ఇంటర్ సప్లిమెంటరీలో 59 %ఉత్తీర్ణత
ABN , Publish Date - Jun 19 , 2024 | 04:23 AM
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో ద్వితీయ సంవత్సరంలో 59శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఆన్లైన్ మూల్యాంకనంతో జరిగిన జాప్యం వల్ల కేవలం ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలను ఇంటర్ విద్యామండలి మంగళవారం విడుదల చేసింది.
ఫస్టియర్ సప్లిమెంటరీ, బెటర్మెంట్ ఫలితాలు 26న
ఇకపై రీకౌంటింగ్ ఉండదన్న అధికారులు
అమరావతి, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో ద్వితీయ సంవత్సరంలో 59శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఆన్లైన్ మూల్యాంకనంతో జరిగిన జాప్యం వల్ల కేవలం ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలను ఇంటర్ విద్యామండలి మంగళవారం విడుదల చేసింది. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వీవీ సుబ్బారావు వివరాలు వెల్లడించారు. జనరల్ కోర్సుల విద్యార్థులు 115319 మంది పరీక్షలు రాయగా 68,070(59శాతం) ఉత్తీర్ణులయ్యారని, ఒకేషనల్ విద్యార్థులు 11,871 మందికిగాను 6,798 (57శాతం) ఉత్తీర్ణత సాధించారని వివరించారు. మొత్తంగా 58.86శాతం ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు. కేటగిరీల వారీగా చూస్తే అబ్బాయిలు 59 శాతం, అమ్మాయిలు 58శాతం మంది పాసయ్యారు. ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలతో కలిపి చూస్తే జనరల్ విద్యార్థులు 87శాతం మంది, ఒకేషనల్ విద్యార్థులు 84శాతం మంది సెకండియర్లో ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షలను ఆన్లైన్ విధానంలో మూల్యాంకనం చేశామని, అందువల్ల రీకౌంటింగ్ ఉందని పేర్కొన్నారు. డిజిటల్ విధానంలో కౌంటింగ్ పొరపాట్లు రావన్నారు. రీవెరిఫికేషన్ కావాలంటే ఈ నెల 20 నుంచి 25లోగా దరఖాస్తు చేసుకోవాలని, ఒక్కో పేపరుకు రూ.వెయ్యి ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఫస్టియర్ సప్లిమెంటరీ, బెటర్మెంట్ ఫలితాలను ఈ నెల 26న విడుదల చేస్తామని చెప్పారు.