిస్తాన్‌లోని పశ్చిమ ప్రావిన్సులలో (హెరాత్, ఫరా, బాద్గీస్) భూకంపం వచ్చిందని తెలిసిచాలా బాధ పడ్డానని రషీద్ ఖాన్ తెలిపాడు. తాను ప్రపంచ కప్ 2023 కోసం మొత్తం ఫీజును కష్టాల్లో ఉన్న ప్రజలకు సహాయం చేస్తున్నట్లు పేర్కొన్నాడు. రోడ్డున పడ్డ భూకంప బాధితులను ఆదుకునేందుకు కావాల్సిన డబ్బును సేకరించేందుకు త్వరలో ప్రచారాన్ని ప్రారంభిస్తానని రషీద్ ఖాన్ తెలియజేశాడు. దీంతో సోషల్ మీడియాలో రషీద్ ఖాన్‌ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.