Share News

AP ELECTIONS COUNTING : నేడే తెలిసేది!

ABN , Publish Date - Jun 04 , 2024 | 12:34 AM

నరాలు తెగే ఉత్కంఠకు తెరపడే సమయం వచ్చింది. ఈవీఎంలలో నిక్షిప్తమైన ప్రజాతీర్పు మరికొన్ని గంటల్లో బహిర్గతం కానుంది. ఓటరు జాబితా తయారీ మొదలు.. పోలింగ్‌ ముగిసేవరకూ మునుపెన్నడూ లేనన్ని ప్రలోభాలు.. బెదిరింపులు, దాడులు చోటు చేసుకున్నాయి. అన్నింటినీ ఓ కంట కనిపెట్టిన ఓటరు.. మీట నొక్కి తన నిర్ణయం ప్రకటించాడు. అదేమిటో మంగళవారం తేలిపోతుంది. జిల్లాలోని 8 అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గం ఫలితాలు సాయంత్రానికల్లా వచ్చే అవకాశం ఉంది. ఒకటి రెండు నియోజకవర్గాలు ఆలస్యమైనా.. రాత్రికి మాత్రం తుది ఫలితాలు అధికారికంగా బయటకు వస్తాయి. మే 13న పోలింగ్‌ ముగిశాక.. మూడు వారాల...

AP ELECTIONS COUNTING :  నేడే తెలిసేది!
Police checking the vehicles going into JNTU

కౌంటింగ్‌కు సిద్ధమైన యంత్రాంగం

మూడు వారాల ఉత్కంఠకు నేటితో తెర

వైసీపీ.. పైకి గంభీరం.. లోలోన గుబులు

గెలుపుపై కూటమి అభ్యర్థుల్లో విశ్వాసం

జిల్లావ్యాప్తంగా భారీ భద్రతా చర్యలు

అనంతపురం, జూన 3(ఆంధ్రజ్యోతి): నరాలు తెగే ఉత్కంఠకు తెరపడే సమయం వచ్చింది. ఈవీఎంలలో నిక్షిప్తమైన ప్రజాతీర్పు మరికొన్ని గంటల్లో బహిర్గతం కానుంది. ఓటరు జాబితా తయారీ మొదలు.. పోలింగ్‌ ముగిసేవరకూ మునుపెన్నడూ లేనన్ని ప్రలోభాలు.. బెదిరింపులు, దాడులు చోటు చేసుకున్నాయి. అన్నింటినీ ఓ కంట కనిపెట్టిన ఓటరు.. మీట నొక్కి తన నిర్ణయం ప్రకటించాడు. అదేమిటో మంగళవారం తేలిపోతుంది. జిల్లాలోని 8 అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గం ఫలితాలు సాయంత్రానికల్లా వచ్చే అవకాశం ఉంది. ఒకటి రెండు నియోజకవర్గాలు ఆలస్యమైనా.. రాత్రికి మాత్రం తుది ఫలితాలు అధికారికంగా బయటకు వస్తాయి. మే 13న పోలింగ్‌ ముగిశాక.. మూడు వారాల


పాటు ఫలితాల కోసం నిరీక్షించాల్సి వచ్చింది. చాలామంది అభ్యర్థులు పోలింగ్‌ ముగిసింది మొదలు నిద్రలేని రాత్రులు గడిపారు. జనం సైతం గెలుపోటములపై చర్చలకు దిగారు. కౌంటింగ్‌కు మూడు రోజుల ముందు వచ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌పై సైతం చర్చ కొనసాగింది. గెలుపోటములు ఎలా ఉంటాయోనన్న సందిగ్ధంలో పడ్డారు. మెజార్టీ సర్వేలు కూటమిదే అధికారమని తేల్చడంతో అధికార వైసీపీ అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. బయటికి మాత్రం గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.

కూటమిలో ధీమా

టీడీపీ కూటమి అభ్యర్థులు జిల్లాలో మెజార్టీ స్థానాలు తమవేనన్న ధీమాలో ఉన్నారు. పోలింగ్‌ ముగిసింది మొదలు తెలుగు తమ్ముళ్లల్లో జోష్‌ కనిపిస్తోంది. పోలింగ్‌ ఎక్కువ శాతం నమోదుకావడం, ఉద్యోగులు, నిరుద్యోగ యువత అత్యధికంగా పోలింగ్‌లో పాల్గొనడం తమకు అనుకూలమని వారు భావిస్తున్నారు. మరోవైపు సూపర్‌సిక్స్‌ పథకాలు మహిళలను పెద్ద ఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు వచ్చేలా చేశాయని అంటున్నారు. అందుకే ఎంపీతోపాటు మెజార్టీ అసెంబ్లీ స్థానాలు కూటమికే దక్కుతాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మంగళవారం ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. ఆ తరువాత 8.30 గంటలకు ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు మొదలౌతుంది. మొదటి రౌండులో మంచి మెజార్టీ సాధించినవారే విజయం సాధిస్తారని భావిస్తున్నారు. తొలి రౌండ్‌తోనే ఏఏ స్థానాలు ఎటువైపు వెళతాయో దాదాపుగా తేలిపోతుందని విశ్లేషకులు అంటున్నారు. ప్రభుత్వంపై ఉద్యోగవర్గాల్లో వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో ఓట్ల రూపంలో బయటపడుతుందని కూటమి అభ్యర్థులు అంటున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు తమ గెలుపును ఖరారు చేస్తాయని కూడా బలంగా నమ్ముతున్నారు.


కొత్తోళ్లు.. పాతోళ్లు..

సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎంపిక విషయంలో వైసీపీ, కూటమి ఎత్తుకు పై ఎత్తులు వేశాయి. వైసీపీ కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చింది. టీడీపీ అధినాయకత్వం ఢీ.. అన్నట్లుగా కొత్త అభ్యర్థులను రంగంలోకి దించింది.

- జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా... ఇప్పటి వరకూ ఓటమి ఎరుగని మాజీ మంత్రి పరిటాల సునీతను రాప్తాడులో కూటమి అభ్యర్థిగా బరిలో దించారు. వైసీపీ నుంచి సిటింగ్‌ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి పోటీలో ఉన్నారు.

- అనంతపురం అర్బన నుంచి టీడీపీ కూటమి అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్‌ను కొత్తగా బరిలో దించారు. వైసీపీ నుంచి మరోమారు సిటింగ్‌ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డినే పోటీలో నిలిపారు.

- కళ్యాణదుర్గం నుంచి టీడీపీ కూటమి అభ్యర్థిగా అమిలినేని సురేంద్రబాబును కొత్తగా పోటీలో నిలిపారు. వైసీపీ నుంచి అనూహ్యంగా అనంతపురం ఎంపీ రంగయ్యను అసెంబ్లీ బరిలో నిలిపారు.

- రాయదుర్గం నుంచి మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులును మరోమారు టీడీపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేయించారు. వైసీపీ నుంచి అనూహ్యంగా సిటింగ్‌ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని తప్పించి.. ఏపీఐఐసీ చైర్మన మెట్టు గోవిందురెడ్డిని బరిలో నిలిపారు.

- ఉరవకొండలో మరోసారి ఆ ఇద్దరి మధ్యనే పోటీ నెలకొంది. టీడీపీ కూటమి అభ్యర్థిగా సిటింగ్‌ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌, వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి బరిలో ఉన్నారు.

- గుంతకల్లు నుంచి వైసీపీ సిటింగ్‌ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డికి మరో అవకాశం ఇచ్చారు. టీడీపీ కూటమి అభ్యర్థిగా వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన మంత్రి గుమ్మనూరు జయరాంను బరిలో దించారు.

-శింగనమల నుంచి వైసీపీ సిటింగ్‌ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని తప్పించి.. కొత్త అభ్యర్థి వీరాంజనేయులును పోటీలో నిలిపారు. కూటమి టీడీపీ అభ్యర్థిగా రెండోసారి బండారు శ్రావణిశ్రీకి అవకాశం కల్పించారు.

- తాడిపత్రి నియోజకవర్గం నుంచి మరోసారి ఆ ఇద్దరే పోటీపడ్డారు. టీడీపీ కూటమి అభ్యర్థిగా జేసీ అశ్మితరెడ్డి పోటీ చేశారు. వైసీపీ నుంచి సిటింగ్‌ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బరిలో దిగారు.


ఇవీ.. ఓట్లు..!

జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 26,900 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేశారు. జిల్లావ్యాప్తంగా 20,18,162 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 9,97,792 మంది పురుషులు, 10,20,124 మంది మహిళలు. 246 మంది ఇతరులు. ఓటు హక్కు వినియోగించుకున్నవారు 16,36,648 మంది. వీరిలో 8,17,536 మంది పురుషులు, 8,19,004 మంది మహిళలు.

భారీ భద్రత

పోలింగ్‌ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కౌంటింగ్‌ ప్రశాంతంగా సాగేలా, శాంతిభద్రతల పరిరక్షణ దిశగా కలెక్టర్‌, ఎస్పీ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. భారీ పోలీసు బలగాలను మొహరించారు. ఎస్పీ గౌతమిశాలి నేతృత్వంలో కౌంటింగ్‌ కేంద్రం వద్ద దాదాపు 3 వేల మంది భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు. ఇద్దరు అదనపు ఎస్పీలు, 18 మంది డీఎస్పీలు, 60 మంది సీఐలు, 90 మంది ఎస్‌ఐలు, 2 వేల మంది ఏఎ్‌సఐ, హెడ్‌ కానిస్టేబుల్‌, హోంగార్డులు, దాదాపు 1000 మందితో కూడిన 26 ప్లటూనల కేంద్ర బలగాలు జిల్లాలో మోహరించాయి. కౌంటింగ్‌ ఏజెంట్లయినా, అభ్యర్థులైనా చిన్నపాటి ఘర్షణలకు పాల్పడినా వెంటనే అరెస్టు చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 04 , 2024 | 12:34 AM