Seethakka: మహిళలపై అమానవీయ ఘటనకు బీజేపీ ప్రభుత్వమే కారణం
ABN , First Publish Date - 2023-07-21T14:30:42+05:30 IST
మణిపూర్‌లో జరిగిన అమానవీయ ఘటనకు నిరసనగా ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో ములుగు జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై ధర్నా , రాస్తారోకో నిర్వహించారు.
ములుగు: మణిపూర్‌లో జరిగిన అమానవీయ ఘటనకు నిరసనగా ములుగు ఎమ్మెల్యే సీతక్క (MLA Seethakka) ఆధ్వర్యంలో ములుగు జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై ధర్నా , రాస్తారోకో నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ములుగు - హైదరాబాద్ జాతీయ రహదారిపై నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ... మహిళలపై అమానవీయ ఘటనకు బీజేపీ ప్రభుత్వమే కారణమన్నారు. మణిపూర్‌లో జరుగుతున్న ప్రతి మారణ హోమం వెనుక మోదీ ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపించారు. 50,000 మంది పోలీసులు ఉన్నా కూడా మణిపూర్ రాష్ట్రంలో మహిళలకు, మానవ హక్కులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మహిళలను అత్యంత కిరాతకంగా హింసించిన దోషులను కాపాడం కోసమే బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. అదానీ, అంబానీ ఆస్తులను కాపాడుకోవడం కోసం చేస్తున్న కుట్రలో భాగమే ఇది అని అన్నారు. మణిపూర్‌లో జరుగుతున్న అల్లర్లపై ప్రధాని మోదీ పెదవి విప్పక పోవడానికి కారణం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బీజేపీ ప్రభుత్వం వెంటనే మణిపూర్లో ఉన్న ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు.