Share News

AP News: అనంతపురం జిల్లాలో విద్యాశాఖ వింత పోకడ

ABN , Publish Date - Jan 23 , 2024 | 08:47 AM

అనంతపురం: జిల్లాలో విద్యాశాఖలో వింత పోకడ నెలకొంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం జిల్లాలో పర్యటన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

AP News: అనంతపురం జిల్లాలో విద్యాశాఖ వింత పోకడ

అనంతపురం: జిల్లాలో విద్యాశాఖలో వింత పోకడ నెలకొంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం జిల్లాలో పర్యటన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలకు కాంపెన్సేటరీ సెలవు దినముగా ప్రకటించినట్లు అధికారులు మెసేజ్ పంపారు. దీంతో ఈరోజు జరగాల్సిన ఎఫ్ఏ-3 (FA-3) పరీక్షలు వాయిదా వేస్తూ.. ఈనెల 31న పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. జిల్లా విద్యాశాఖ అధికారులు అధికార వైసీపీకి సాగిలపడుతున్నారు.

పాఠశాలలకు సెలవులు ప్రకటించి... బస్సులను ముఖ్యమంత్రి జగన్ పర్యటనకు పంపాలంటూ ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లపై విద్యాశాఖ అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. కాగా సీఎం పర్యటన కోసం పాఠశాలలకు సెలవులు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండలో పర్యటించనున్నారు. వైఎస్సార్‌ ఆసరా నాలుగో విడత రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.

సీఎం జగన్ పర్యటన షెడ్యూల్..

మంగళవారం ఉదయం 9 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి సీఎం బయల్దేరి 9.45 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారు. 10 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్లో బయల్దేరి 10.30 గంటలకు ఉరవకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకుంటారు.. ఉదయం 10.40 గంటలకు అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో బయల్దేరి 10.50 గంటలకు అనంతపురం బైపాస్ సమీపంలోని బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకుంటారు.. ఉదయం 10.55 గంటలకు స్వయం సహాయక సంఘాల మహిళలతో మాట్లాడతారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు.

ఆ తరువాత వైఎస్సార్ ఆసరా నాలుగో విడత కింద సీఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి సంఘాల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేస్తారు. అటు తరువాత మెగా చెక్ విడుదల చేస్తారు. మధ్యాహ్నం 12.35 గంటలకు బహిరంగ సభ వద్ద నుంచి బయల్దేరి 12.45 గంటలకు హెలి ప్యాడ్ వద్దకు చేరుకుంటారు.. 1.45 గంటల వరకు స్థానిక నాయకులతో భేటీ.. మధ్యాహ్నం 1.50 గంటలకు హెలికాప్టర్లో బయల్దేరి 2.20 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారు. 2.30గంటలకు అక్కడి నుంచి విమానంలో గన్నవరం బయలుదేరతారు.

Updated Date - Jan 23 , 2024 | 08:47 AM