Balineni Srinivasa Reddy : జిల్లా అధ్యక్ష పదవి నాకొద్దు
ABN , Publish Date - Sep 13 , 2024 | 03:34 AM
ఓటమి భారంతో ఆపసోపాలు పడుతున్న ప్రకాశం జిల్లా వైసీపీలో సరికొత్త సంక్షోభం ఏర్పడింది. ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనకు పార్టీలో పదవులొద్దని.. అసలే పనీ చేయలేనని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కే తేల్చిచెప్పారు.
పార్టీకి పనిచేయలేను
జగన్‌కు తేల్చిచెప్పిన బాలినేని!
జనసేన వైపు చూపు?
ఒంగోలు, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఓటమి భారంతో ఆపసోపాలు పడుతున్న ప్రకాశం జిల్లా వైసీపీలో సరికొత్త సంక్షోభం ఏర్పడింది. ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనకు పార్టీలో పదవులొద్దని.. అసలే పనీ చేయలేనని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కే తేల్చిచెప్పారు. దీంతో దిక్కుతోచని మాజీ సీఎం.. జిల్లా పార్టీ నాయకులందరినీ శుక్రవారం తాడేపల్లి రావాలని కబురు పంపారు. ఈ పరిణామం.. బాలినేని జనసేనలో చేరే ఆలోచనలో ఉన్నారన్న ఊహాగానాలకు కూడా బలం చేకూరుస్తోంది.
గత ఎన్నికల్లో జిల్లాలో పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ వైసీపీ జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి రాజీనామా చేశారు. తిరుపతి జిల్లాకు చెందిన, గత ఎన్నికల్లో ఒంగోలు లోక్‌సభ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని జిల్లా అధ్యక్షుడిని చేయాలని తొలుత జగన్ భావించారు. ఇది తెలుసుకుని స్థానికేతరుడిని తమపై ఎలా రుద్దుతారని బాలినేని, మరికొందరు నాయకులు నిలదీశారు. దీంతో వెనక్కి తగ్గిన జగన్.. బాలినేనికి ఫోన్ చేసి తనను కలవాలని సూచించారు. బుధవారం సాయంత్రం తాడేపల్లిలో జగన్‌ను బాలినేని కలిశారు.
జిల్లా అధ్యక్షుడిగా మిమ్మల్ని నియమిస్తానని అనగా, బాలినేని తిరస్కరించినట్లు సమాచారం. తనకు జిల్లా అధ్యక్ష పదవి వద్దని, పైగా పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొననని ఆయన తేల్చిచెప్పినట్లు తెలిసింది. దీంతో తక్షణమే జిల్లా నాయకులతో సమావేశం కావాలని జగన్ నిర్ణయించారు. శుక్రవారం తాడేపల్లిలో జగన్‌తో జరిగే భేటీకి రావాలని గత ఎన్నికల్లో గెలుపొందిన దర్శి, యర్రగొండపాలెం ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాదరెడ్డి, తాడిపర్తి చంద్రశేఖర్ తదితరులకు సమాచారం పంపింది. బాలినేని,, జనసేనలో చేరే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.