Share News

World Cup: పాకిస్థాన్ పరువు తీసిన స్టార్ క్రికెటర్.. 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు

ABN , First Publish Date - 2023-11-12T07:31:04+05:30 IST

Haris Rauf: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ స్టార్ పేసర్ హరీస్ రౌఫ్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఒక ఎడిషన్‌లో అత్యధిక పరుగులు, అత్యధిక సిక్సులు సమర్పించుకున్న బౌలర్‌గా నిలిచాడు. ఈ వరల్డ్‌కప్‌లో దారుణంగా విఫలమైన హరీస్ రౌఫ్ ఏకంగా 500కుపైగా పరుగులు సమర్పించుకున్నాడు.

World Cup: పాకిస్థాన్ పరువు తీసిన స్టార్ క్రికెటర్.. 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ స్టార్ పేసర్ హరీస్ రౌఫ్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఒక ఎడిషన్‌లో అత్యధిక పరుగులు, అత్యధిక సిక్సులు సమర్పించుకున్న బౌలర్‌గా నిలిచాడు. ఈ వరల్డ్‌కప్‌లో దారుణంగా విఫలమైన హరీస్ రౌఫ్ ఏకంగా 500కుపైగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ప్రపంచకప్‌లో లీగ్ దశ పోటీల్లో ఆడిన 9 మ్యాచ్‌లో హరీస్ రౌఫ్ 16 వికెట్లు తీశాడు. కానీ అదే సమయంలో పరుగులను మాత్రం ధారాళంగా సమర్పించుకున్నాడు. 9 మ్యాచ్‌ల్లో ఏకంగా 533 పరుగులు ఇచ్చాడు. దీంతో వన్డే ప్రపంచకప్‌లో ఒక ఎడిషన్‌లో 500కు పైగా పరుగులు సమర్పించుకున్న నాలుగో బౌలర్‌గా నిలిచాడు. ఈ చెత్త రికార్డు ఇంతకుముందు ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ పేరు మీద ఉండేది. ఆదిల్ రషీద్ 2019 వన్డే ప్రపంచకప్‌లో 526 పరుగులిచ్చాడు. తాజా ఎడిషన్‌లో 533 పరుగులిచ్చిన హరీస్ రౌఫ్ ఆ చెత్త రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు. శనివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హరీస్ రౌఫ్ 3 వికెట్లు తీసినప్పటికీ ఏకంగా 64 పరుగులు సమర్పించుకున్నాడు. అంతకుముందు నెదర్లాండ్స్‌పై 43 పరుగులు, శ్రీలంకపై 64 పరుగులు, భారత్‌పై 43 పరుగులు, ఆస్ట్రేలియాపై 83 పరుగులు, అఫ్ఘానిస్థాన్‌పై 53, సౌతాఫ్రికాపై 62, బంగ్లాదేశ్‌పై 36, న్యూజిలాండ్‌పై 85 పరుగులు ఇచ్చాడు. దీంతో ఈ ప్రపంచకప్‌లో క్వింటన్‌ డికాక్‌ (591), రచిన్‌ రవీంద్ర (565), విరాట్‌ కోహ్లీ (543) 500కు పైగా పరుగులు చేయగా హరీస్ రౌఫ్ మాత్రం 500కుపైగా పరుగులిచ్చాడు. ఈ ఎడిషన్‌లో పాకిస్థాన్ తరఫున 500కు పరుగులు చేసిన బ్యాటర్ ఎవరూ లేరు. దీంతో హరీస్ రౌఫ్ ఆ లోటును భర్తీ చేశాడని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

అలాగే ఒక ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సులు ఇచ్చిన బౌలర్‌గానూ హరీస్ రౌఫ్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌ల్లో హరీస్ రౌఫ్ ఏకంగా 16 సిక్సులను సమర్పించుకున్నాడు. దీంతో 2015 వన్డే ప్రపంచకప్‌లో 15 సిక్సులిచ్చిన జింబాబ్వే బౌలర్ తినాషే పణ్యంగారా చెత్త రికార్డును హరీస్ రౌఫ్ అధిగమించాడు. ఈ ప్రపంచకప్‌లో హరీస్ రౌఫ్ నెదర్లాండ్స్‌పై ఒక సిక్సు, శ్రీలంకపై 2 సిక్సులు, టీమిండియాపై 3 సిక్సులు, ఆస్ట్రేలియాపై 5 సిక్సులు, సౌతాఫ్రికాపై 3 సిక్సులు, న్యూజిలాండ్‌పై 2 సిక్సులు సమర్పించుకున్నాడు. దీంతో ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు, అత్యధిక సిక్సులు ఇచ్చిన చెత్త బౌలర్‌గా నిలిచాడు. మొత్తంగా వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక పరుగులు, అత్యధిక సిక్సులిచ్చిన చెత్త రికార్డులు హరీస్ రౌఫ్ పేరు మీదనే ఉన్నాడు.. కాగా తన వన్డే కెరీర్‌లోనూ హరీస్ రౌఫ్ అత్యధిక పరుగులు సమర్పించుకున్నాడు. వికెట్లు తీసినప్పటికీ పరుగులను మాత్రం ధారాళంగా ఇచ్చాడు. ఇప్పటివరకు ఆడిన 37 వన్డేల్లో 69 వికెట్లు తీసినప్పటికీ.. దాదాపు 6 ఎకానమీతో పరుగులిచ్చాడు. మొత్తంగా ఇప్పటివరకు 1835 బంతులు వేసి 1822 పరుగులు సమర్పించుకున్నాడు. అసలే ఈ ప్రపంచకప్‌లో సెమీస్ చేరలేదనే బాధలో ఉన్న పాకిస్థాన్‌ను హరీస్ రౌఫ్ చెత్త రికార్డులు మరింత బాధిస్తున్నాయి. దీంతో పలువురు అభిమానులైతే హరీస్ రౌఫ్ పాకిస్థాన్ పరువు తీశాడని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రపంచకప్‌లో పాక్ సెమీస్ చేరకపోవడానికి హరీస్ రౌఫ్ దారుణ వైఫల్యం ప్రధాన కారణంగా చెబుతున్నారు.


ఇక సెమీస్‌ చేరాలంటే తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో తప్పని సరిగా నెగ్గడంతోపాటు అసాధారణ రీతిలో నెట్‌ రన్‌రేట్‌ను మెరుగుపరచుకోవాల్సిన పాకిస్థాన్‌ తుస్సుమంది. శనివారం ఇంగ్లండ్‌తో జరిగిన పోరులోచేతులెత్తేసిన పాక్‌ 93 పరుగుల తేడాతో చిత్తయింది. ఫలితంగా ఓటమితో వరల్డ్‌కప్‌ నుంచి నిష్క్రమించింది. ఇంగ్లిష్‌ బ్యాటర్లు బెన్‌ స్టోక్స్‌ (84), జో రూట్‌ (60), బెయిర్‌స్టో (59) అర్ధ శతకాలతో చెలరేగడంతో.. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకొన్న ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 337 పరుగుల భారీ స్కోరు చేసింది. హరీస్‌ రౌఫ్‌ 3 వికెట్లు.. అఫ్రీది, మహ్మద్‌ వసీం చెరో 2 వికెట్లు దక్కించుకొన్నారు. ఓపెనర్లు మలన్‌ (31), బెయిర్‌స్టో తొలి వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యంతో ఇంగ్లండ్‌కు గట్టిపునాది వేశారు. ఆ తర్వాత రూట్‌, స్టోక్స్‌ మూడో వికెట్‌కు 132 పరుగులు జోడించి జట్టుకు భారీస్కోరు అందించారు. ఇక, నాకౌట్‌ చేరాలంటే 338 పరుగుల లక్ష్యాన్ని బాబర్‌ సేన 6.4 ఓవర్లలోనే చేరుకోవాలి. కానీ, పాక్‌ 43.3 ఓవర్లలో 244 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్లు అబ్దుల్లా షఫిక్‌ (0), ఫఖర్‌ జమాన్‌ (1)ను అవుట్‌ చేసిన డేవిడ్‌ విల్లే ఆరంభంలోనే దెబ్బకొట్టడంతో.. పాక్‌ 6.4 ఓవర్లలో 30/2 స్కోరు మాత్రమే చేసింది. కెప్టెన్‌ బాబర్‌ (38)ను అట్కిన్సన్‌ క్యాచవుట్‌ చేయగా.. రిజ్వాన్‌ (36)ను మొయిన్‌ అలీ బౌల్డ్‌ చేశాడు. అర్ధ శతకం సాధించిన అఘా సల్మాన్‌ (51) ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ విల్లే 3 వికెట్లు కూల్చగా.. అట్కిన్సన్‌, అలీ, రషీద్‌ చెరో 2 వికెట్లు తీశారు. టోర్నీలో పేలవ ప్రదర్శన చేసిన డిఫెండింగ్‌ చాంప్‌ ఇంగ్లండ్‌.. విజయంతో వీడ్కోలు పలికింది.

Updated Date - 2023-11-12T07:37:20+05:30 IST