IPL2023 GTvsCSK: చెన్నై వర్సెస్ గుజరాత్.. అదిరిపోయే ఆరంభం ఎవరిది?.. ఈ లెక్కలను బట్టి చూస్తే...
ABN , First Publish Date - 2023-03-31T17:35:19+05:30 IST
క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఈ ఫస్ట్ మ్యాచ్ శుక్రవారం (నేడు) రాత్రి 7:30 గంటలకు అహ్మదాబాద్ వేదికగా జరగబోతోంది. మరి గెలుపెవరిది?...
అహ్మదాబాద్: ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి, మొదటి ప్రయత్నంలోనే గతేడాది కప్ ఎగరేసుకుపోయిన గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)... నిరుడు భారీ అంచనాలతో బరిలోకి దిగి ఘోరంగా ఫెయిలైన చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings) మధ్య తొలి మ్యాచ్‌తో ఐపీఎల్ 2023 (IPL2023) క్రికెట్ సంరంభ షురూ కాబోతోంది. క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఈ ఫస్ట్ మ్యాచ్ శుక్రవారం (నేడు) రాత్రి 7:30 గంటలకు అహ్మదాబాద్ వేదికగా జరగబోతోంది. తొలి మ్యాచ్‌లో గెలిచి టోర్నీలో శుభారంభాన్ని చేయాలని ఇరు జట్లూ ఉవిళ్లూరుతున్నాయి. మరి సత్తా చాటాలని భావిస్తున్న ఈ మ్యాచ్‌లో గెలుపు అవకాశాలు ఏ జట్టుకు ఎక్కువగా ఉన్నాయి? జట్ల బలాబలాలు ఏంటి? తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి? నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ పరిస్థితి ఏంటి?... ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో గెలుపు అవకాశాలు (Match prediction) ఏవిధంగా ఉన్నాయో ఒక లుక్కేద్దాం...
పిచ్ రిపోర్ట్..
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మొత్తం 10 మ్యాచ్‌లు జరగగా అందులో 6 మ్యాచుల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. ఈ వేదికపై తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 160గా ఉంది. ఈ స్టేడియంలో ఛేజింగ్ మరీ అంతపెద్ద కష్టమేమీ కాదు. సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు అత్యధికంగా 166 పరుగుల టార్గెట్‌ను చేధించింది. పిచ్ పరిస్థితిని బట్టి టాస్ గెలిచే కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలున్నాయి. చాలెంజింగ్ టార్గెట్‌ను నిర్దేశించే అవకాశాలున్నాయి.
తుది జట్టు అంచనాలు..
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), మ్యాథ్యూ వేడ్, రాహుల్ తివాటియా, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిశోర్, యశ్ దయాల్, అల్జారి జోసెఫ్, మహ్మద్ షమీ.
చెన్నై సూపర్ కింగ్స్: డెవోన్ కాన్వే, రుత్‌రాజ్ గైక్వాడ్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ(కెప్టెన్ వికెట్‌కీపర్), ప్రిటోరియస్, దీపక్ చాహర్, ప్రశాంత్ సోలంకి, సిమర్‌జీత్ సింగ్/రాజ్‌వర్ధన్.
వీళ్లు దుమ్మురేపొచ్చు...
గుజరాత్ ఆటగాడు, 23 ఏళ్ల శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం అదిరిపోయే ఫామ్‌లో ఉన్నాడు. 2022లో అన్ని ఫార్మాట్లలోనూ సెంచరీలు కొట్టి మంచి ఊపుమీద ఉన్నాడు. న్యూజిలాండ్‌పై ఒక టీ20 మ్యాచ్‌లో 63 బంతుల్లో 126 పరుగులు కొట్టి తన సత్తా చాటాడు. కాబట్టి ఈ మ్యాచ్‌లో రాణించే అవకాశం ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే కళ్లన్నీ దీపక్ చాహర్ మీద ఉన్నాయి. 2022 సీజన్‌లో గాయం కారణంగా దూరమైన ఈ సీమర్ ఈ సీజన్‌లో రాణించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. కొత్త బంతితో స్వింగ్ రాబట్టి వికెట్లు రాబట్టే అవకాశం ఉంది. పవర్‌ప్లేలో కీలకమైన వికెట్లు తీసే అవకాశం ఉంది.
కాగా ఎంఎస్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని భావిస్తుండడంతో ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని చెన్నై సూపర్ కింగ్స్ చూస్తోంది. ఇక గతేడాది అదిరిపోయే ఫర్ఫార్మెన్స్ ట్రోఫీని దక్కించుకున్న గుజరాత్ టైటాన్స్ ఈ ఏడాది కూడా అదే ఫామ్‌ను కొనసాగించాలనుకుంటోంది. రాత్రి 7:30 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, జియోసినిమాలలో ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు.