CM Chandrababu: మన్మోహన్ సింగ్ భావజాలం శాశ్వతంగా నిలిచి ఉంటుంది
ABN , Publish Date - Dec 27 , 2024 | 02:53 PM
CM Chandrababu: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం న్యూఢిల్లీలో మన్మోహన్ సింగ్ భౌతిక కాయాన్ని సీఎం చంద్రబాబు సందర్శించి.. ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 27: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ఉదయం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివానంలో ఆయన పార్థివ దేహానికి సీఎం చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మన్మోహన్ సింగ్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు విలేకర్లతో మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థిక వేత్త అని అభివర్ణించారు.
దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయన దశ, దిశ చూపారని గుర్తు చేశారు. దేశం కోసం మన్మోహన్ సింగ్ అవిశ్రాంతంగా శ్రమించారన్నారు. ఆయన సేవలను ఈ దేశం ఎన్నటికి మరవదని తెలిపారు. ఆయన మరణం చాలా బాధకరమన్నారు. అనేక ఉన్నత పదవులను మన్మోహన్ సింగ్ సమర్థవంతంగా నిర్వహించారని పేర్కొన్నారు. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలోనే ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, ఆధార్, విద్యా హక్కు చట్టం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. మన్మోహన్ సింగ్ మంచి రాజకీయ నాయకుడని ఆయనపై సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. మన్మోహన్ సింగ్ భావజాలం శాశ్వతంగా నిలిచి ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇక ప్రజల సందర్శనార్థం శనివారం ఉదయం ఏఐసీసీ కార్యాలయానికి మన్మోహన్ సింగ్ బౌతిక కాయాన్ని తీసుకు వెళ్లనున్నారు. రేపు ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ఆయన పార్దివ దేహాన్ని ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం ఏఐసీసీ కార్యాలయం నుంచి రాజ్ ఘాట్ వరకు మన్మోహన్ సింగ్ అంతియ యాత్ర నిర్వహించనున్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. వృద్ధాప్య కారణంగా అనారోగ్య సమస్యలో ఆయన బాధపడుతున్నారు. ఆ క్రమంలో నిన్న రాత్రి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ని కుటుంబ సభ్యులు న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ మన్మోహన్ సింగ్ మరణించారు.
పీవీ నరసింహరావు కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా పని చేసిన ఆయన దశాబ్ద కాలం పాటు దేశ ప్రధానిగా కూడా దేశానికి విశేష సేవలు అందించారు. మన్మోహన్ సింగ్‌కి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఓ కుమార్తె అమెరికలో ఉన్నారు. ఆమె ఈ రోజు అర్థరాత్రి.. న్యూఢిల్లీకి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి. అందుకోసం రాజ్ ఘాట్ సమీపంలో కేంద్రం ఏర్పాట్లు చేస్తుంది. రేపు ఉదయం అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగనున్నాయి.
For AndhraPradesh News And Telugu News