విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించండి
ABN , Publish Date - Nov 26 , 2024 | 04:07 AM
భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటితరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మంచి చదువు, ఉద్యోగం, భవిష్యత్తుతోపాటు నైతిక విలువలు కూడా అవసరమని, అప్పుడే మంచి సమాజం ఆవిష్కృతమవుతుందని చెప్పారు.
భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటితరం తెలుసుకోవాలి
చాగంటి కోటేశ్వరరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వినతి
మంత్రి లోకేశ్‌నూ కలిసిన చాగంటి
అమరావతి, తాడేపల్లి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటితరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మంచి చదువు, ఉద్యోగం, భవిష్యత్తుతోపాటు నైతిక విలువలు కూడా అవసరమని, అప్పుడే మంచి సమాజం ఆవిష్కృతమవుతుందని చెప్పారు. ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన తర్వాత తొలిసారిగా చాగంటి కోటేశ్వరరావు సోమవారం అమరావతి సచివాలయంలో సీఎంను కలిశారు. విద్యార్థులు, యువతలో నైతిక విలువలు పెంచేందుకు ప్రయత్నించాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ప్రవచనాలు, ప్రత్యేక కార్యక్రమాల ద్వారా యువతలో మంచి పెంచే ప్రయత్నం చేయొచ్చన్నారు. సుమతి, వేమన శతకాలు, నీతి కథలు, మంచి మాటలు, ప్రత్యేక క్లాసుల ద్వారా విద్యార్థులు, యువతలో విలువలు పెంచేందుకు ప్రయత్నం చేస్తామని, విద్యాశాఖలో చేపట్టే కార్యక్రమాలపై ఇప్పటికే మంత్రి లోకేశ్‌తో చర్చించానని చాగంటి తెలిపారు. అలాగే, ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేశ్‌ను చాగంటి మర్యాదపూర్వకంగా కలిశారు. ‘మహిళలు, పెద్దలు, గురువులపై విద్యార్థుల్లో గౌరవం పెంపొందించేలా పాఠ్యాంశాల రూపకల్పనకు మీ అమూల్యమైన సలహాలు అవసరం’ అని లోకేశ్ పేర్కొనగా, తనవంతు సలహాలు, సహకారం అందిస్తానని చాగంటి తెలిపారు.