TSPSC: టీఎస్‌పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలి
ABN , First Publish Date - 2023-03-20T02:49:50+05:30 IST
పేపర్ల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ టీఎస్‌పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు.
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్
హైదరాబాద్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): పేపర్ల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ టీఎస్‌పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. మచ్చలేని ఐఏఎస్ అధికారిగా జనార్ధన్‌రెడ్డి 35 ఏళ్ల సర్వీసు ఒకెత్తు అయితే 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలు ఒకెత్తని అన్నారు. ఆదివారం బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. ప్రశ్నపత్రాల ప్రింటింగ్, అప్రూవల్ అధికారం టీఎ్‌సపీఎస్సీ చైర్మన్‌కు మాత్రమే ఉంటుందని, అలాంటప్పుడు పేపర్లు ఎలా లీకయ్యాయో చెప్పాలన్నారు.
ఈ కేసులో జనార్ధన్‌రెడ్డిని నిందితుడిగా చేర్చి విచారించాలని డిమాండ్ చేశారు. అలాగే కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. గ్రూప్-1పై ప్రత్యేక కేసు నమోదు చేసి విచారణ చేయాలన్నారు. నిరుద్యోగులకు న్యాయం చేయకుంటే సకల జనుల సమ్మె చేస్తామని ఆయన హెచ్చరించారు. పేపర్ల లీకేజీని మంత్రి కేటీఆర్ చాలా చిన్న విషయంగా చూస్తున్నారని, అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్‌కు వెళితే కేటీఆర్‌కు నిరుద్యోగుల బాధలు తెలుస్తాయని అన్నారు. కేటీఆర్ పరోక్షంగా సిట్‌కు దిశానిర్దేశం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన ఏ హోదాలో టీఎ్‌సపీఎస్సీ తరఫున మాట్లాడుతున్నారని నిలదీశారు.