IND vs NZ: రచిన్ రవీంద్ర పేరును సచిన్, ద్రావిడ్ పేర్ల మీదుగా పెట్టారా..? వాళ్ల నాన్న ఏం చెబుతున్నారంటే..?
ABN , First Publish Date - 2023-11-14T13:10:00+05:30 IST
Rachin Ravindra: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర అదరగొడుతున్నాడు. ఈ టోర్నీలో ఆడిన 9 మ్యాచ్‌లో ఏకంగా 70 సగటుతో 565 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటివరకు అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో టాప్ 3లో ఉన్నాడు. నిజానికి ఒక సంవత్సరం ముందు వరకు రచిన్ రవీంద్ర కివీస్ జట్టులోనే లేడు.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర అదరగొడుతున్నాడు. ఈ టోర్నీలో ఆడిన 9 మ్యాచ్‌లో ఏకంగా 70 సగటుతో 565 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటివరకు అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో టాప్ 3లో ఉన్నాడు. నిజానికి ఒక సంవత్సరం ముందు వరకు రచిన్ రవీంద్ర కివీస్ జట్టులోనే లేడు. ఈ ఏడాది మార్చిలోనే అతను వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుని ప్రపంచకప్ జట్టులో స్థానం సంపాదించాడు. స్థానం దక్కించుకోవడమే కాకుండా అంచనాలకు మించి రాణిస్తున్న ఈ 23 ఏళ్ల కుర్రాడు అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. సెమీస్‌లోనూ కివీస్‌ను టీమిండియా ఓడించాలంటే రచిన్ రవీంద్రను కచ్చితంగా త్వరగా ఔట్ చేయాల్సిందే. కాగా ఈ ప్రపంచకప్‌లో అందరి మన్ననలు పొందుతున్న రచిన్ రవీంద్ర భారత సంతతికి చెందిన కుర్రాడనే సంగతి తెలిసిందే. రచిన్ రవీంద్ర సొంత రాష్ట్రం కర్ణాటక. అతని తాతలు ప్రస్తుతం బెంగళూరులోనే ఉంటున్నారు. దీంతో నిత్యం రచిన్ నిత్యం బెంగళూరుకు వచ్చి వెళ్తుంటాడు. రచిన్ తండ్రి రవి కృష్ణమూర్తి ఉపాధి కోసం 1990ల్లో న్యూజిలాండ్ వెళ్లారు. అక్కడే రచిన్ రవీంద్ర జన్మించాడు.
అయితే రచిన్ రవీంద్ర పేరును అతని తండ్రి కృష్ణమూర్తి భారత దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ పేర్ల మీదుగా పెట్టాడని ఇటీవల పలు కథనాలు వెలువడ్డాయి. కృష్ణమూర్తికి సాధారణంగానే క్రికెట్ అంటే విపరీతమైన అభిమానం ఉంది. ఇక సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్‌పై ఆయనకు అభిమానం ఉంది. ఈ క్రమంలో వాళ్ల పేర్లు కలిసొచ్చేలా రాహుల్ ద్రావిడ్‌లోని ‘రా’, సచిన్ టెండూల్కర్‌లో ‘సచి’ ని తీసుకుని రచిన్ అనే పేరు పెట్టారనేది ఆ వార్తా కథానాల సారాంశం. తాజాగా ఈ కథనాలపై ఆయన స్పందించారు. సచిన్, ద్రావిడ్ పేర్ల మీదుగా తన కొడుకుకు రచిన్ అనే పేరు పెట్టాననే వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశాడు. ఉద్దేశపూర్వకంగా ఈ పేరు పెట్టలేదని పేర్కొన్నాడు. ‘‘రచిన్ పుట్టినప్పుడు నా భార్య ఒక పేరును సూచించింది. మేము ఆ పేరు గురించి చర్చించడానికి ఎక్కువగా సమయం కూడా తీసుకోలేదు. ఎందుకంటే పేరు బాగుంది. ఉచ్చరించడం సులభం. అలాగే చిన్నది. దీంతో ఆ పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాం. కొన్ని సంవత్సరాల తర్వాత రచిన్ అనే పేరు సచిన్, ద్రావిడ్ పేర్లు కలయిక అని తెలిసింది. అంతేకానీ నా కొడుకును క్రికెటర్‌ను చేయాలని ఉద్దేశపూర్వకంగా అయితే పేరు పెట్టలేదు.’’ అని రవి కృష్ణమూర్తి స్పష్టం చేశారు.