Kaleshwaram : కాళేశ్వరం ఖర్చు ఏటా 25,109 కోట్లు

ABN , First Publish Date - 2023-06-28T03:11:30+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) తేల్చింది....

Kaleshwaram : కాళేశ్వరం ఖర్చు ఏటా 25,109 కోట్లు

విద్యుత్తు బిల్లులకే రూ.11,359 కోట్లు

వార్షిక నిర్వహణకు రూ.272.70 కోట్లు

సేకరించిన రుణాల్లో 1690 కోట్లు మళ్లింపు

ప్రభుత్వం చెప్పినట్టు ఆదాయం లేదు

కాగ్‌ ప్రాథమిక నివేదికలో వెల్లడి

హైదరాబాద్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) తేల్చింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పూర్తిస్థాయిలో నడిస్తే విద్యుత్‌ బిల్లుల ఖర్చే ఏటా రూ.11,359 కోట్లు కానుందని పేర్కొంది. ఈ బిల్లులు, రుణాల చెల్లింపులన్నీ(2039-40లో రుణ చెల్లింపులన్నీ పూర్తి అవుతాయి) కలుపుకుని ఏటా రూ.25,109 కోట్లు వ్యయం కానుందని కాగ్‌ లెక్కకట్టింది. అంతేకాక, ప్రాజెక్టు వార్షిక నిర్వహణకు రూ.272.70 కోట్లు అవసరమని చెప్పింది. ఈ మేరకు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆడిట్‌ చేసిన కాగ్‌ ప్రాథమిక నివేదికను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ఈ నివేదికపై అభ్యంతరాలు, అభిప్రాయాలు, సూచనలు ఉంటే తెలియజేయాలని కోరింది. అయితే, కాగ్‌కు వివరాలు అందించడానికి రాష్ట్ర అధికారులు రెండు వారాలుగా మల్లగుల్లాలు పడుతున్నారు. కాగా, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో ఒక ఎకరం సాగుకు పెట్టుబడి వ్యయం రూ.6.42 లక్షలు కానుందని కాగ్‌ తన నివేదికలో పేర్కొంది. ఈ ప్రాజెక్టును 56 పనులుగా విభజించగా ఇప్పటిదాకా 12 మాత్రమే పూర్తి అయ్యాయని తెలిపింది. 40 పనులు 3 శాతం నుంచి 99 శాతం దాకా వివిధ దశల్లో ఉండగా, మరో నాలుగు పనులు ఇంకా మొదలవ్వలేదని గుర్తించింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం 98,110 ఎకరాలు అవసరం కాగా ఇప్పటివరకు 63,972 ఎకరాలు సేకరించారని, ప్రాజెక్టుకు రూ.4011 కోట్ల మార్జిన్‌ మనీ సమకూర్చాల్సిన ప్రభుత్వం ఇప్పటిదాకా ఏమీ ఇవ్వలేదని తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం వివిధ ఆర్థిక సంస్థలు/బ్యాంకుల నుంచి సేకరించిన రుణాల్లో రూ.1690 కోట్లను ఇతర అవసరాలకు మళ్లించడాన్ని కాగ్‌ తప్పుపట్టింది. ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం రూ.1,51,168 కోట్లకు చేరనుందని అంచనా వేసింది. ప్రాజెక్టు నిర్మాణంతో వివిధ రూపాల్లో ఆదాయం వస్తుందని ప్రభుత్వం చెప్పినప్పటికీ వాస్తవ పరిస్థితులు మరోలా ఉన్నాయని, ఆదాయం సమకూరడం లేదని కాగ్‌ తేల్చింది. ప్రాజెక్టు రీడిజైనింగ్‌ వల్ల నిర్మాణ అంచనా వ్యయం భారీగా పెరిగిందని ఆక్షేపించింది. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణంతో రూ.63,352 కోట్లకు పూర్తి కావాల్సిన ప్రాజెక్టును కాళేశ్వరం ఎత్తిపోతల పథకంగా మార్చడం ద్వారా రూ.1,02,268 కోట్లకు చేర్చారని పేర్కొంది.

వడ్డీలు రూ.71,575 కోట్లు !

కాళేశ్వరం ప్రాజెక్టు కింద ప్రభుత్వం రూ.97,449 కోట్లు రుణాలు తీసుకోగా వాటిని తీర్చడానికి అయ్యే వడ్డీ రూ.71,575 కోట్లు కానుంది. 2021-22లో వడ్డీ కింద రూ.143.74 కోట్లు, అసలు రూ.69 కోట్లు కలిపి రూ.213.44 కోట్లు కట్టారు. 2022-23లో వడ్డీ రూ.3375.83 కోట్లు అవ్వగా అసలు రూ.1890.95 కోట్లతో కలిపి మొత్తం రూ.5266.78 కోట్లు కట్టాల్సి ఉంది. ఇక, 2023-24లో ఏకంగా రూ.10859.76 కోట్లు కిస్తీ కింద కట్టాలి. ఆ తర్వాత 2024-25లో రూ.13 వేల కోట్లకు భారం చేరనుంది. ఇది 2033-34 దాకా ఈ భారం ఉండనుంది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ 2039-40లో రూ.678.18 కోట్లు చెల్లించడం ద్వారా కాళేశ్వరం బాకీ తీరనుంది.

Updated Date - 2023-06-28T03:47:45+05:30 IST