AP elections: ఊరికిచ్చినమాట గుర్తుందా?
ABN , Publish Date - May 03 , 2024 | 12:51 AM
అప్పుడెప్పుడో ఎన్నికల ప్రచారానికి మా ఊరికొచ్చావ్. ఎన్నో హామీలిచ్చావ్. గెలిస్తే గ్రామానికి వచ్చి వెళ్లే ప్రధాన రోడ్డు వేస్తానన్నావ్. గ్రామానికి రోడ్లు, కాలువలు, నీళ్లు ఇస్తానన్నావ్. నిజంగా పనులన్నీ చేస్తావేమోనని మేమంతా సంబరపడ్డాం. పోలింగ్ రోజు ఎగబడి ఓట్లు వేశాం. గెలిచావ్. ఆనక కనిపించకుండా పోయావ్. ఎమ్మెల్యేగారు..! అసలు మా ఊరంటూ ఒకటి ఉందని గుర్తుందా? అని ఆ ఊరి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇదెక్కడి పాలనో? ఈయనేమీ పాలకుడో అంటూ ఈసడించుకుంటున్నారు.

హామీలు మరచిన ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి
ఎంబీపల్లికి ఐదేళ్లలో పైసా ఖర్చుచేయని దుస్థితి
అనంతపురం రూరల్: అప్పుడెప్పుడో ఎన్నికల ప్రచారానికి మా ఊరికొచ్చావ్. ఎన్నో హామీలిచ్చావ్. గెలిస్తే గ్రామానికి వచ్చి వెళ్లే ప్రధాన రోడ్డు వేస్తానన్నావ్. గ్రామానికి రోడ్లు, కాలువలు, నీళ్లు ఇస్తానన్నావ్. నిజంగా పనులన్నీ చేస్తావేమోనని మేమంతా సంబరపడ్డాం. పోలింగ్ రోజు ఎగబడి ఓట్లు వేశాం. గెలిచావ్. ఆనక కనిపించకుండా పోయావ్. ఎమ్మెల్యేగారు..! అసలు మా ఊరంటూ ఒకటి ఉందని గుర్తుందా? అని ఆ ఊరి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇదెక్కడి పాలనో? ఈయనేమీ పాలకుడో అంటూ ఈసడించుకుంటున్నారు. ఇదీ రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్ మండలం, ఆలమూరు పంచాయతీ పరిధిలోని ఎం.బీ.పల్లి గ్రామస్థుల ఆవేదన. గ్రామం ఏమైనా మారుమూల ప్రాంతంలో ఉందా అంటే అదీ కాదు. అయినా అభివృద్ధిని మాత్రం పాలకులు విస్మరించారు. గ్రామంలో ఐదేళ్ల కాలంలో ఒక్క పైసా ఖర్చు చేయలేదంటే అభివృద్ధి ఏమేరకు జరిగిందో అర్థం చేసుకోవచ్చు.
జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న మండలంలోని సమస్యలే ఇలా పరిష్కరిస్తున్నారంటే ఇక దూరంగా ఉన్న ప్రాంతాల్లోనే సమస్యలు ఎలా రూపుమాపుతున్నారో ఆ పాలకులకే తెలియాలి.
సమస్యలు పట్టించుకునేదెవరు ?
గ్రామంలో ఎస్సీ, బీసీ, ఓసీ కాలనీలున్నాయి. దాదాపు 80 కుటుంబాలు నివాసముంటున్నాయి. గ్రామం చిన్నదే అయినా సమస్యలను పరిష్కరించే నాథుడే లేడు. గ్రామానికి వెళ్లేందుకు సరైన రోడ్డు లేకపోవడం ప్రధాన సమస్య. అనంతపురం- ఆలమూరు రోడ్డు నుంచి గ్రామానికి 4.5కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రోడ్డుకు మాత్రం మోక్షం కలగడం లేదు. టీడీపీ హయాంలో దాదాపు రూ.1.9కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టారు. రోడ్డు వేసేందుకు మట్టి పనులు పూర్తి అయ్యాయి. ఊళ్లో నుంచి అర్ధబాగం చిన్న సైజు కంకర కూడా వేశారు. ఆ తరువాత ఎన్నికలు రావడంతో రోడ్డు నిర్మాణం ఆగిపోయింది. ఆ తరువాత వైసీపీ అధికారంలోకి రావడంతో పాలకులు రోడ్డు సమస్యతో పాటు గ్రామంలోని సమస్యలు అలానే వదిలేశారు. ఐదేళ్ల కాలంలో పాల కులు గ్రామానికి వెళ్లింది కానీ స్థానిక సమస్యలు చర్చించి..వాటి పరిష్కారానికి ఒక్క పైసా ఖర్చు చేసిన దాఖలు లేవని గ్రామస్థులు అంటున్నారు. గ్రామంలో రోడ్లు, కాలువలు లేక మురుగు నీరు రోడ్డుపైనే పారుతోంది. ఏడాది కిందట కురిసిన వర్షాలకు ప్రధాన రోడ్డు గుంతలు జలమయమైపోయాయి. దీంతో గ్రామస్థులే గుంతలు పూడ్చుకున్నారు. అయినా రోడ్డు నిర్మాణం జరగలేదు. స్థానిక ప్రజాప్రతినిధి తరచూ తన సొంత గ్రామానికి ఆలమూరు ప్రధాన రోడ్డుపైనే ప్రయాణం సాగిస్తున్నారు. అప్పుడైనా మా గ్రామానికి ఇచ్చిన మాటలు ఆయనకు గుర్తుకురాకపోవడం తాము చేసుకున్న పాపమని ఆ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..