Niranjan Reddy: ‘జూపల్లి, పొంగులేటి ఎవరి ట్రాప్‌లో ఉన్నారో అందరికీ తెలుసు’
ABN , First Publish Date - 2023-04-10T13:55:11+05:30 IST
బీఆర్‌ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, పొంగులేటి సుధాకర్ సస్పెండ్ అవడంపై మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు.
హైదరాబాద్: బీఆర్‌ఎస్ పార్టీ (BRS Party) నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao), పొంగులేటి సుధాకర్ (Ponguleti Sudhakar) సస్పెండ్ అవడంపై మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy) స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... కొంతకాలంగా జూపల్లి, పొంగులేటి పార్టీ క్రమశిక్షణ పాటించడం లేదన్నారు. పార్టీ కంటే వ్యక్తులం గొప్ప అన్నట్లు హద్దుమీరి ప్రవర్తించారని విమర్శించారు. మారుతారని పార్టీ ఇన్నాళ్లు వేచి చూసిందని... కానీ మారకపోవడంతో అధినేత కేసీఆర్ కఠిన నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అధినేత మీదనే మాట్లాడే స్థాయికి వెళ్ళడం పరాకాష్ట అని అన్నారు. తనను విమర్శించిన వారిని కూడా కేసీఆర్ దగ్గర తీసుకున్నారని అన్నారు. బలిదానాల గురించి మాట్లాడటానికి జూపల్లికి సిగ్గుండాలని మండిపడ్డారు. మొదటి నుంచి ఉన్నవారిని కాదని జూపల్లిని కేసీఆర్ (CM KCR) మంత్రిని చేశారని గుర్తుచేశారు. గత ఎన్నికల్లో ఆ జిల్లాలో ఆయన ఒక్కరే ఓడిపోయారన్నారు. ‘‘మీ మాటల్లో అర్థం ఉంటే పోయిన టర్మ్‌లో మంత్రి పదవి ఎందుకు తీసుకున్నారు. నువ్వు ప్రజా ప్రతినిధివే కాదు నీ ఫోన్ ఎందుకు ఎత్తుతారు. నియోజకవర్గానికి నీరు రాలేదంటే అది మీ వైఫల్యం.. మీరు పార్టీని బలహీనపర్చలేరు’’ అని మంత్రి అన్నారు.
జూపల్లి, పొంగులేటి ఎవరి ట్రాప్ లో ఉన్నారో అందరికీ తెలుసన్నారు. కేసీఆర్‌ను వీడి బయటకు వెళ్లి సక్సెస్ అయిన వారు ఎవరూ లేరని తెలిపారు. పొంగులేటికి తెలంగాణ ప్రస్థానంలో అసలు పాత్రే లేదన్నారు. జూపల్లి మంత్రిగా ఉన్నప్పుడు జగన్ (AP CM Jagan) సీఎం కావాలని కోరుకున్నారని... జగన్ కోసం రాజీనామా చేస్తానని అన్నారని తెలిపారు. మంత్రి అయ్యాక కూడా వైఎస్ ఫోటో ఇంట్లో పెట్టుకున్నారని... మంత్రి పదవి ఇచ్చిన కేసీఆర్ ఫోటో మాత్రం పెట్టుకోలేదని విమర్శించారు. మంత్రి అయ్యాక తెలంగాణ తల్లి విగ్రహాలు కాకుండా వైఎస్ విగ్రహాలను పెట్టించారన్నారు. మీలాంటి ద్రోహులా మాట్లాడేది తెలంగాణ గురించి అంటూ మండిపడ్డారు. వీళ్ల మాటలన్నీ ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ పార్టీ పెట్టీ మాట్లాడేవారీ మాటలే అంటూ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.