అధికార పార్టీ నేతల ఆగడాలు!

ABN , First Publish Date - 2023-02-01T00:39:15+05:30 IST

ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చి గెలుపొందిన బల్దియా నేతల ఆగడాలు మితిమీరి పోతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి.

అధికార పార్టీ నేతల ఆగడాలు!
ఇదే బంగారుగూడలో అధికారులు కూల్చివేసిన ఇంటి నిర్మాణం

ఆదిలాబాద్‌ బల్దియాలో చోటా డాన్‌గా చలామణీ

రోజురోజుకూ మితిమీరిపోతున్న వైనం

తాజాగా బంగారిగూడలో ఓ ఇంటి కూల్చివేత వివాదం

నేతల తీరుతో రోజురోజుకూ విసుగెత్తిపోతున్న పట్టణ వాసులు

ఆదిలాబాద్‌, జనవరి 31(ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చి గెలుపొందిన బల్దియా నేతల ఆగడాలు మితిమీరి పోతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. న్యాయం చేయాల ని నేతల వద్దకు వస్తున్న బాధితుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకు ని భూదందాలు, సెటిల్‌మెంట్లు చేస్తూ అడ్డగోలు సంపాదనకు ఎగబడుతున్నారు. ప్రజా సేవ ముసుగులో పక్కదారి పడుతున్న నేతలు ప్రజలను నిలువుదోపిడి చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడే నాలుగు పైసలు వెనుకేసుకోవాలన్న ఉద్దేశ్యంతో కనిపిస్తున్నారు. మాట వింటే సరే లేదంటే అధికారులతో ఒత్తిళ్లు చేయించి పంతం నెగ్గించుకునేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. అధికారులతో నోటీసులు ఇప్పించడం, ఆ తర్వాత రాయభారం పంపిఎంతో కొంత సెటిల్‌ చేసుకోవడం కొందరు బల్దియా నేతల కు అలవాటుగానే మారిందంటున్నారు. ముఖ్యంగా బల్దియాలో ద్వితీయ శ్రేణి నేతగా చలామణి అవుతున్న ఓ నేత తీరు గత కొద్దిరోజులుగా వి వాదాస్పదంగా మారింది. గతంలో ఖానాపూర్‌ చెరువులో భూకబ్జాలపై ప్రశ్నించిన అప్పటి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ను బెదిరింపులకు గురిచేయడం, ఇటీవల మల్టీపర్పస్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ ఏర్పాటు వెనుక కీలక పాత్ర పోషించిన నేతనే.. తాజాగా బంగారిగూడ కాలనీలో ఓ నిరుపేద కుటుంబానికి సంబంధించిన ఇంటిని కూ ల్చి వేయించాడన్న ఆరోపణలు వస్తున్నాయి. మంగళవారం ఉదయం నా లుగు గంటల ప్రాంతంలో మున్సిపల్‌ అదికారులు, పోలీసు సిబ్బంది స హకారంతో ఇంటిని కూల్చి వేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప ట్టణంలో ఎన్నో విలువైన భూముల కబ్జాలు, ప్రభుత్వ స్థలాల అక్రమణ లు జరుగుతున్నా.. చర్యలు తీసుకునేందుకు వెనుకాడే మున్సిపల్‌ అధికారులు ఓ నిరుపేద కుటుంబంపై అతిఉత్సాహం చూపడం వెనుక ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ నేతల ఆగడాలతో పట్టణవాసులు విసుగెత్తి పోతున్నారన్న టాక్‌ వినిపిస్తోంది.

అధికారులపై నేతల ఒత్తిళ్లు

మున్సిపల్‌ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అక్రమాలపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు పెరిగిపోతున్నట్లు తెలుస్తుంది. తమ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లోనూ పర్సంటేజీలు ఇవ్వాలంటూ కాం ట్రాక్టర్లను బెదిరింపులకు గురిచేయడం కొందరికి పరిపాటిగా మారింది. ప్రభుత్వం మంజూరు చేస్తున్న పనులను ముందుండి పూర్తి చేయించాల్సిన నేతలే కాంట్రాక్టర్లతో చేతులు కలిపి అందినకాడికి దండుకుంటున్నారు. లేదంటే బిల్లుల చెల్లింపులకు కొర్రీలు పెట్టడం, అధికారులపై ఒత్తిళ్లు చేయడం సాధారణంగా మారిందంటున్నారు. ఇప్పటికే రెండు వర్గాలుగా విడిపోయిన అధికార పార్టీ కౌన్సిలర్ల మధ్య ఆధిపత్య పోరు మరింతగా పెరిగింది. దీంతో పని చేయలేమంటూ కొందరు అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఇటీవల కౌన్సిలర్ల వేధింపులకు తట్టుకోలేక ఓ ఉన్నతాధికారి ధీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లినట్లు తెలిసింది. కక్ష సాధింపు చర్యలకు దిగుతున్న బల్దియా నేతలు అధికారులను పావులుగా వాడుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. తాజాగా బంగారిగూడ కాలనీలో జరిగిన సంఘటన వె నుక కూడా అధికార పార్టీ నేత హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నా యి. ఫిర్యాదు వచ్చిన వెంటనే అధికారులు ఆగమేఘాల మీద చర్యలు తీసుకోవడం ఏమిటో అంతుచిక్కడం లేదు. మున్సిపల్‌ పరిధిలో అనుమతులు లేకుండా ఎన్నో నిర్మాణాలు చేపడుతున్న నోటీసులతోనే సరిపెడుతున్న అధికారులు ఓ నిరుపేద కుటుంబంపై ప్రతాపం చూపడం వెనుక ఆ నేత ఒత్తిళ్లే అసలు కారణమన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

అడిగినంత ఇవ్వకుంటే అంతే సంగతి!!

ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న నిరుపేదలపై బల్దియా నేతల పెత్తనం పెరిగిపోతోంది. అడిగినంత ఇస్తే సరి.. లేదంటే ముప్పుతిప్పలు పెట్టడం పరిపాటిగా మారింది. బంగారిగూడలోని ప్రభుత్వ స్థలంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న ఓ నిరుపేద కుటుంబాన్ని మొదట రూ.2 లక్షల వర కు డిమాండ్‌ చేసి ఇవ్వకపోవడంతోనే అధికారులతో ఇంటిని నేలమట్టం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మున్సిపల్‌ పరిధిలో ఇలాంటి ఘటనలు జరగడం సర్వసాధారణంగా మారింది. ఇప్పటికే మున్సిపల్‌ ద్వితీయ శ్రేణి లీడర్‌పై పెద్దాయన ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు మారినట్లు కనిపించడం లేదంటున్నారు. కొందరు అధికార పార్టీ నేతలే ఆయనపై అధికారులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. తన సొంత కాలనీలోనే కాకుండా ఇతర కాలనీల్లోనూ సెటిల్‌మెంట్లు చేయడం ఏమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. చెప్పిన పని చేయకుంటే అధికారులను సైతం బెదిరింపులకు గురిచేయడం ఆయనకు అలవాటేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కొందరు అధికార పార్టీ కౌన్సిలర్లే ఆయన తీరుపై పె ద్దాయనకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయినా వెనక్కి తగ్గినట్లు కనిపించడం లేదు. పార్టీని ఇబ్బందుల్లో పడేసే విధంగా ఆ నేత వ్యవహరిస్తున్నా.. అడ్డుకట్ట వేయక పోవడంపై అధికార పార్టీలో భిన్నాభిప్రాయా లు వ్యక్తమవుతున్నాయి. అక్రమ కట్టడాలపై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వస్తున్నా.. చర్యలు తీసుకోని అధికారులు నేతల బెదిరింపులతో పేదలపై పెత్తనం చలాయిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

రూ.2లక్షలు ఇవ్వకపోతేనే కూల్చేశారు

: అర్షియా, బాధితురాలు, బంగారుగూడ కాలనీ

గత కొన్నేళ్లుగా బంగారుగూడ కాలనీలో నివాసం ఉంటున్నాం. ఇటీవల మున్సిపల్‌కు చెందిన ఓ నేత డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీం తో తాము ఇవ్వలేమని చెప్పడంతో అధికారులను పం పించి రాత్రికి రాత్రే ఇంటి నిర్మాణాన్ని కూల్చివేశారు. అధికార పార్టీ నేతల వేధింపులతో బతకలేని పరిస్థితి ఉంది. కూలీ పనులు చేసుకునే మాకు రూ.2 లక్షలు ఇచ్చే స్తోమత లేదు. అధికారులు కూడా మాపై కనికరం చూపకుండానే రోడ్డున పడేలా చేశారు.

తిరిగి విచారణ చేపడుతాం

: శైలజ, మున్సిపల్‌ కమిషనర్‌, ఆదిలాబాద్‌

బంగారుగూడలో ఇంటిని కూల్చివేసిన విషయంలో తిరిగి విచారణ చేపడుతాం. బంగారుగూడ కాలనీకి చెందిన మౌలాన అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకే పరిశీలించి చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వ స్థలంలో నివాసం ఉంటున్న ట్లు గుర్తించాం. మున్సిపల్‌ సిబ్బందిపై దురుసు గా ప్రవర్తించడంతోనే పోలీసుల సహకారం తీసుకున్నాం. ఎలాంటి ఆధారం లేకుండా ఉంటే పరిశీలించి న్యాయం జరిగేలా చూస్తాం.

Updated Date - 2023-02-01T00:39:17+05:30 IST