Amaravati : పవన్ చెప్పినా బేఫికర్!
ABN , Publish Date - Aug 19 , 2024 | 03:54 AM
కాలుష్య నియంత్రణ మండలిలో కొందరు అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలనే బేఖాతరు చేస్తున్నారు! వద్దన్న పని చేయడానికే సిద్ధమవుతున్నారు.. ప్రభుత్వం మారినా వారిలో వైసీపీ వాసన వీడడంలేదు!
కాలుష్య నియంత్రణ మండలిని వీడని వైసీపీ వాసన
బయో వేస్ట్ ప్లాంట్ల ఏర్పాటులో సీపీసీబీ మార్గదర్శకాలకు తూట్లు
విజయనగరంలో వైసీపీ నేత కంపెనీకి అనుమతివ్వాలని నిర్ణయం
అడ్డగోలు అనుమతికి డిప్యూటీ సీఎం నో
అయినా ఫైలు నడుపుతున్న అధికారులు
భారీగా ముడుపులు తీసుకోవడమే కారణం
అప్పిలేట్ అథారిటీ ఆదేశాలు బేఖాతర్
సీపీసీబీ వ ద్దన్నా, హైకోర్టులో కేసులున్నా డోంట్‌కేర్
నిబంధనలకు విరుద్ధంగా 7 ప్లాంట్ల ఏర్పాటుకు స్కెచ్
కూటమి సర్కారు వచ్చినా తీరు మార్చుకోని కొందరు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
కాలుష్య నియంత్రణ మండలిలో కొందరు అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలనే బేఖాతరు చేస్తున్నారు! వద్దన్న పని చేయడానికే సిద్ధమవుతున్నారు.. ప్రభుత్వం మారినా వారిలో వైసీపీ వాసన వీడడంలేదు! బయో వేస్ట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్ అనుమతుల విషయంలో ఇప్పటికీ అడ్డగోలుగానే వ్యవహరిస్తున్నారు. తాజాగా విజయనగరంలో జిల్లాలో వైసీపీ నేతకు చెందిన ఓ కంపెనీ ఏర్పాటుకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులివ్వడానికి సిద్ధమయ్యారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి వెళ్లడంతో అనుమతులివ్వకుండా కొద్దిరోజులుగా ఆపేశారు. ఆయనను ఏమార్చి ఇప్పుడు మళ్లీ సదరు ఫైల్‌ను అధికారులు మెల్లగా తెరపైకి తీసుకువస్తున్నారు. దీనంతటికీ కారణం వైసీపీ హయాం నుంచి పాతుకుపోయిన కొందరు అధికారులు ఇప్పటికే భారీ ఎత్తున ముడుపులు తీసుకోవడమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది కాకుండా రాష్ట్రంలో మరో ఏడు కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు భారీ స్కెచ్ వేశారు.
బయో వేస్ట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎక్కడపడితే అక్కడ.. ఎవరికి పడితే వారికి అనుమతులివ్వడానికి లేదు. ఇందుకు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ తీర్పులతోపాటు, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించింది. ఆయా మార్గదర్శకాలను అనుసరించి సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత ప్లాంట్స్‌కు అనుమతులు ఇవ్వాలి.
కానీ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వీటిని తుంగలో తొక్కి కొత్త ప్లాంట్స్‌కు అనుమతులిచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ మాజీ మంత్రి అండదండలతో విజయనగరం జిల్లాల్లో ఒక కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేసేశారు. ఈ కంపెనీకి బయో వేస్ట్ కలెక్షన్ చేసుకునేందుకు అనుమతివ్వాలని పీసీబీ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో పాటు పీసీబీ అధికారులకు భారీగా ముడుపులు ముట్టజెప్పారు. ప్రభుత్వం మారినా అధికారులు సదరు కంపెనీకి మేలు చేసే విధంగా బయో వేస్ట్ కలెక్షన్‌కు అనుమతులిచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
ఇదీ పరిస్థితి
రాష్ట్రంలో ఇప్పటికే 13 బయో వేస్ట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఆస్పత్రుల్లో ప్రతి పది వేల పడకలకు ఒక బయో వేస్ట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలి. ఒక ప్లాంట్ దాదాపు 150 కిలోమీటర్ల పరిధిలోని ఆస్పత్రుల నుంచి బయో వేస్ట్‌ను సేకరించవచ్చని సీపీసీబీ స్పష్టమైన మార్గదర్శకాలున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 13 ప్లాంట్లు ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాటయి ఉన్నాయి.
ఇక కొత్తగా ప్లాంట్స్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్రంలో ఎక్కడా అవకాశం లేదు. కానీ రాష్ట్ర పీసీబీ అధికారులు కొత్తగా మరో ఏడు ప్లాంట్స్ ఏర్పాటుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో జిల్లాల్లో రెండు ప్లాంట్స్ అందుబాటులో ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కలిసి 9600 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. విశాఖపట్నంలో పరిధిలో కూడా దాదాపు ఇంతే స్థాయిలో పడకలు అందుబాటులో ఉన్నాయి.
ఈ రెండు జిల్లాల్లో ట్రీట్‌మెంట్ ప్లాంట్స్ మధ్య 150 కిలోమీటర్ల పరిధి మాత్రమే ఉంది. ప్రస్తుతం ఒక్కో కంపెనీకి దాదాపు 30 వేల పడకలకు సంబంధించిన బయో వేస్ట్ ట్రీట్‌మెంట్ చేసే సామర్థ్యం ఉంది. కానీ కేవలం 10 వేల పడకలు అందుబాటులో ఉండడంతో ఆయా కంపెనీలు అక్కడి వరకే పరిమితమవుతున్నాయి. అవకాశం లేకపోయినా పీసీబీ అధికారులు మరో కంపెనీకి అనుమతులు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
హైకోర్టులో కేసులున్నా..
కొత్త ప్లాంట్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ హైకోర్టులో అనేక కేసులున్నాయి. అసలు కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతులిచ్చేందుకు పీసీబీకి అధికారం లేదని ఒక సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన హైకోర్టు గ్యాప్ అనాలసిస్ స్టడీ చేయాలని పీసీబీని ఆదేశించింది. దీంతో గ్యాప్ అనాలసిస్ స్టడీ చేసినా, క్షేత్రస్థాయిలో స్టడీని సక్రమంగా నిర్వహించలేదు.
దీంతో మళ్లీ ప్రభుత్వం ఏజెన్సీ ద్వారా గ్యాప్ అనాలసిస్ చేయించింది. ఇందుకు సదరు సంస్థకు కోటి రూపాయిల వరకు చెల్లించింది. సదరు ఏజెన్సీ గత ఏడాది స్టడీ రిపోర్టును సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు పంపించింది. రిపోర్టును పరిశీలించిన సీపీసీబీ గ్యాప్ అనాలసిస్ స్టడీ సక్రమంగా లేదని, మరోసారి స్టడీ చేయాలని పీసీబీని మరోసారి ఆదేశించింది. దాదాపు 20 పాయింట్లపై సీపీసీబీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీనిపై వెంటనే సమాధానం చెప్పాలని కూడా ఆదేశించింది. ప్రస్తుతం పీసీబీ అధికారులు అదే పనిలో ఉన్నారు.
మరోవైపు గ్యాప్ అనాలసి్‌సపై ప్రయివేటు వ్యక్తి హైకోర్టు వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఈ నెల 21 వ తేదీన హైకోర్టులో వాదనలున్నాయి. ఇన్ని కేసులు, ఇంత గందరగోళం ఉన్నప్పటికి పీసీబీ అధికారులు మాత్రం వైసీపీకి చెందిన కంపెనీకి బయో వేస్ట్ కలెక్షన్ చేసేందుకు అనుమతిచ్చేందుకు సిద్ధమయ్యారు. గత వారం ప్రత్యేక సమావేశం పెట్టి ఆర్డర్ ఇవ్వాలని నిర్ణయించారు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదులు అందడంతో వెనక్కి తగ్గారు. డిప్యూటీ సీఎం జోక్యం చేసుకున్నారని పీసీబీ అధికారులు ఆ రోజు వరకూ ఆర్డర్ ఇవ్వకుండా ఆపారు. కానీ ఇప్పటికీ సదరు ఫైల్‌ను తెరపైకి తీసుకువస్తున్నారు.
ఇవీ నిబంధనలు...
ఒక ప్రాంతంలో ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే అక్కడ గ్యాప్ అనాలసిస్ స్టడీ చేసి సీపీసీబీకి నివేదించాలి. అనుమతి వచ్చాక కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదంతో టెండర్లను ఆహ్వానించాలి. ఎల్1 వచ్చిన కంపెనీకి తొలుత కన్సెంట్ ఆఫ్ ఎస్టాబ్లి్‌షమెంట్‌కు అనుమతిస్తారు. అంటే ప్లాంట్ నిర్వహణకు పరికరాలు కొనుగోలు చేసుకుని, కంపెనీ ఏర్పాటు చేయాలి.
అది కూడా నివాస ప్రాంతాలకు దూరంగా, ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతంలో ఏర్పాటు చేయాలి. ప్లాంట్ నిర్మాణం పూర్తయ్యాక మరోసారి పీసీబీ అధికారులు.. అన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా అని దానిని పరిశీలిస్తారు. దీనిపై నివేదిక అందాకే సీపీబీసీ సీఎ్‌ఫవో(కన్సెంట్ ఆఫ్ ఆపరేషన్)కు అనుమతిస్తుంది.
ఆ అనుమతుల ఆధారంగా పీసీబీ అధికారులు ప్లాంట్ నిర్వహణను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు పాటించకుండానే, గ్యాప్ అనాలసిస్ స్టడీ చేయకుండానే, సీపీసీబీ ఆమోదం లేకుండా విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ప్లాంట్లకు గతంలో పీసీబీ అనుమతులు ఇచ్చేసింది.
దీనిపై కొంత మంది హైకోర్టు ఆదేశాల మేరకు అప్పిలేట్ అథారిటీని ఆశ్రయించారు. అథారిటీ కూడా మొత్తం వ్యవహారాన్ని అబయన్స్‌లో పెట్టమని ఆదేశించింది. ఆ ఆదేశాలను కూడా పీసీబీ అధికారులు బుట్టదాఖలు చేసి విజయనగరం, మరికొన్ని చోట్ల ప్లాంట్స్‌కు అనుమతులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి, పీసీబీని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందన్న సూచనలు వినిపిస్తున్నాయి.