PG Medical Student: వెంటిలేటర్‌‌పైనే ప్రీతికి చికిత్స

ABN , First Publish Date - 2023-02-23T10:10:50+05:30 IST

పీజీ వైద్యవిద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు నిమ్స్ వైద్యులు తెలిపారు.

PG Medical Student: వెంటిలేటర్‌‌పైనే ప్రీతికి చికిత్స

హైదరాబాద్: పీజీ వైద్యవిద్యార్థిని ప్రీతి (PG Medical Student Preethi) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉన్నట్లు నిమ్స్ వైద్యులు (Nims Doctor) తెలిపారు. ప్రస్తుతం ప్రీతికి వెంటిలేటర్‌పైనే నిమ్స్ వైద్యులు చికిత్స అందిజేస్తున్నారు. ఈరోజు ప్రీతి హెల్త్ బులిటెన్ (Health Bulletin)ను విడుదల చేసే అవకాశం ఉంది. నిమ్స్ వైద్యురాలు పద్మజ నిన్న రాత్రి అన్ని టెస్ట్ రిపోర్ట్స్ పరిశీలించారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి (Warangal MGM Hospital) లో శిక్షణలో ఉన్న ప్రీతిని సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులకు గురిచేశాడు. దీంతో ప్రీతి తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఎమర్జెన్సీ ఆపరేషన్‌ థియేటర్‌(ఓటీ)లో విధులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. స్పృహలేని స్థితిలో ఉన్న ఆమెను వెంటనే అక్కడి నుంచి ఎమర్జెన్సీ వార్డులోకి తరలించి, అత్యవసర వైద్యం అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హూటాహుటిన హైదరాబాద్‌ (Hyderabad)లోని నిమ్స్‌ ఆస్పత్రి (Nims Hospital)కి తరలించారు. ఆమెను ఏఆర్‌సీయూ (ARCU)లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రీతి తీసుకున్న ఇంజెక్షన్‌లు ఆమె శరీరంలో ఉన్న అవయవాలపై తీవ్ర ప్రభావం చూపించాయని, వెంటిలేటర్‌పై వైద్యచికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అనస్థీషియా విభాగంలో పనిచేస్తున్న ప్రీతి అక్కడే ఆనస్థీషియా ఇంజెక్షన్లు తీసుకున్నట్టు ప్రాథమికంగా తెలుస్తోంది.

విచారణ ముమ్మరం...

మరోవైపు ప్రీతి ర్యాగింగ్ కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ప్రీతిని వేధించిన సైఫ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సైఫ్‌ను పోలీసులు విచారించనున్నారు. సైఫ్ స్వస్థలం హనుమకొండ జిల్లా కాజీపేట. కాగా సైఫ్‌కు జూనియర్ డాక్టర్లు మద్దతుగా నిలుస్తున్నారు. ర్యాగింగ్ తప్పుడు ప్రచారం అని జూడాలు చెబుతున్నారు.

Updated Date - 2023-02-23T10:49:39+05:30 IST