ఆర్థిక ఇబ్బందులు చూస్తే బాధేస్తోంది: చంద్రబాబు
ABN , Publish Date - Dec 24 , 2024 | 04:18 AM
మైనారిటీ వర్గాలకు తానెప్పుడూ అండగా ఉంటానని, వారి సంక్షేమం, భద్రతకు ప్రాధాన్యం ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

6 నెలలుగా రాత్రింబవళ్లూ ఆలోచిస్తున్నా.. ఐదేళ్ల విధ్వంసానికి పరిష్కారం దొరకట్లేదు
గతంలో మూడుసార్లు సీఎంగా పనిచేసినా ఇప్పుడే చాలా కష్టంగా అనిపిస్తోంది
ప్రజలు నాకు ఓ బాధ్యత అప్పగించారు.. రాష్ట్రానికి పునర్‌వైభవం తీసుకువస్తా
మైనారిటీలు, పేదలకు అండగా ఉంటా.. వారి సంక్షేమం, భద్రతకు ప్రాధాన్యం
ఐదేళ్ల చెడు మళ్లీ జరక్కూడదు.. సెమీ క్రిస్మస్ వేడుకలలో ముఖ్యమంత్రి చంద్రబాబు
విజయవాడ, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): మైనారిటీ వర్గాలకు తానెప్పుడూ అండగా ఉంటానని, వారి సంక్షేమం, భద్రతకు ప్రాధాన్యం ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఐదేళ్లు జరిగిన చెడును ఆలోచించి మళ్లీ అది జరగకుండా ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పేదల పట్ల, ధర్మాన్ని నమ్మినవారి పట్ల దేవుడు ఎల్లప్పుడూ అండగా ఉంటాడని, మళ్లీ మంచి రోజులు వచ్చాయని, మీ అందరికీ అనుక్షణం అండగా ఉంటానన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆఽధ్వర్యంలో సోమవారం విజయవాడ ఏ1 కన్వెన్షన్‌లో సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి పాల్గొన్నారు. లోక రక్షకుడైన ప్రభువు కరుణ, కటాక్షాలు ఉండాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని చంద్రబాబు అన్నారు. ప్రేమ, కరుణ, సేవకు ప్రతీక క్రైస్తవమన్నారు. ఎన్టీఆర్ మిషనరీ కాలేజీలో చదువుకున్నారని గుర్తుచేసుకున్నారు. పశువుల పాకలో పుట్టి, గొర్రెల కాపరిగా పెరిగి నిరాడంబరతను చాటుకున్న ప్రజా రక్షకుడు ఏసు అని అన్నారు. నమ్మిన వారి కోసం బలిదానాలకు సైతం వెనుకాడని క్రీస్తు గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ ఉత్తేజంగా తీసుకోవాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు తానెప్పుడొచ్చినా స్ఫూర్తిదాయక సందేశాన్ని పొందుతుంటానన్నారు. ‘సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా చేయాలన్న దానిపై ముందుకు వెళుతుంటే ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. నేను నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాను. మూడుసార్లు కష్టం అనిపించలేదు.
ఇప్పుడు చాలా కష్టమనిపిస్తోంది. ఆర్థిక ఇబ్బందులు చూస్తే బాఽధేస్తోంది. ఈ ఆరు నెలల నుంచి రాత్రింబవళ్లూ ఆలోచిస్తున్నా, పట్టుదలతో ప్రయత్నిస్తున్నా దారి దొరకలేదంటే ఐదేళ్లు ఎంత విధ్వంసం జరిగిందో ఆలోచించాలి. ఆర్థిక ఇబ్బందులున్నా పాస్టర్లకు పెట్టిన గౌరవ వేతనాన్ని చెల్లించాలని సంతకం చేశాను. క్రైస్తవ మిషనరీల కోసం ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని, చర్చిల నిర్మాణం, పునర్నిర్మాణం కోసం ప్రతిపాదనలు వస్తున్నాయి. రానున్న రోజులలో సాధ్యమైనంత మేరకు పూర్తి చేస్తాం’ అని అన్నారు.
శాంతిమార్గాన్ని అనుసరించాలి
‘ప్రతి ఒక్కరూ శాంతిమార్గాన్ని అనుసరించాలి. ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి. ఈర్ష్యాద్వేషాలను పారదోలాలి. అబద్ధం, లంచాల వంటి పాపాలకు దూరంగా ఉండాలి. ఈ డిసెంబరులో ప్రపంచ వ్యాప్తంగా జరుపుకొనే అతి పెద్ద పండుగ క్రిస్మస్. నేను మొదటిసారి సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ప్రభుత్వం తరఫున సెమీక్రిస్మస్ కార్యక్రమాన్ని జరపాలని నిర్ణయించాం. గుంటూరులో క్రైస్తవ భవన్ కోసం 2 ఎకరాలు కేటాయించటంతో పాటు నిర్మాణం కోసం రూ.10 కోట్లు ఖర్చు చేశాం. త్వరలోనే దానిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తాం. విజయవాడలోనే సెయింట్ బసిలికా చర్చికి రూ.1.5 కోట్లు ఇచ్చాం. జెరూసలేం వెళ్లే వారికి ఆర్థిక సాయం ప్రవేశపెట్టిన పార్టీ టీడీపీ. క్రైస్తవ విద్యార్థుల కోసం ప్రీ మెట్రిక్ స్కాలర్‌షి్‌పలు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్‌లు వంటివి అందించాం. గత ఐదు సంవత్సరాలలో క్రిస్టియన్ ఎయిడెడ్ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు’ అని అన్నారు. ఈ సందర్భంగా ఆంగ్లంలో ‘భగవంతుడు నిన్ను ఎప్పుడూ ఖాళీగా వదిలిపెట్టడు. నీవు కోల్పోయిన ప్రతి ఒక్కదానిని తిరిగి నీకిస్తాడు. ఆటు పోట్లను ఎదుర్కొన్నపుడు.. నిన్ను మళ్లీ పైకి తీసుకువచ్చేందుకు సహాయం అందిస్తాడు’ అని పేర్కొన్నారు.
స్ఫూర్తిదాయక ఆలోచనలు చేద్దాం
‘డిసెంబరు నుంచి జనవరి 15 వరకు నెల రోజుల పాటు చేసుకునే ఏకైక పండుగ క్రిస్మస్. క్రిస్మస్ సందర్భంగా స్ఫూర్తిదాయక ఆలోచనలు చేద్దాం. ఏసు ప్రభువు ఆలోచనలను ముందుకు తీసుకువెళదాం. వ్యక్తిగతంగా నేను అండగా ఉంటాను. పేదరికం ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటాను’ అని చంద్రబాబు అన్నారు.క్రిస్‌మస్ కేకును కట్ చేసి క్రైస్తవ మతపెద్దలకు తినిపించారు. వారు కూడా ఆయనకు కేకు తినిపించారు. అనంతరం క్యాండిల్స్ చేత పట్టారు. రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూఖ్ మాట్లాడుతూ... గత ఐదేళ్లు రాష్ర్టాన్ని గజనీ మహమ్మద్ కంటే ఎక్కువగా దోపిడీ చేశారని, ఏమీ మిగలలేదన్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ... పదిమందికి నీకున్న దానిని పంచి, కలిసి అందరూ ఆనందాన్ని అనుభవించటమన్నది క్రీస్తు సిద్ధాంతమన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత మాట్లాడుతూ... క్రైస్తవులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.150 కోట్ల నిధులు ఇచ్చినట్టు చెప్పారు. కొడాలి విజయ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ ద్వారకా తిరుమలరావు, మతపెద్దలు పాల్గొన్నారు.