Share News

AP: చెట్టును ఢీకొట్టిన కారు.. వృద్ధ దంపతుల మృతి..

ABN , Publish Date - May 16 , 2024 | 05:08 AM

పెళ్లైన నాటి నుంచి కష్టసుఖాల్లో ఒకరికి ఒకరుగా ఉన్న ఆ దంపతులు చివరికి చావులోనూ ఒక్కటిగానే ఉన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం ముష్టికుంట్ల సమీపంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కొత్తూరు సూర్యనారాయణ(92), రుక్మిణీ(86) అనే దంపతులు దుర్మరణం చెందారు. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన ఘటనలో వృద్ధ దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా వారితో పాటు ఉన్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

AP: చెట్టును ఢీకొట్టిన కారు.. వృద్ధ దంపతుల మృతి..

  • మరో ఇద్దరికి తీవ్ర గాయాలు, ప్రమాద తీవ్రతకు కారు దహనం

బోనకల్‌, మే 15: పెళ్లైన నాటి నుంచి కష్టసుఖాల్లో ఒకరికి ఒకరుగా ఉన్న ఆ దంపతులు చివరికి చావులోనూ ఒక్కటిగానే ఉన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం ముష్టికుంట్ల సమీపంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కొత్తూరు సూర్యనారాయణ(92), రుక్మిణీ(86) అనే దంపతులు దుర్మరణం చెందారు. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన ఘటనలో వృద్ధ దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా వారితో పాటు ఉన్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామానికి చెందిన కొత్తూరు సూర్యనారాయణ, రుక్మిణి దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. డిగ్రీ కళాశాల అధ్యాపకునిగా వేర్వేరు ప్రాంతాల్లో పని చేసిన సూర్యనారాయణ మధిరలో స్థిరపడ్డారు. సూర్యనారాయణ ముగ్గురు కుమారుల్లో చిన్న కొడుకు మధిరలో మిగిలిన ఇద్దరు ఖమ్మంలో నివాసముంటున్నారు.


వృద్ధాప్యంలో ఉన్న సూర్యనారాయణకు సహాయకునిగా నాగరాజు అనే వ్యక్తిని కేర్‌ టేకర్‌గా పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా, మనవడు అనిల్‌, కేర్‌టేకర్‌ నాగరాజుతో కలిసి సూర్యనారాయణ దంపతులు బుధవారం కారులో మధిర నుంచి ఖమ్మం బయలుదేరారు. అయితే, వీరు ప్రయాణిస్తున్న కారు ముష్టికుంట్ల సమీపంలో అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో సూర్యనారాయణ దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనిల్‌, నాగరాజు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు పెట్రోలు పైపు పగిలి కారులో మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు దంపతుల మృతదేహాలను బయటికి తీశారు. తీవ్రంగా గాయపడిన అనిల్‌, నాగరాజును ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మంటలు మరింత చెలరేగడంతో కారు పూర్తిగా దహనమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - May 16 , 2024 | 05:08 AM