Share News

Andhra Pradesh Assembly : స్పీకర్‌గా అయ్యన్న

ABN , Publish Date - Jun 17 , 2024 | 04:30 AM

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌గా టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే, బీసీ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారుచేసినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి 24,676 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టడం ఇది ఏడోసారి.

Andhra Pradesh Assembly : స్పీకర్‌గా అయ్యన్న

  • టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యేను ఖరారు చేసిన బాబు

  • డిప్యూటీ స్పీకర్‌గా జనసేన ఎమ్మెల్యే

  • రేసులో పంతం నానాజీ.. లోకం మాధవి

  • చీఫ్‌ విప్‌గా ధూళిపాళ్ల నరేంద్ర!

  • శాసనసభ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు

అమరావతి, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌గా టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే, బీసీ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారుచేసినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి 24,676 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టడం ఇది ఏడోసారి. 1982లో పార్టీ ఆవిర్భావ సమయం నుంచీ టీడీపీలో ఉన్నారు. 1983, 85, 94, 99, 2004, 14, 24ల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1996లో అనకాపల్లి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు మంత్రివర్గాల్లో పనిచే శారు. ఇటీవలి మంత్రివర్గ ఏర్పాటులోనే ఆయనకు బెర్తు లభించడం ఖాయమని ఆ పార్టీ వర్గాలు భావించాయి. కానీ సామాజిక సమీకరణల దృష్ట్యా అవకాశం దక్కలేదు. గత ఐదేళ్లలో అధికార వైసీపీపైన, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపైనా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.

దీంతో ఆయనపై పలు అక్రమ కేసులు బనాయించారు. నిర్భయ చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. ఇరిగేషన్‌ భూమికి ఫోర్జరీ ధ్రువపత్రాలతో ఎన్‌వోసీ తీసుకున్నారన్న ఆరోపణలతో సీఐడీ పోలీసులు 2022 నవంబరు 2వ తేదీన అర్ధరాత్రి దాటాక ఇంటి గోడలు దూకి మరీ ఆయన్ను, ఆయన కుమారుడిని అరెస్టు చేయడం తెలిసిందే. తాజా ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం అనంతరం ఏర్పాటైన మంత్రివర్గంలో చంద్రబాబు ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. దరిమిలా స్పీకర్‌ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. స్పీకర్‌ పదవిని కోరుతూ ఒకరిద్దరు సీనియర్లు ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడగా.. అయ్యన్నను ఎంపిక చేస్తున్నట్లు ఆయన వారికి తెలిపారు. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1999లో ఉత్తరాంధ్రకే చెందిన ప్రతిభాభారతికి స్పీకర్‌గా అవకాశం కల్పించిన విషయం విదితమే. ఇప్పుడు మరోసారి అదే ప్రాంతానికి చెందిన అయ్యన్నపాత్రుడికి ఆ పదవి దక్కనుంది.

Updated Date - Jun 17 , 2024 | 04:30 AM