కాంగ్రెస్‌లో చేరిన జయపాల్‌రెడ్డి

ABN , First Publish Date - 2023-08-25T01:16:14+05:30 IST

మైత్రి గ్రూపు చైర్మన్‌ కొత్త జయపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు.

కాంగ్రెస్‌లో చేరిన జయపాల్‌రెడ్డి

కరీంనగర్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మైత్రి గ్రూపు చైర్మన్‌ కొత్త జయపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జిల్లా పరిధిలోని కరీంనగర్‌, చొప్పదండి, మానకొండూర్‌, తదితర నియోజకవర్గాల నుంచి వందలాది మంది ఈ చేరిక కోసం గాంధీభవన్‌కు తరలివెళ్లారు. గడిచిన ఆరు నెలలుగా జయపాల్‌ రెడ్డి బీజేపీలో చేరతారా, బీఆర్‌ఎస్‌లో చేరతారా, కాంగ్రెస్‌లో చేరి కరీంనగర్‌ అభ్యర్థిగా తెరపైకి వస్తారా అంటూ చర్చలు జరిగాయి. మంత్రి గంగుల కమలాకర్‌ మంత్రాంగంతో బీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారవుతుంది అనుకున్న సమయంలో అనూహ్యంగా ఆయన కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌ అభ్యర్థిత్వం కోసం కరీంనగర్‌ నియోజకవర్గంలో కొనగాల మహేష్‌, కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి, వైద్యుల అంజన్‌ కుమార్‌, మెనేని రోహిత్‌రావు, సమద్‌ నవాబ్‌, పురుమల్ల శ్రీనివాస్‌ దరఖాస్తు చేసుకున్నారు. ఆఖరు క్షణంలో పార్టీలో చేరిన కొత్త జయపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నారు.

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆశీస్సులతో..

కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆశీస్సులు పొందిన తర్వాతే ఆయన పార్టీలో చేరారని, కరీంనగర్‌ టికెట్‌ ఆయనకే లభిస్తుందని ప్రచారం జరుగుతోంది. జయపాల్‌ రెడ్డి కరీంనగర్‌ నుంచి పోటీ చేయడమే కాకుండా చొప్పండి నియోజకవర్గంలో కూడా పార్టీ అభ్యర్థిని గెలిపించి తీసుకువచ్చే బాధ్యతను కూడా తీసుకున్నారని పార్టీ వర్గాల సమాచారం. బీఆర్‌ఎస్‌లో రెడ్డి సామాజిక వర్గానికి సరైన ప్రాతినిధ్యం లేదని ఉమ్మడి జిల్లాలో ఆ సామాజికవర్గం బీఆర్‌ఎస్‌పై అసంతృప్తితో ఉన్నది. గత ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి మాత్రమే రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యేకు అవకాశం దక్కగా ఈసారి పెద్దపల్లి, హుజూరాబాద్‌ నియోజకవర్గాల్లో రెడ్డి అభ్యర్థులను ఎంపిక చేశారు. వెలమల కోటగా ఉంటూ వస్తున్న కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో ఒక్కసారైనా ప్రాతినిధ్యం వహించాలనే ఆకాంక్షతో రెడ్డి సామాజికవర్గం ఉన్నది. బీఆర్‌ఎస్‌పై రెడ్డిసామాజిక వర్గానికి ఉన్న అసంతృప్తిని, కరీంనగర్‌లో గెలుపొందాలనే ఆకాంక్షను ఆసరాగా చేసుకున్న జయపాల్‌రెడ్డి సరైన సమయంలో కాంగ్రెస్‌లో చేరి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారని, అందుకు ఆయన సామాజికవర్గం మద్దతు కూడా ఉందని చెబుతున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిత్వం కోసం దరఖాస్తులు చేసుకోవడానికి చివరి రోజున జయపాల్‌రెడ్డి ఆ పార్టీలో చేరారు. పార్టీ నాయకత్వం దరఖాస్తుదారులందరి అభ్యర్థిత్వాలను పరిశీలించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించుకొని సర్వేల ఆధారంగా అభ్యర్థిని ఖరారు చేస్తారని చెబుతున్నారు. ఈ వడపోతలో ఎవరు అభ్యర్థి అవుతారో అన్న ప్రశ్న బలంగా వస్తుండగా జయపాల్‌ రెడ్డి వర్గీయులు మాత్రం టికెట్‌ తమ నాయకుడికే వస్తుందన్న ధీమాతో ఉన్నారు. కరీంనగర్‌ జిల్లా పరిధిలోని గంగాధర మండలం లక్ష్మిదేవిపల్లి గ్రామానికి చెందిన జయపాల్‌రెడ్డి టీడీపీతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1996లో ఆయన ఆ పార్టీలో చేరి సహకార సంఘం చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రెడ్డి సంక్షేమ సంఘంలో చేరి తన పరిచయాలను విస్తృతం చేసుకొని వ్యాపారంలో స్థిరపడ్డారు. మైత్రి గ్రూపును ఏర్పాటు చేసి గ్రానైట్‌, రియల్‌ ఎస్టేట్‌, మీడియా రంగంలో ప్రవేశించారు. స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి జిల్లాలో అనేక సేవా కార్యాక్రమాలతో ప్రజలకు చేరువవుతూ వచ్చారు. టీడీపీ తర్వాత బీజేపీలో చేరినా ఆ తర్వాత క్రియాశీల పదవి రాజకీయాల్లో లేకున్నా కరీంనగర్‌, చొప్పదండి నియోజకవర్గ రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ఇప్పుడు అదే ఆలంబనగా కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కాంగ్రెస్‌లో చేరారు.

Updated Date - 2023-08-25T01:16:14+05:30 IST