రాజకీయ తెర పైకి కొత్త ముఖాలు

ABN , First Publish Date - 2023-03-29T01:21:36+05:30 IST

అసెంబ్లీ ఎన్నికల గడువు మరో తొమ్మిది మాసాలు ఉండగా అంతటా రాజకీయ వేడి మొదలవుతున్నది. ముందస్తు ఎన్నికల ముచ్చట ముందుకు రావడంతో అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఆశావహులు తెరపైకి వస్తున్నారు.

రాజకీయ తెర పైకి కొత్త ముఖాలు

- బీజేపీ అభ్యర్థిత్వానికి పోటాపోటీ

- కాంగ్రెస్‌లోనూ కొత్త ఆశలు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

అసెంబ్లీ ఎన్నికల గడువు మరో తొమ్మిది మాసాలు ఉండగా అంతటా రాజకీయ వేడి మొదలవుతున్నది. ముందస్తు ఎన్నికల ముచ్చట ముందుకు రావడంతో అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఆశావహులు తెరపైకి వస్తున్నారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల వారు కొందరు, కొత్తగా టికెట్లు ఆశించేవారు కొందరు, రాజకీయ వారసులుగా రంగం ప్రవేశం చేయాలనుకునేవారు మరికొందరు పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ సిట్టింగ్‌లందరికీ సీట్లిస్తామని ప్రకటించినా సర్వేలో ప్రజాదరణ లేదని తేలిన కొందరికి ఉద్వాసన తప్పదనే మాట వినిపిస్తున్నది. అలాంటివారు ఒక్కరో ఇద్దరో ఉంటారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అలాంటిచోట కొందరు అధికార పార్టీ టికెట్‌ను ఆశిస్తున్నా ఎమ్మెల్యేల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని బయట పడడం లేదని తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలలో టికెట్‌ ఆశిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నది. కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మంత్రి గంగుల కమలాకర్‌ బరిలో ఉండనుండగా భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ పోటీలో ఉండనున్నారు. అయితే ఆయన హైదరాబాద్‌లోని ఏదో ఒక స్థానం నుంచి పోటీచేసే అవకాశాలు ఉన్నాయని పార్టీలో ప్రచారం జరుగుతున్నది. ఈ విషయంలో సంజయ్‌ ఏ స్పష్టత ఇవ్వకపోవడంతో కొత్తగా కొత్త జయపాల్‌రెడ్డి పేరు తెరపైకి వస్తున్నది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ ఇక్కడ నుంచి పోటీలో ఉండని పక్షంలో జయపాల్‌రెడ్డి అభ్యర్థిగా ఉంటారని చెబుతున్నారు. దాదాపుగా ఆయన పేరు ఖరారై పోయినట్లేనని చెబుతున్నారు. అటు ఆర్‌ఎస్‌ఎస్‌ ముఖ్యుల ఆశీస్సులు, ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ అండదండలు ఉండడంతో ఆయన ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటారని కూడా పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉన్నది. కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి ఎమ్మెస్సార్‌ మనవడు మెన్నేని రోహిత్‌రావు, సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్‌కుమార్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. కాంగ్రెస్‌లోని ఒక్కో నేత ఒక్కో అభ్యర్థిని ప్రోత్సహిస్తుండడంతో వీరిలో ఎవరికి అధిష్టానం ఆశీస్సులు లభిస్తా యో చెప్పలేని పరిస్థితిలో పార్టీ శ్రేణులన్నీ మూడు గ్రూపులుగా విడిపోయి పనిచేస్తున్నాయి. చొప్పదండి నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సుంకె రవిశంకర్‌ పోటీలో ఉండనుండగా, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, గతంలో పోటీ చేసి పరాజయం పాలైన లింగంపల్లి శంకర్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. కొత్తగా మరో మాజీ మంత్రి సుద్దాల దేవయ్య బీజేపీలో చేరి టికెట్‌ ఆశిస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి గతంలో రెండుసార్లు పోటీ చేసిన మేడిపల్లి సత్యంతోపాటు నాగి శేఖర్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. మానకొండూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్‌ రసమయి బాలకిషన్‌ పోటీలో ఉండనుండగా, బీజేపీలో ఇక్కడ నుంచి పెద్ద సంఖ్యలో ఆశావహులు ఉన్నారు. గతంలో ఇక్కడ నుంచి పోటీ చేసిన గడ్డం నాగరాజు టికెట్‌ ఆశిస్తున్నారు. ఆయనతోపాటు సొల్లు అజయ్‌వర్మ, సెన్సార్‌ బోర్డు మెంబర్‌ దరువు ఎల్లన్న, దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి శంకర్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ పోటీలో ఉండనున్నారు. హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇంచార్జిగా గెల్లు శ్రీనివాస్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. అయితే ఇక్కడ అధికార పార్టీలో భిన్నమైన పరిస్థితి ఉన్నది. రాష్ట్ర నాయకత్వం ఇక్కడ నియోజకవర్గ ఇంచార్జి ఉండగానే ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌ కౌశిక్‌రెడ్డిని అప్రకటిత నియోజకవర్గ ఇంచార్జిగా ఫోకస్‌ చేస్తున్నది. అన్ని కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలోనే నిర్వహిస్తూ కాబోయే అభ్యర్థి ఆయనేనని చెబుతున్నది. స్వయంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, మంత్రి గంగుల కమలాకర్‌ ఒక సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. అయినా అధికార పార్టీలో ఆశావహుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌తో పాటు మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పొనగంటి మల్లయ్య, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌ కూడా టికెట్‌ ఆశిస్తున్నవారిలో ఉన్నారని, వీరు పార్టీ కార్యక్రమాల్లో అందరు కలిసి పనిచేస్తూనే ఎవరి బలాన్ని వారు పెంచుకోవడానికి స్వంత ఎజెండాతో పనిచేస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. ఈ నియోజకవర్గంలో బీజేపీ నుంచి మళ్లీ ప్రస్తుత ఎమ్మెల్యే ఈటల రాజేందరే పోటీ చేసే అవకాశం ఉండగా కాంగ్రెస్‌ నుంచి ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌, రైతు విభాగం నాయకుడు పత్తి కృష్ణారెడ్డి టికెట్‌ ఆశిస్తున్నవారిలో ఉన్నారు. హుస్నాబాద్‌ నియోజకవర్గంలో అధికార పార్టీ అభ్యర్థిగా వొడితెల సతీష్‌బాబు మళ్లీ బరిలో ఉండనుండగా, కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌ రెడ్డి అభ్యర్థి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీజేపీ నుంచి టికెట్‌ ఆశిస్తున్నవారిలో బొమ్మ శ్రీరాం చక్రవర్తి, కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, చాడ శ్రీనివాస్‌ ఉన్నారు. బహుజన సమాజ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గం నుంచి కాని, మానకొండూర్‌ నుంచి కాని పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. మానకొండూర్‌ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పోటీలో లేని పక్షంలో నిషాని రాంచంద్రం అభ్యర్థిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎమ్మెల్యేలను మార్చే అవకాశం లేదని అధికార పార్టీ ప్రకటించినా మానకొండూర్‌ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌, ఫుడ్‌ కార్పొరేషన్‌ సభ్యులు ఓరుగంటి ఆనంద్‌ ఇప్పటికీ తమ ఆశలు వదులుకోక అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అధికార పార్టీ టికెట్‌ లభించని పక్షంలో ఆరెపల్లి మోహన్‌ కాంగ్రెస్‌ నుంచి గాని, బీజేపీ నుంచి గానీ పోటీ చేయడం ఖాయమనే ప్రచారం జరుగుతున్నది. చొప్పదండి నియోజకవర్గం నుంచి కరీంనగర్‌ ప్రస్తుత కార్పొరేటర్‌ కంసాల శ్రీనివాస్‌ బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. ఈయన నియోజకవర్గంలో ఇప్పటికే వాల్‌రైటింగ్‌లతో తన ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తుండడం ఎమ్మెల్యే వర్గానికి, ఆయన వర్గానికి మధ్య తగాదాలకు దారితీస్తున్నది. అలాగే బోయినపల్లి జడ్పీటీసీ కత్తెరపాక కొండయ్య, కళాకారిణి ఒల్లాల వాణి కూడా ఇక్కడ టికెట్‌ ఆశిస్తున్నారు. వివిధ పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్నవారు నియోజకవర్గాల్లో తమ తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే నాయకుల ఆశీస్సులు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Updated Date - 2023-03-29T01:21:36+05:30 IST