KTR: సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-06-01T16:02:01+05:30 IST
వచ్చే ఎన్నికల్లోనూ విజయకేతనం ఎగరేసి హ్యాట్రిక్ నమోదు చేయాలని బీఆర్ఎస్ (BRS) భావిస్తోంది. ఎలాగైనా గెలవాలని కసరత్తు మొదలు పెట్టింది.

హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లోనూ విజయకేతనం ఎగరేసి హ్యాట్రిక్ నమోదు చేయాలని బీఆర్ఎస్ (BRS) భావిస్తోంది. ఎలాగైనా గెలవాలని కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పటికే.. పలు సర్వేలు నిర్వహించింది. అయితే.. రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కారణంగా వచ్చే సహజమైన వ్యతిరేకతతో కొంతమందిని మార్చాలని గులాబీబాస్ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లపై మంత్రి కేటీఆర్ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లపై ఇప్పుడే ఏం చెప్పలేమన్నారు. పని తీరు బాగున్న వారికి మళ్లీ టికెట్ దక్కుతుందన్నారు. వెనుకబడిన ఎమ్మేల్యేలు పని తీరు మార్చుకోవాలని కేటీఆర్ సూచించారు.
అధికార పార్టీలో గ్రూపు రాజకీయాలు?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) సమీపిస్తున్న వేళ.. అధికార పార్టీలో గ్రూపు రాజకీయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. స్వరాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి ఇప్పటివరకు ఎలాంటి అదృష్టానికి నోచుకోనివాళ్ళు.. ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డవాళ్ళు.. కేవలం నామినేటెడ్ పదవులకే పరిమితమైనోళ్ళు.. అలా వివిధ రకాల నేతలు యాక్టివ్ పాలిటిక్స్‌లోకి ఎంటర్ కావాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. తెలంగాణలో జరిగిన మొదటి ఎన్నికల్లో గులాబీ పార్టీ 63 స్థానాలు గెలుచుకుంది. కానీ.. ఇతర పార్టీల నుండి ఎమ్మెల్యేలను చేర్చుకొని మరింత స్ట్రాంగ్ అయింది. ఇక.. రెండోసారి జరిగిన ఎన్నికల్లో 88 స్థానాలు గెలిచి.. ప్రతిపక్షాల నుంచి మరికొంత మందిని పార్టీలోకి తెచ్చుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. న్యూ స్ట్రాటజీలో భాగంగా.. ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయని వాళ్ళని ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించే ఆలోచనలో ఉన్నారు. అయితే.. సిట్టింగ్ ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నంలో వారికి ఎమ్మెల్సీ పదవులు ఆఫర్ చేసే ఛాన్స్ ఉంది. ఏదేమైనా.. సీఎం కేసీఆర్ (CM KCR) న్యూ పొలిటికల్ స్ట్రాటజీ ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి మరి.