మంత్రి గంగులకు పితృ వియోగం
ABN , First Publish Date - 2023-01-04T23:40:26+05:30 IST
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు పితృ వియోగం కలిగింది.

కరీంనగర్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు పితృ వియోగం కలిగింది. బుధవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో ఆయన తండ్రి గంగుల మల్లయ్య గుండెపోటుతో కరీంనగర్‌లోని స్వగృహంలో మృతిచెందారు. తండ్రి మరణవార్త తెలుసుకున్న మంత్రి తన కార్యక్రమాలను రద్దుచేసుకొని హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. గంగుల మల్లయ్యకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు కాగా అందులో మంత్రి గంగుల కమలాకర్ చిన్న కుమారుడు. కొద్దికాలంగా మల్లయ్య అనారోగ్యంతో బాధపడుతున్నారు. తండ్రి మృతితో మంత్రి గంగుల ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. మంత్రి తండ్రి మరణవార్త తెలుసుకున్న పలువురు జిల్లాస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చి మల్లయ్య పార్టీవ దేహం వద్ద నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు.
మంత్రి గంగులను ఫోన్‌లో పరామర్శించిన సీఎం కేసీఆర్...
మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మరణవార్త తెలుసుకున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఫోన్‌లో మంత్రి గంగులను పరామర్శించి విచారం వ్యక్తం చేశారు. గంగులను ఓదార్చి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య మృతిపట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య మరణం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ ఓ ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. గంగుల మల్లయ్య మృతిపై టీయూడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గంగుల మల్లయ్య మృతిపట్ల కరీంనగర్ జిల్లా సహకార సంఘాల అధ్యక్షుల ఫోరం అధ్యక్షుడు కొత్త తిరుపతిరెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్ సంతాపం ప్రకటించారు.
మంత్రి గంగులను పరామర్శించిన మంత్రి, ఎమ్మెల్యేలు, నాయకులు, అధికారులు..
మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య మృతిచెందారని తెలుసుకున్న రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి వెళ్లి భౌతిక కాయం వద్ద నివాళులర్పించి మంత్రిని పరామర్శించారు. ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు చల్మెడ లక్ష్మీనర్సింహారావు, మేయర్ వై సునీల్‌రావు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, సీపీ సత్యనారాయణ, అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్, ఉప రవాణా కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గంగుల కమలాకర్‌ను పరామర్శించారు.