Stray Dogs Attack: వీధి కుక్కలదాడిలో బాలుడు మృతి.. హైకోర్టు సీరియస్.. సుమోటోగా కేసు స్వీకరణ

ABN , First Publish Date - 2023-02-22T20:55:07+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్‌ అంబర్‌పేట్‌ (Amberpet)లో వీధి కుక్కల దాడిలో చనిపోయిన బాలుడి ఘటన కలకలం రేపుతోంది. బాలుడు మృతి ఘటనను హైకోర్టు

Stray Dogs Attack: వీధి కుక్కలదాడిలో బాలుడు మృతి.. హైకోర్టు సీరియస్.. సుమోటోగా కేసు స్వీకరణ

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్‌ అంబర్‌పేట్‌ (Amberpet)లో వీధి కుక్కల దాడిలో చనిపోయిన బాలుడి ఘటన కలకలం రేపుతోంది. బాలుడు మృతి ఘటనను హైకోర్టు (High Court) సుమోటోగా స్వీకరించింది. పేపర్ న్యూస్ ఆధారంగా కేసు విచారణకు న్యాయస్థానం స్వీకరించింది. ఈ కేసుపై రేపు (గురువారం) హైకోర్టులో విచారణ జరుగనుంది. హైదరాబాద్‌ అంబర్‌పేట ఛే నంబర్‌ చౌరస్తాలో ఆదివారం ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్‌ ను చుట్టుముట్టి పాశవికంగా కరిచి అతడి ప్రాణాలను బలిగొన్న ఘటన అందరినీ కదిలించి వేసింది. ప్రదీప్‌ కుటుంబానిది నిజామాబాద్‌ జిల్లా (Nizamabad District) ఇందల్‌వాయి. ప్రదీప్‌ పుట్టినప్పుడే అతడి తండ్రి గంగాధర్‌ బతుకుదెరువు కోసం నగరానికి వచ్చాడు. బాగ్‌అంబర్‌పేట డివిజన్‌ ఎరుకల బస్తీలో ఉంటూ ఛే నంబర్‌ చౌరస్తాలోని రెనాల్డ్‌ కార్ల సర్వీసింగ్‌ సెంటర్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు.

గంగాధర్‌కు ప్రదీప్‌తో పాటు కుమార్తె మేఘన (6) సంతానం. ఆదివారం పిల్లలను తీసుకుని సర్వీసింగ్‌ సెంటర్‌కు వెళ్లాడు. మేఘనను పార్కింగ్‌ సెక్యూరిటీ క్యాబిన్‌లో ఉంచి ప్రదీప్‌ను సర్వీసింగ్‌ సెంటర్‌లోకి తీసుకెళ్లాడు. అయితే, బాలుడు కొద్దిసేపటికి అక్క వద్దకు వస్తుండగా కార్ల కింద ఉన్న నాలుగు కుక్కలు దాడి చేశాయి. పరుగెత్తబోయి కాలుజారి పడిపోయిన అతడిని తల, చేతులు, కాళ్లు, మెడ, పొట్ట భాగంలో తీవ్రంగా కరిచాయి. చెయ్యి ఒకటి, కాలు మరో కుక్క పట్టి లాగాయి. మేఘన తండ్రి గంగాధర్‌కు చెప్పగా అతడు వచ్చేవరకు దాడి చేస్తూనే ఉన్నాయి. ప్రదీప్‌ను సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు చెప్పారు. కార్ల సర్వీసింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు రూ.50 వేలు ఇవ్వడంతో గంగాధర్‌ కుటుంబం ఇందల్‌వాయికి వెళ్లి.. ప్రదీప్‌ అంత్యక్రియలు నిర్వహించింది.

మేయర్‌పై విమర్శలు..

ప్రదీప్‌ మృతిపై విచారణకు మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి (Vijayalakshmi) విచారణకు ఆదేశించారు. ప్రదీప్‌ కుటుంబానికి జీహెచ్‌ఎంసీ తరఫున సాయం అందిస్తామన్నారు. అంతవరకు బాగానే ఉంది.. ప్రదీప్‌పై దాడి చేసిన కుక్కలకు ఓ మహిళా రోజు మాంసం పెట్టేవారని, రెండ్రోజులుగా ఆమె లేకపోవడంతో వాటికి ఆహారం దొరకలేదని పేర్కొన్నారు. ఆ ఆకలితోనే దాడికి చేసి ఉండొచ్చని అన్నారు. ఆ ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో జీహెచ్‌ఎంసీ (GHMC) వైఫల్యాన్ని కప్పిపుచ్చకోవడానికి ఆమె తాపత్రయం పడినట్లు కనిపిస్తుందే తప్పా.. ఆమె సంజాయిషీ మాత్రం అందరినీ బాధించింది. వీధి కుక్కలను అరికట్టడంలో జీహెచ్‌ఎంసీ విఫలమైందనే ఆరోపణలు ఎప్పటి నుంచే ఉన్నాయి. ఈ వైఫల్యాన్ని ఆమె కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారానే తప్ప.. ఎంత మాత్రం ప్రశ్చాత్తాపం పడడం లేదని భాగ్యనగరవాసులు విమర్శిస్తున్నారు.

Updated Date - 2023-02-22T20:55:09+05:30 IST