Womens: ఆకాశంలో సగం.. చట్ట సభల్లో?
ABN , First Publish Date - 2023-03-08T02:09:42+05:30 IST
ఆకాశంలో సగం.. అవకాశాల్లోనూ సగం అంటూ మహిళలకు అందిస్తున్న ప్రోత్సాహం గురించి ప్రభుత్వాలు గొప్పగా చెప్పుకొంటున్నా.. కీలకమైన చట్టసభల్లో మాత్రం అతివల ప్రాతినిధ్యం నామమాత్రంగానే ఉంటోంది.
లోక్‌సభలో 15% మించని మహిళల ప్రాతినిధ్యం.. 9 రాష్ట్రాల్లో మహిళా ఎమ్మెల్యేలు 5% లోపే
తెలంగాణలో 4%.. పలు దేశాల్లో 50% మించి మహిళా ప్రజాప్రతినిధులు
హైదరాబాద్, మార్చి 7(ఆంధ్రజ్యోతి): ఆకాశంలో సగం.. అవకాశాల్లోనూ సగం అంటూ మహిళలకు అందిస్తున్న ప్రోత్సాహం గురించి ప్రభుత్వాలు గొప్పగా చెప్పుకొంటున్నా.. కీలకమైన చట్టసభల్లో మాత్రం అతివల ప్రాతినిధ్యం నామమాత్రంగానే ఉంటోంది. పార్టీలు ప్రసంగాల్లో ఊదరగొడుతున్నా ఆచరణలో భిన్న పరిస్థితి నెలకొంది. పేద దేశమైన ఆఫ్రికా ఖండంలోని రువాండాలో 61%, క్యూబాలో 53%, గల్ఫ్ దేశం యూఏఈ పార్లమెంటుల్లో 50% మహిళలు సభ్యులుగా ఉన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలు జరుపుకొంటున్న భారత్‌లో మాత్రం మహిళల ప్రాతినిధ్యం లోక్‌సభలో 14 శాతం, రాజ్యసభలో 12 శాతమే. సగానికి పైగా రాష్ట్రాల్లో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య 5%లోపే. లోక్ సభలో 543 స్థానాలుండగా మహిళా సభ్యుల సంఖ్య ఎన్నడూ 15 శాతం మించలేదు. విశేషమేమంటే ప్రస్తుత లోక్‌సభలో వారి ప్రాతినిధ్యం 14.4ు. ఇప్పటివరకు ఇదే అత్యధికం. 2019 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 8,054 మంది అభ్యర్థులు పోటీచేయగా.. వీరిలో మహిళలు 284 మంది (3.54%) మాత్రమే కావడం గమనార్హం.
వీరిలోనూ గెలిచినవారు కేవలం 78 (14.36%) మంది. లోక్‌సభతో పోలిస్తే రాజ్యసభలో మహిళల సంఖ్య మరింత తక్కువగా ఉంది. ప్రస్తుతం రాజ్యసభలో 29 మహిళా ఎంపీలు కాగా.. మొత్తం సీట్లలో వీరిది 12.24 శాతం. దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ మహిళా ఓటర్ల సంఖ్య పురుషులతో దాదాపు సమానంగా ఉంటోంది. కొన్నిచోట్ల 52 శాతంగా కూడా ఉన్నారు. దాదాపు 60 ఏళ్ల నాగాలాండ్ అసెంబ్లీ చరిత్రలో.. మొన్నటివరకు మహిళా ప్రాతినిధ్యమే లేదు. ఇటీవలి ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు విజయం సాధించారు. కాగా, 40 అసెంబ్లీ స్థానాలున్న మిజోరాంలో ప్రస్తుతం మహిళా సభ్యులు లేరు.
తెలంగాణలో తగ్గారు..
తెలంగాణకు వస్తే.. 2014 ఎన్నికల్లో 9 మంది మహిళలు నెగ్గారు. వీరిలో బీఆర్‌ఎస్ వారు ఆరుగురు, కాంగ్రెస్ నుంచి ముగ్గురు ఉన్నారు. 2018 ఎన్నికల్లో ఐదుగురే గెలిచారు. వీరిలో సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం) మంత్రిగా వ్యవహరిస్తున్నారు. సీతక్క (ములుగు), పద్మాదేవేందర్‌రెడ్డి (మెదక్), హరిప్రియ (ఇల్లందు), గొంగిడి సునీత (ఆలేరు) ఉన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ శాసన మండలి సభ్యురాలు.
61శాతంతో రువాండా అగ్రస్థానం
1.35 కోట్ల జనాభా ఉన్న రువాండా పేద దేశం. దీని పార్లమెంటులో 80 సీట్లుండగా 49 మంది (61.3 శాతం) మహిళలే. ఈలెక్కన మహిళా ప్రజా ప్రాతినిధ్యంలో రువాండా ప్రపంచంలోనే టాప్‌లో ఉంది. క్యూబాలో 605 స్థానాలకు 322 (53.2ు), బొలీవియాలో 130 స్థానాలకు 69 (53.1%), మెక్సికోలో 500 స్థానాలకు 241 (48.2%), స్వీడన్‌లో 349 స్థానాలకు 135 (47.3ు) మహిళా ప్రజాప్రతినిధులున్నారు. యూఏఈ లో 40 పార్లమెంటు స్థానాల్లో 20 (50ు) మంది అతివలే. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల చట్టసభల్లో సరాసరిగా మహిళల ప్రాతినిధ్యం 26.5 శాతం ఉండగా.. భారత్‌లో మాత్రం ఇంతవరకు 15శాతం మించలేదు.
రాజ్యసభలో మహిళలు..
2012 - 24(9.8%) 2014 - 31 (12.8%) 2016 - 27 (11%) 2018 - 28 (11.4%) 2019 - 26 (10.83%) 2021 - 29 (12.24%)
10శాతానికి మించి మహిళలున్న శాసనసభలు (శాతం)
ఛత్తీస్‌గఢ్ -14.44, పశ్చిమబెంగాల్ - 13.70 జార్కండ్ - 12.35, బిహార్ -10.70 ఉత్తరప్రదేశ్ - 10.55, హరియాణా-10, రాజస్తాన్ - 12
అత్యల్ప శాతం మహిళలున్న అసెంబ్లీలు
మిజోరాం -0, నాగాలాండ్ -0.75%, కశ్మీర్ - 2.30, కర్ణాటక-3.14%, పుదుచ్చేరి- 3.33%
మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కోసం ఉద్యమం
సాధికారతను సాధించుకోవాల్సిన బాధ్యత మహిళలదే. రాజకీయాల్లో మహిళలకు 33ు రిజర్వేషన్ సాధన కోసం ఉద్యమానికి నాంది పలుకుతున్నాం. సామాజిక మాధ్యమాల ద్వారా వేధించే బ్లాక్‌మెయిలర్లను విద్యార్థినులు ధైర్యంగా ఎదుర్కోవాలి. వేధింపులకు గురిచేస్తున్న వారి ఖాతాలను తొలగించాలి.
- ఎమ్మెల్సీ కవిత
మహిళా దినోత్సవం సందర్భంగా
27 మందికి పురస్కారాలు
రూ.లక్ష నగదు, ప్రశంసా పత్రం అందజేత
ఖైరతాబాద్, మార్చి7 (ఆంధ్రజ్యోతి): వి-హబ్ ద్వారా మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా పీవీ నర్సింహారావు మార్గంలోని పీపుల్స్‌ప్లాజాలో ప్రభుత్వం తరఫున సమాచార శాఖ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టులను సత్కరించారు. మొత్తం 138 మంది మహిళా జర్నలిస్టులకు ముఖ్యమంత్రి సంతకం చేసిన ప్రశంసా పత్రాలతో పాటు కిట్‌లను అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సమాచార శాఖ కమిషనర్ అరవింద్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మట్లాడుతూ.. గుజరాత్‌లో జర్నలిస్టులకు కేవలం 3 వేల అక్రిడిటేషన్ కార్డులుండగా తెలంగాణలో జర్నలిస్టులకు 19 వేల అక్రిడిటేషన్ కార్డులను అందజేశామన్నారు.
అక్రిడిటేషన్ ఉన్న ప్రతి జర్నలిస్టు కుటుంబానికి మెడికల్ క్యాంపుల ద్వారా స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. మీడియా సంస్థలు ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతున్నట్లే మంచి పనులకు సహకరించాలని కోరారు. కాగా, ఎలకా్ట్రనిక్ మీడియా విభాగంలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతికి చెందిన విజయచంద్రిక, సుమిత్ర, హేమలతకు ముఖ్యమంత్రి సంతకం చేసిన ప్రశంసా పత్రంతో పాటు మంత్రి కేటీఆర్ ద్వారా సత్కారాలు పొందారు. ప్రింట్ మీడియా తరఫున ఆంధ్రజ్యోతి మహిళా జర్నలిస్టులు కవిత, అనురాధ, హిమబిందు సత్కారాలు పొందారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి సీనియర్ పాత్రికేయురాలు డీపీ అనురాధ తాను రాసిన ‘జగమునేలిన తెలుగు.. గోదావరి నుంచి జావా దాక’ పుస్తకాన్ని మంత్రి కేటీఆర్‌కు అందజేశారు.
నేటినుంచే ఆరోగ్య మహిళ
కరీంనగర్‌లో ప్రారంభించనున్న హరీశ్‌రావు
హైదరాబాద్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మహిళల ఆరోగ్య రక్షణ కోసం చేపట్టిన ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కరీంనగర్ జిల్లా నుంచి ప్రారంభించనున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు పారంభించనున్నారు. అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ కార్యక్రమం మొదలుకానుంది. ఆ తర్వాత దశలవారీగా మొత్తం 1200 కేంద్రాల్లో ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ప్రతీ మంగళవారం ప్రాథమిక వైద్య కేంద్రాల్లో మహిళలకు ప్రత్యేకంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. అక్కడే మందులు కూడా ఇస్తారు. అవసరమైతే పెద్దాస్పత్రులకు రిఫర్ చేస్తారు. 33 జిల్లాల్లోని అన్ని వయసుల మహిళలకు 57 రకాల వైద్య పరీక్షలు చేస్తారు. ప్రధానంగా 8 ప్యాకేజీలుగా విభజించారు.
డయాగ్నస్టిక్స్, కేన్సర్ స్ర్కీనింగ్, సరైన ఆహారం లేకుండా వచ్చే సమస్యలు, మూత్ర సంబంధిత సమస్యలు, మెనోపాజ్, కుటుంబ నియంత్రణ, సంతానలేమి, రుతు సమస్యలు, సుఖవ్యాధులు, తక్కువ బరువులాంటి సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైన వారి నుంచి నమూనాలు సేకరిస్తారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 20 తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రాలకు సేకరించిన ఆ నమూనాలను పంపుతారు. 24 గంటల్లో వాటి రిపోర్టులను అందజేస్తారు. ఇక 30 ఏళ్లు పైబడిన మహిళలకు పీహెచ్‌సీలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీదవాఖానాలలో రొమ్ము కేన్సర్ నిర్ధారణ పరీక్షలు చేపడతారు. జిల్లా కేంద్రాలు, ప్రాంతీయ ఆస్పత్రుల్లో మామోగ్రామ్, కల్పోస్కోపి, క్రియోథెరపీ, బయాప్సీ, పాప్‌స్మియర్ పరీక్షలు నిర్వహించనున్నారు. కేన్సర్ నిర్ధారణ అయితే హైదరాబాద్‌లోని నిమ్స్, ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిల్లో చికిత్స అందిస్తారు. అలాగే విటమిన్ డీ-3, బీ-12 పరీక్షలు కూడా చేస్తారు. ఈ కార్యక్రమానికి గాను ప్రత్యేకంగా ఆరోగ్య మహిళ హెల్ప్ డెస్క్ కియాస్కిలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద ఏఎన్‌ఎమ్, ఆశా వర్కర్లలతో పాటు పేషంట్ కేర్ కార్యకర్తలను అందుబాటులో ఉంటారు.
విశిష్ట పురస్కారాలకు 27 మంది ఎంపిక
నేడు వరంగల్‌లో మహిళా శాఖ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం
కేయూ క్యాంపస్, హైదరాబాద్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తోన్న మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలను ప్రకటించింది. అందుకోసం వివిధ రంగాల్లోని 27 మందిని ఎంపిక చేసింది. ఈ మేరకు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి భారతీ హోళికేరీ ఉత్తర్వులు జారీ చేశారు. పురస్కారాలకు ఎంపికైన మహిళలకు ప్రశంసా పత్రంతో పాటు రూ.లక్ష నగదును అందజేయనున్నారు.
హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే అంతర్జాతీయ మహిళ దినోత్సవ సంబరాలకు కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియం ముస్తాబైంది. బుధవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ రాష్ట్రస్థాయి మహిళ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ‘వనిత వనం’ అనే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. దాని ద్వారా మహిళలందిరితో మొక్కలు నాటించనున్నారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, గౌరవ అతిథిగా రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రత్యే అతిథిగా రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి, శాసన మండలి డిపూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తదితరులు హాజరవనున్నారు.
వివిధ రంగాల్లో పురస్కారాలకు ఎంపికైన వారు:
బానోతు జ్యోతి (అంగన్‌వాడీ టీచర్), గుండా రాజకుమారి (భరోసా సెంటర్ కో ఆర్డినేటర్), ఆల్పి కిదన్‌జెన్ (సోషల్ సర్వీస్), మీనాక్షి గాడ్గె (ముఖ్ర కె.ఇచ్చోడ గ్రామ సర్పంచ్), సుజాత దీక్షిత్ (థియేటర్ ఆర్ట్స్), పొట్లపల్లి స్వరూప (జర్నలిజం), డాక్టర్ బండారు సుజాతశేఖర్ (జానపద సాహిత్యం), నారదభట్ల అరుణ (సాహిత్యం), డాక్టర్ అమూల్య (వైద్యం), నారా విజయలక్ష్మి దివ్యాంగురాలు (పెయింటర్), ఇన్‌స్పెక్టర్ రుక్మిణి (షీ టీమ్స్, భరోసా సెంటర్), ఐపియస్ అనసూయ (పోలీ్‌సశాఖ), అన్విత రెడ్డి (పర్వతారోహణ), గంగాడి త్రిష (స్పోర్ట్స్ క్రికెట్ అండర్-19), డాక్టర్ అనురాధ (క్లాసికల్ డ్యాన్స్), డి కనకదుర్గ (సోషల్ యాక్టివిస్ట్), డాక్టర్ మాలతి (హెల్త్ సూపరింటెండెంట్), సమంతా రెడ్డి (మహిళా ఎంటర్‌ప్రెన్యూర్), కర్నె శంకరమ్మ (కిన్నెర జానపదం), డాక్టర్ గూడురు మనోజా (ఆధ్యకళ), శ్వేత (కమ్యూనిటి మొబలైజేషన్), జి నందిని (సూపర్‌వైజర్, నిజామాబాద్), రజియా సుల్తానా (ఐసిడిఎస్ కౌడిపల్లి ఏడబ్య్లూహెచ్), ఎం కృష్ణవేణి (ఆశా వర్కర్), ఇందిర (ఏఎన్‌ఎం), డాక్టర్ కె. రాణిప్రసాద్ (సాహిత్యం), ఓఎన్‌ఐ సిస్టర్స్ వినోద, విజయ, విజయలక్ష్మి (సంగీతం).